కరోనా వ్యాప్తి నియంత్రణకు నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలుకానున్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇది కర్ఫ్యూలాంటి పరిస్థితి అని, ఉల్లంఘిస్తే బలప్రయోగం తప్పదని ప్రజలను హెచ్చరించారు. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, ప్రాణాలు రక్షించుకోవడానికి మరో మార్గం లేదని స్పష్టం చేశారు.
దేశవ్యాప్త లాక్‌డౌన్ సమయంలో ఇంటి గుమ్మం ముందు ఒక లక్ష్మణరేఖ గీసుకోండి. ఇంటి నుంచి బయట పెట్టే ఒక్క అడుగే కరోనాను మీ ఇంటికి తీసుకొస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కరోనా సోకిన వారిలో ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపించడానికి చాలా రోజులు పడుతుంది. ఆ మధ్యలో తెలిసో తెలియకో చాలామందికి ఆ వ్యాధిని వ్యాప్తి చేస్తారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా ప్రకారం ఈ మహమ్మారి సోకిన వ్యక్తి వారం పదిరోజుల్లో దాన్ని వందల మందికి అంటిస్తారు. ప్రపంచంలో కరోనా సాంక్రమిక రోగుల సంఖ్య తొలిసారి లక్షకు చేరుకోవడానికి 67 రోజులు పడితే, రెండో లక్షకు చేరుకోవడానికి 11 రోజులు, మూడో లక్షకు ఎగబాకడానికి నాలుగే రోజులు పట్టింది. దీన్ని బట్టి ఈ వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థంచేసుకోవచ్చు. అందువల్ల.. సామాజిక దూరాన్ని ప్రధానమంత్రి నుంచి పల్లె వరకూ అందరూ పాటించాలి. ‘ప్రాణం ఉంటేనే ప్రపంచం’ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
కరోనా మహమ్మారి కట్టడికి మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజులపాటు దేశాన్ని పూర్తిగా లాక్‌డౌన్ చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నిర్బంధం అమలయ్యే ఈ సమయంలో దేశంలో ఎవరూ ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టకూడదని నిర్దేశించారు. వైరస్ విజృంభణను అరికట్టడానికి ఇంతకుమించి మార్గం లేదని స్పష్టంచేశారు. ఈ సుదీర్ఘ నిర్బంధానికి అందరూ సహకరించాలని కోరారు. దేశ ప్రజల ప్రాణాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని, దీన్ని ప్రధాన మంత్రి నుంచి గ్రామ పంచాయతీ స్థాయి వరకూ అందరూ పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. కరోనా విస్తృతి నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని స్పష్టంచేశారు. ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే..
జనతా కర్ఫ్యూతో సత్తా చాటాం
ఈ నెల 22న జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడానికి ప్రతి భారతీయుడూ కృషి చేశారు. పిల్లలు, వృద్ధులు, ధనికులు, పేదలు, మధ్య తరగతివారు.. ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ పరీక్షా సమయంలో కలిసి వచ్చారు. దేశానికి సంకట స్థితి ఎదురైనప్పుడు, మానవత్వానికి కష్టం వచ్చినప్పుడు భారతీయులు ఎంత బాధ్యతాయుతంగా, కలిసికట్టుగా ఎదుర్కోగలరన్నది చేతల్లో చూపాం. అందుకోసం కృషిచేసిన ప్రతి ఒక్కరూ ప్రశంసనీయులే
సమర్థ దేశాలూ కుదేలు
సమర్థ దేశాలనూ ఆ మహమ్మారి పూర్తిగా నిర్వీర్యం చేసింది. అలా అని ఆ దేశాలు తమవంతు ప్రయత్నం చేయలేదని కాదు. వారి దగ్గర వనరులు లేకా కాదు. అన్నీ ఉన్నచోట కూడా ఆ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. పూర్తిగా సన్నద్ధమై, తీవ్రంగా శ్రమించినా ఆ దేశాల్లో సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయి. చైనా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఇరాన్ లాంటి అనేక దేశాల్లో కరోనా మొదలైన వెంటనే అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇటలీ, అమెరికాల వైద్యరంగం, ఆసుపత్రులు, ఆర్థిక, ఆధునిక వనరులు ప్రపంచంలోనే మిన్నగా ఉన్నాయి. అయినప్పటికీ ఆ దేశాలు కరోనా ప్రభావాన్ని తగ్గించలేకపోయాయి.
అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్
వైద్య నిపుణులు, ఇతర దేశాల మేధావుల సూచనలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు (మంగళవారం) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించాం. భారతదేశాన్ని కాపాడుకోవడానికి, ప్రతి పౌరుడిని రక్షించుకోవడానికి, మిమ్మల్ని, మీ కుటుంబసభ్యులను కాపాడటానికి ఇంటి నుంచి బయటికి రావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నాం. దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం, పల్లెలు, పట్టణాలు, నగరాలన్నీ లాక్‌డౌన్ అవుతాయి. ఒకరకంగా ఇది కర్ఫ్యూ. జనతా కర్ఫ్యూ కన్నా కఠినం. అవసరమైతే బల ప్రయోగమూ జరుగుతుంది. ఈ లాక్‌డౌన్ ద్వారా తలెత్తే ఆర్థిక భారాన్ని దేశం భుజాలకెత్తుకోవాల్సి వస్తుంది. అయినా ప్రతి భారతీయుడిని రక్షించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం దీనికే ప్రాధాన్యమిస్తున్నాయి. దీనికి అందరూ సహకరించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. దేశంలో ఎక్కడున్నవారు అక్కడే ఉండండి.