భారత్‌లో ఇప్పుడిప్పుడే విజృంభిస్తోన్న కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) రెండో నివేదిక తేల్చింది. గతకొన్ని వారాలుగా వివిధ రాష్ట్రాల్లోని రోగులపై రాండమ్ శాంప్లింగ్ పరీక్షలు నిర్వహించిన ఐసీఎంఆర్ తాజాగా ఫలితాలను వెల్లడించింది. ఆ నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం మన దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పింది.
ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు దేశవ్యాప్తంగా 5,911 మంది ఎస్ఏఆర్ఐ(సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్) పేషెంట్లపై ఐసీఎంఆర్ కరోనా పరీక్షలు నిర్వహించింది. అందులో 20 రాష్ట్రాలకు సంబంధించిన 52 జిల్లాల్లో 104 మందికి (1.8శాతం) కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 40 మందికి (39.2 శాతం) విదేశీ ప్రయాణాలతో లేదా విదేశాల నుంచి వచ్చిన వారితో ఎలాంటి సంబంధాలు లేవని తేలడం గమనార్హం. ఈ కేసులన్నీ 15 రాష్ట్రాల్లోని 36 జిల్లాల్లో నమోదయ్యాయి.
- గుజరాత్‌లో 792 ఎస్ఏఆర్ఐ పేషెంట్లకు కరోనా పరీక్షలు చేయగా 13 మందికి పాజిటివ్ వచ్చింది. (1.6 శాతం).
- తమిళనాడులో 577 ఎస్ఏఆర్ఐ పేషెంట్లకు గాను 5 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. (0.9శాతం).
- మహారాష్ట్రలో 553 ఎస్ఏఆర్ఐ పేషెంట్లకు గాను 21 కేసులు పాజిటివ్‌గా తేలాయి. (3.8శాతం).
- కేరళలో 502 ఎస్ఏఆర్ఐ పేషెంట్లకు ఒక పాజిటివ్ కేసు నమోదయ్యింది.(0.2శాతం).