కేరళలో మహిళా సాధికారత దిశగా అక్కడి రాష్ట్రప్రభుత్వం చేయూతతో మొదలైన ‘కుటుంబశ్రీ’ ద్వారా లక్షలాదిమంది మహిళలు స్వయం ఉపాధిని పొందుతున్నారు. పలు రంగాల్లో శిక్షణ పొందిన మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా, వారి కుటుంబాలను ఆదుకునే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రమంతా కర్ఫ్యూలో ఉంది. దీంతో గృహనిర్బంధంలో ఉన్న వృద్ధులు, నిరుపేదల ఆకలిని తీర్చడానికి వీరంతా నడుం కట్టారు. ఇందుకోసం ప్రారంభించిన కమ్యూనిటీ కిచెన్లలో ఆహారాన్ని తయారుచేస్తున్నారు. తాజాగా ఉల్లూరు, తిరువనంతపురం, కేరళలో 85 సెంటర్ల ద్వారా ఎంతోమంది అభాగ్యుల ఆకలి తీరుస్తున్నారు. ఇందుకు స్థానిక పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, ఆడిటోరియంలు, కుటుంబశ్రీ యూనిట్లు వేదికలుగా మారాయి.
కరోనా కర్ఫ్యూలో పేదల కోసం 'కుటుంబశ్రీ' నడక - కరోనా సమయంలో కమ్యూనిటీ కిచెన్లు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేరళలో పూర్తి స్థాయి కర్ఫ్యూ విధించారు అధికారులు. ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రంలో గుమ్మం దాటి బయట అడుగు పెట్టలేని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులు, దినసరి కూలీతో బతికే నిరుపేదలు, అనారోగ్యంతో ఇంట్లోనే నిర్బంధంలో ఉన్నవారి ఆకలిని తీర్చడానికి నడుంకట్టారు ‘కుటుంబశ్రీ’ మహిళలు. కమ్యూనిటీ కిచెన్ల పేరుతో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమందికి ఆహారాన్ని ఉచితంగా వండి వడ్డిస్తున్నారు.
పరిశుభ్రత పాటిస్తూ...
కమ్యూనిటీ కిచెన్లలో ఆహారాన్ని తయారుచేస్తున్న కుటుంబశ్రీ సిబ్బంది తెల్లని కోట్లు ధరించి, ముఖాలకు మాస్కులతో, చేతులకు గ్లవుజులు ధరిస్తూ, పరిశుభ్రతను పాటిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా ఉండే వారికి వీరే ఆహారాన్ని ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్యాక్ చేసిన ఆహారాన్ని వాహనాల్లో తరలించి, అవసరమైన చోట అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సెంటర్‌లో ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు... ప్రతి పూటా 500కు పైగా ప్యాకెట్లు తయారుచేసి, వాటిని గంటలోపు ప్రజల వద్దకు చేరుస్తున్నారు. వీరికి సాయం చేయడానికి వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటం విశేషం.