రాజస్థాన్‌లో 40 కొత్త కేసులు
రాజస్థాన్‌లో బుధవారం ఒక్కరోజే 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 383 మంది వైరస్ బారిన పడ్డారు.
22:10 April 08
రాజస్థాన్‌లో 40 కొత్త కేసులు
రాజస్థాన్‌లో బుధవారం ఒక్కరోజే 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 383 మంది వైరస్ బారిన పడ్డారు.
22:05 April 08
పుణెలో 18కి చేరిన కరోనా మరణాలు
పుణెలో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. ఒక్కరోజులోనే రాష్ట్రంలో 10 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 18 మంది వైరస్‌కు బలయ్యారు.
20:17 April 08
ఏప్రిల్ 30 వరకు విమాన సర్వీసులు రద్దు!
ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చాలా దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అత్యవసర సేవలు మినహా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. భారత్‌లోనూ కరోనా వైరస్ తీవత్ర తగ్గి, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు విమాన ప్రయాణాలపై.. ఆంక్షలు ఉంటాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి వెల్లడించారు. అప్పటివరకు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సహకరిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 30వరకు అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్ఇండియా సైతం తన సర్వీసులను రద్దు చేసింది.
20:10 April 08
హిమాచల్‌ప్రదేశ్‌లో కేసుల్లేవ్!
హిమాచల్‌ప్రదేశ్‌లో గత 24 గంటల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు రాలేదని ఆ రాష్ట్ర వైద్య విభాగం వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 27 కేసులు నమోదయ్యాయి.
20:03 April 08
భారత్-అమెరికా కలిసే కరోనాపై పోరు:
కరోనా మహమ్మారిని ఓడించేందుకు అమెరికా, భారత్ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇటీవలె అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌తో.. భారత ప్రధాని మోదీ మాట్లాడగా.. తాజాగా విదేశాంగ శాఖ సెక్రటరీ హర్షవర్ధన్ కూడా యూఎస్ డిప్యూటీ సెక్రటరీ స్టీఫెన్‌తో మాట్లాడారు. ఇరు దేశాలు ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇంకా ఏం చేయాలన్న అంశంపై చర్చించారు. అంతేకాకుండా మందుల సరఫరా, మెడికల్ కిట్లు, పరికరాలు సహా కొవిడ్-19పై పలు అధ్యయనాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనేందుకు కీలక చర్చలు జరిపారు.
19:49 April 08
కేరళలో 9 కరోనా కేసులు:
కేరళలో కొత్తగా 9 కరోనా కేసులు నమోదయ్యాయి. కన్నూర్ నుంచి నలుగురికి, అలెప్పుజ 2, త్రిస్సుర్, పతనతిట్ట, కాసరగూడలో ఒక వ్యక్తికి కరోనా సోకినట్లు సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. మొత్తం కేసుల సంఖ్య 345కు చేరగా... 259 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
19:36 April 08
మహారాష్ట్రలో మరణాలు @ 72
మహారాష్ట్రలో కరోనా కారణంగా గత 24 గంటల్లో 8 మంది మృతిచెందారు. దాదాపు 117 మంది కొత్తగా ఈ వైరస్ బారినపడ్డారు. ఫలితంగా మృతుల సంఖ్య 72కు చేరగా.. బాధితుల సంఖ్య 1135గా నమోదైంది.
19:23 April 08
ఆ వైద్యుడికి వాహనమే నివాసమైంది:
ప్రపంచంపై విరుచుకుపడ్డ కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరులో వైద్యులే యోధులుగా మారుతున్నారు. వృత్తిధర్మంలో భాగంగా తమ ప్రాణాలను పణంగాపెట్టి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా వారి కుటుంబాలకే దూరంగా ఉంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తోన్న ఓ వైద్యుడు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి కారులోనే నివాసమున్న ఘటన అందర్నీ ఆకర్షిస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన డా.సచిన్ నాయక్ స్థానిక జేపీ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. కరోనా వైరస్ బాధితులకు కూడా ఆ ఆసుపత్రిలోనే చికిత్స జరుగుతోంది. ఈ సందర్భంలో పనివేళలు అయిపోయిన అనంతరం ఇంటికి వెళ్తే తన కుటుంబ సభ్యులకూ కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని డా.నాయక్ భావించారు. అందుకోసం తన కారునే నివాసంగా మార్చుకొని ఆసుపత్రి ఆవరణలోనే నివాసం ఉంటున్నారు. తన భార్య, పిల్లలకు వైరస్ సోకకుండా ఉండేందుకే ముందుజాగ్రత్తగా ఇలా చేశానని డా.నాయక్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఇతడి ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇది చూసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ డా.నాయక్‌ను ప్రశంసించారు.
