తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కమల్​ సర్కారుకు షాక్​- రేపే బలపరీక్ష!

మధ్యప్రదేశ్​లో తీవ్ర సంక్షోభంలో ఉన్న కమల్​నాథ్​ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీని స్పీకర్​ వాయిదా వేసిన అనంతరం గవర్నర్​ లాల్జీ టాండన్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. అంతకుముందు సభలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బలపరీక్ష జరగకపోగా.. సభను వాయిదా వేడయంపై భాజపా మండిపడింది.

Kamal
కమల్​నాథ్​

By

Published : Mar 16, 2020, 6:33 PM IST

Updated : Mar 16, 2020, 7:56 PM IST

కమల్​ సర్కారుకు షాక్​- రేపే బలపరీక్ష!

మధ్యప్రదేశ్​ రాజకీయాల్లో మలుపులు కొనసాగుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ పరిణామాల మధ్య సభ వాయిదా పడ్డ కొన్ని గంటలకే గవర్నర్ లాల్జీ టాండన్​​ కీలక నిర్ణయం తీసుకున్నారు. బలపరీక్షను రేపే నిర్వహించాలని ముఖ్యమంత్రి కమల్​నాథ్​ను ఆదేశించారు. లేదంటే ప్రభుత్వానికి సభలో బలం లేదని పరిగణించనున్నట్లు పేర్కొన్నారు.

సభలో...

అంతకుముందు సభలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గవర్నర్ ఆదేశాలు ఉన్నప్పటికీ.. కమల్​నాథ్​ ప్రభుత్వం సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోలేదు. దీనితో పాటు బడ్జెట్​ సమావేశాలను ఈ నెల 26 వరకు వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర స్పీకర్​ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది.

బడ్జెట్​ సమావేశం ప్రారంభంలో సభనుద్దేశించి ప్రసంగించారు గవర్నర్​ లాల్జీ టాండన్​. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని చెప్పి నిమిషాల వ్యవధిలోనే తన ప్రసంగాన్ని ముగించేశారు. ఆ వెంటనే.. కరోనా వైరస్​ వ్యాప్తి అంశాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి గోవింద్​ సింగ్ లేవనెత్తగా... మంత్రితో ఏకీభవించిన స్పీకర్ ప్రజాపతి.. సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అనంతరం సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బలపరీక్ష నిర్వహించాలని భాజపా సభ్యులు డిమాండ్ చేశారు.

గవర్నర్ నివాసానికి

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో గవర్నర్ ఆదేశాలకు అనుగుణంగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సిందేనని అసెంబ్లీలో భాజపా పట్టుబట్టింది. కానీ ఫలితం దక్కలేదు. అసెంబ్లీ వాయిదా పడ్డ అనంతరం 106 మంది భాజపా ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ నివాసానికి వెళ్లారు శివరాజ్​ సింగ్​ చౌహాన్​. బలపరీక్ష వెంటనే నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని వినతి పత్రాన్ని అందించారు.

గవర్నర్​కు కమల్​నాథ్​ లేఖ

బలపరీక్ష అంశంపై మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్ ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్​కు లేఖ రాశారు. కాంగ్రెస్​కు చెందిన ఎమ్మెల్యేలను కర్ణాటక పోలీసుల సహాయంతో భాజపా నిర్బంధంలో ఉంచిందని లేఖలో తెలిపారు. ఈ పరిస్థితుల్లో బలపరీక్ష నిర్వహించడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం అవుతుందని పేర్కొన్నారు. గవర్నర్ అధికారాల గురించి పేర్కొన్న సుప్రీంకోర్టు తీర్పును లేఖలో ప్రస్తావించారు.

"కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కర్ణాటక పోలీసుల సాయంతో భాజపా నిర్బంధించిందని మీ దృష్టికి తీసుకొచ్చాను. వారి చేత బలవంతంగా రాజీనామాలపై ప్రకటన ఇప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలపరీక్ష నిర్వహిస్తే అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ఎమ్మెల్యేలందరూ నిర్బంధం నుంచి విడుదలై, అన్ని ఒత్తిళ్ల నుంచి స్వతంత్రంగా ఉన్నప్పుడే బలపరీక్షకు ఓ అర్థం ఉంటుంది."-కమల్​నాథ్, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి.

సుప్రీంలో వ్యాజ్యం

విశ్వాస పరీక్ష జరగకపోవడం వల్ల ప్రతిపక్ష భాజపా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. బలపరీక్ష నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని భాజపా నేత శివరాజ్​ సింగ్ చౌహాన్ సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు. సోమవారం బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం విస్మరించిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

సంక్షోభం!

22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో కమల్​నాథ్​ ప్రభుత్వం సంక్షోభం అంచులో కూరుకుపోయింది. పార్టీలోని కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్​కు రాజీనామా చేసి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. రాజీనామా చేసిన వారిలో ఆరుగురు మంత్రుల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్​ ప్రభుత్వం మైనారిటీలో ఉన్న నేపథ్యంలో బలపరీక్ష నిర్వహించాలని భాజపా డిమాండ్ చేస్తోంది. నేడు బలపరీక్ష నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించారు గవర్నర్. అయితే ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే సభ వాయిదా పడింది.

230 సీట్లున్న మధ్యప్రదేశ్​ అసెంబ్లీలో ప్రస్తుతం 222 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా కాంగ్రెస్​ 114, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒకరు ఎస్పీ సభ్యుల బలం ఉంది. భాజపాకు 107 స్థానాలు ఉన్నాయి.

Last Updated : Mar 16, 2020, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details