తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసుల నయా స్టైల్​- రోడ్లపైకి వచ్చినవారికి వెరైటీ శిక్షలు - భారతదేశంలో కరోనా వైరస్

లాక్​డౌన్​ నిబంధనలను బేఖాతరు చేస్తూ రోడ్లపైకి వచ్చినవారిని వినూత్న రీతిలో పోలీసులు శిక్షిస్తున్నారు. గుంజీలు తీయించటం, క్షమాపణలు చెప్పించటం సహా బయటకు రాకూడదని ప్రమాణాలు చేయిస్తున్నారు. మరికొన్ని చోట్ల లాఠీలకూ పని చెబుతున్నారు. వివిధ పద్ధతుల్లో ప్రజలను ఇళ్లలోనే ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు.

situps
గుంజీలు

By

Published : Mar 26, 2020, 10:18 AM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు అతిపెద్ద లాక్​డౌన్​ ప్రకటించింది భారత ప్రభుత్వం. 130 కోట్ల మంది ప్రజలను ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటకు రాకుండా చూసేలా పోలీసులు పహారా కాస్తున్నారు.

అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొంతమంది కారణం లేకుండానే వీధుల్లోకి వస్తున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు వినూత్నంగా శిక్షిస్తున్నారు. రోడ్లపైకి వచ్చినవారిని హెచ్చరిస్తూ ఇంట్లో ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నారు.

దిల్లీలో భారీగా కేసులు..

లాక్​డౌన్​ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చినవారిపై దిల్లీలో ఐపీసీ సెక్షన్​ 188 కింద 482 కేసులు నమోదయ్యాయి. 10,249 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 1,964 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజల సమస్యలు తెలుసుకోవటం, లాక్​డౌన్​పై ఉన్న సందేహాలను నివృతి చేయటం కోసం 24 గంటల హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేసింది దిల్లీ పోలీసు విభాగం.

ట్విట్టర్​లో హెచ్చరికలు..

ఆంధ్రప్రదేశ్​లో పోలీసు విభాగం ఓ 14 సెకన్ల వీడియోను పోస్టు చేసింది. వీధుల్లోకి వచ్చినవారితో గుంజీలు తీయిస్తూ మిగతా వారికి హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర పోలీసులు కూడా ఇలాంటి వీడియోనే పోస్ట్ చేశారు. కర్ణాటక కలబురగిలో వీధుల్లోకి వచ్చిన వారిని పోలీసులు ఇలాగే శిక్షించారు.

పంజాబ్​ పోలీస్​..

ఇదే తరహాలో పంజాబ్​లోని బట్లాలో ఓ పోలీసు అధికారి వీధుల్లో తిరుగుతూ ఎక్కడికక్కడ ప్రజలను నిలువరిస్తున్నారు. బయటికి వచ్చినందుకు క్షమాపణలు చెప్పిస్తున్నారు. గుంజీలు తీయిస్తున్నారు. రహదారిపై పడుకోబెట్టి ఇంకోసారి ఇలా చేయమని చెప్పిస్తున్నారు. షాపుల్లో ఎక్కువమంది ఉండకుండా చూడాలని దుకాణాదారులను హెచ్చరిస్తున్నారు.

పంజాబ్​లో పోలీసుల వెరైటీ శిక్షలు

లాఠీ ఛార్జ్​..

తెలంగాణ, రాజస్థాన్​, ఏపీ గుంటూరులో పోలీసులు లాఠీలకూ పనిచెప్పారు. అత్యవసరాల కోసం వచ్చినా పోలీసులు వేధిస్తున్నారని కొంతమంది ట్విట్టర్​లో పోస్టులు చేస్తున్నారు.

తెలంగాణలో ఓ వైద్యురాలిని ఐడీ కార్డు చూపించిన తర్వాత కూడా అడ్డుకోవటం వల్ల పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. బంగాల్​ రాజధాని కోల్​కతాలో తమ వాహనాన్ని ఆపినందుకు ఓ మహిళ.. పోలీసు అధికారిపై దాడి చేసింది. అధికారి చేతిని కొరికిందని ఆమెతో పాటు ఆ వాహనంలో ఉన్న మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:కరోనా పంజా: భారత్​లో 600 దాటిన కేసులు

ABOUT THE AUTHOR

...view details