19:18 April 08
'ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ కరోనా టెస్టులు చేయాలి'
ప్రభుత్వ/ ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా టెస్టులు ఉచితంగా చేసేలా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. తక్షణమే కేంద్రం ఇందుకు తగిన నిబంధనలు రూపొందించాలని సూచించింది.
19:13 April 08
పంజాబ్‌లో 7 కేసులు:
పంజాబ్‌లో కొత్తగా 7 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 106కు చేరింది.
19:00 April 08
కర్ణాటకలో మరొకరు మృతి:
కరోనా కారణంగా కర్ణాటకలో మరొకరు మృతి చెందారు. కలబురాగి జిల్లాలో 65 ఏళ్ల మహిళ కొవిడ్-19 పాజిటివ్ లక్షణాలతో చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్య విభాగం వెల్లడించింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 5కు చేరింది. ఇప్పటివరకు 181 కేసులు నమోదు కాగా.. 28 మంది డిశ్చార్జి అయ్యారు.
18:31 April 08
ఐటీశాఖ కీలక నిర్ణయం:
కరోనా నేపథ్యంలో వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు ఉపశమనం కల్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది ఆదాయపు పన్ను శాఖ. పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌లను తక్షణమే విడుదల చేయాలని నిర్ణయించింది. ఐదు లక్షల రూపాయలలోపు ఉన్న 14 లక్షల మందికి ఈ నిర్ణయంతో ఉపశమనం లభించనుంది. జీఎస్టీ, కస్టమ్స్ విభాగాలకు చెందిన దాదాపు మరో లక్ష మంది వ్యాపారులకూ లబ్ధి చేకూరనుంది. దాదాపు రూ.18 వేల కోట్లు రిఫండ్ కింద విడుదల చేయనున్నట్లు ఐటీ శాఖ ప్రకటించింది.
18:23 April 08
దేశవ్యాప్తంగా కరోనా బాధితులు @ 5274
భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దేశంలో 31 రాష్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు 5274 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. వీరిలో 411 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయం వరకు నమోదైన వివరాలను ప్రకటించింది. భారత్‌లో ఇప్పటివరకు కొవిడ్-19 బారిన పడి 149 మంది కోల్పోయినట్లు తెలిపింది.
17:57 April 08
తమిళనాడులో కరోనా కేసులు @ 738
తమిళనాడులో తాజాగా 48 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 738కి చేరింది.
17:47 April 08
లాక్‌డౌన్ పొడిగింపుపైనే మెజారిటీ 'ఓటు'
కరోనా వైరస్‌తో దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మహమ్మారిపై పోరాటానికి పలు పార్టీల నేతలతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని మోదీ. ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగించాలా? వద్దా? అనే అంశంపై చర్చ జరిగింది. దాదాపు 80 శాతం రాజకీయ పార్టీలన్నీ పొడిగింపునకే ఓటు వేసినట్లు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. అయితే ఈ నెల 11న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తర్వాతే మోదీ కీలక నిర్ణయం తీసుకుంటారని ఆజాద్ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కొవిడ్-19పై పోరాటానికి ఒకే తాటిపైకి రావడాన్ని ప్రధాని ప్రశంసించినట్లు ఆజాద్ తెలిపారు.
17:39 April 08
జమ్మూకశ్మీర్‌లో 14 కేసులు:
జమ్మూకశ్మీర్‌లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 14 వైరస్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇప్పటివరకు 139 కేసులు నమోదు కాగా... ఇందులో ఇద్దరు చనిపోయారు. 130 కేసులు యాక్టివ్‌లోనే ఉన్నాయి.
17:29 April 08
పుణెలో ఆరుగురు మృతి:
కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పుణెలో గత 24 గంటల్లో ఆరుగురు చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్య విభాగం వెల్లడించింది. ఫలితంగా ఈ జిల్లాలో మొత్తం మరణాల సంఖ్య 14కి చేరింది.
17:16 April 08
ఒక్కో పేద కుటుంబాన్ని దత్తత తీసుకోండి: మోదీ
"5 నిముషాలు నిల్చొని మోదీని గౌరవించాలని కొందరు తప్పుడు వార్తను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇవి చూశాక కేవలం మోదీని వివాదాల్లోకి లాగే లక్ష్యంగా ఈ వార్తల్ని వ్యాపింపజేస్తున్నారని భావిస్తున్నా".
-- భారత ప్రధాని, నరేంద్ర మోదీ
నిజంగా తన మీద ప్రేమ, గౌరవం ఉంటే ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని వారందరినీ మోదీ కోరారు. కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు తొలగేవరకు ఆ కుటుంబ సభ్యులకు సాయం చేయాలని సూచించారు. ఇదే తనకు గొప్ప గౌరవమని అభిప్రాయపడ్డారు.
16:53 April 08
ముంబయిలో మాస్కులు ధరించడం తప్పనిసరి
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ మరింత అప్రమత్తమైంది. కరోనాను నియంత్రించడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నగరంలో మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారెవరైనా మాస్క్‌లు ధరించాలని ఆదేశించింది.
16:41 April 08
ఎంతమందికి కరోనా టెస్టులు చేశారంటే?
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,21,271 మందికి కరోనా టెస్టులు చేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎమ్ఆర్) స్పష్టం చేసింది.
ఆసుపత్రులు కట్టడం సహా నిఘా పెంచడం, వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టిసారించాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారికి ఇన్ఫెక్షన్ సోకకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించింది.
భారత్‌లో గత 24 గంటల్లో 773 కొత్త కేసులు నమోదవగా.. 32 మంది మరణించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
16:32 April 08
హాట్స్పాట్లలో లాక్‌డౌన్ మరింత కట్టుదిట్టం
కరోనా హాట్స్పాట్లలో లాక్‌డౌన్ మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కరోనా బారిన పడిన వారి సంఖ్య 5194కు చేరింది. గత 24 గంటల్లో 774 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 402 మంది కోలుకోగా.. 149 మంది ప్రాణలు కోల్పోయారు. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది.
15:56 April 08
లాక్‌డౌన్‌పై మోదీ నిర్ణయం 11 తర్వాతే:
ఏప్రిల్ 14తో ముగియనున్న లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా? లేదా? అన్న అంశంపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. మాజీ ప్రధానులు, రాష్ట్రపతులు, పలు పార్టీ అధినేతలు, విశ్లేషకులతో దీనిపై ప్రధాని మోదీ చర్చిస్తున్నారు. నేడు పలు పార్టీలకు చెందిన నేతలతోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ సంభాషించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోలేదని.. ఏప్రిల్ 11న ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాతే కీలక ప్రకటన చేసే అవకాశముందని సమాచారం.
15:52 April 08
ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని భావించింది పంజాబ్ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏప్రిల్ 14తో ముగియనున్న లాక్‌డౌన్‌ను.. రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా నిలిచింది.
ఈరోజు పలు రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ భేటీలో కరోనా లాక్‌డౌన్ పొడిగించే అవకాశంపై చర్చించారు. ఈ నెల 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ మాట్లాడనున్నారు. ఆ తర్వాత లాక్‌డౌన్‌పై కీలకప్రకటన చేయనున్నారు.
15:48 April 08
ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ పొడిగించే అవకాశం!
కరోనా నియంత్రణ కోసం ఏప్రిల్ 14 వరకు విధించిన లాక్‌డౌన్ మరింత కాలం పొడిగించే అవకాశం ఉందన్నారు జనతాదళ్ ఎంపీ పింకీ మిశ్రా. అన్ని పార్టీల ఎంపీలతో ప్రధాని మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
15:28 April 08
పారిశుద్ధ్య కార్మికుల చేత అంత్యక్రియలు:
మహారాష్ట్రలో కరోనా ప్రతాపం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు పుణెలో గత 24 గంటల్లో ఐదుగురు మృతిచెందారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 13కు చేరింది. తాజాగా చనిపోయివారిలో ఇద్దరి మృతదేహాలను తీసుకునేందుకు కుటుంబసభ్యులు వెనకడుగు వేసినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా పుణె మున్సిపల్ కార్మికులే వారికి చివరి వీడ్కోలు నిర్వహించినట్లు.. మున్సిపల్ కమిషనర్ శేఖర్ గైక్వాడ్ వెల్లడించారు.
15:11 April 08
మీ అవసరం చాలా ఉంది: ఉద్ధవ్ థాక్రే
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా వైద్యులు, నర్సుల కొరతను అధిగమించేందుకు మరో కీలక ప్రకటన చేసింది. ఆర్మీలోని వైద్య విభాగంలో సేవలందించి పదవీ విరమణ పొందినవాళ్లను రాష్ట్రం తరఫున ఆసుపత్రుల్లో సేవలందించాలని కోరింది. నర్సులు, వార్డ్ బాయ్‌లు పనిచేసినవాళ్లూ కష్ట కాలంలో సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరింది. ఈ సమయంలో రాష్ట్రానికి మీ అవసరం చాలా ఉందని సీఎం ఉద్ధవ్ థాక్రే స్వయంగా పిలుపునిచ్చారు. వారందరూ 'కోవిడ్యోధా' అనే ప్రత్యేకమైన మెయిల్‌కు సమాచారం అందించాలని కోరారు.
దేశంలో కరోనా ప్రభావం మహారాష్ట్రలో అత్యధికంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 1,018 కేసులు నమోదవగా.. 64 మంది మృతి చెందారు. 79 మంది కోలుకున్నారు.
15:03 April 08
ఎంపీలతో కేజ్రీవాల్ సమావేశం:
దిల్లీలోని ఎంపీలందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. పార్టీలను పక్కనపెట్టి కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అందరూ ఏకతాటిపైకి రావాలని ఆయన కోరారు. ఇందులో భాజపా లోక్‌సభ అభ్యర్థులు ఏడుగురు పాల్గొన్నారు. అందరి నుంచి పలు సలహాలు తీసుకున్నారు. కొంతమంది ఇచ్చిన సూచనలను త్వరలో అమలు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు.
దేశ రాజధానిలో ఐదు పాయింట్ల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ఇటీవలె కేజ్రీవాల్ ప్రకటించారు. ఇందులో భాగంగా హాట్స్పాట్లలో ఒక లక్ష ర్యాపిడ్ యాంటీ బాడీ బ్లడ్ టెస్టులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దిల్లీలో ఇప్పటివరకు మొత్తం 576 కరోనా కేసులు నమోదయ్యాయి.
14:50 April 08
లాక్‌డౌన్‌లో ఉపాధ్యాయులకు 'గురు దక్షిణ':
చదువుచెప్పిన ఉపాధ్యాయుల రుణం తీర్చుకునేందుకు కొందరు విద్యార్థులు లాక్‌డౌన్ సరైనదిగా భావించారు. తమకు పాఠాలు బోధించి, వయసు మీదపడిన గురువులకు ఈ ఆపత్కాల సమయంలో మేమున్నాం అంటూ భరోసానిస్తున్నారు. దక్షిణ కోల్‌కత్తాలోని ఓ స్కూలు విద్యార్థులు 40 మంది కలిసి ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. తమ స్కూలుకు సేవలందించి, ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న 228 మంది మాజీ టీచర్లకు ఈ విద్యార్థులు సేవలందిస్తున్నారు. వైద్య సహాయం కోసం టీచర్లను ఆసుపత్రులకు తీసుకెళ్లడం, నిత్యావసర వస్తువులు, మందులు అందజేయడం వంటి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ సమయంలోనూ ఈ విధంగా సాయపడుతూ ఔరా అనిపించుకుంటున్నారు.
14:38 April 08
15 హాట్స్పాట్లలో పూర్తిగా నిర్బంధం:
ఏప్రిల్ 15 నుంచి దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామని చెప్పిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 13 వరకు హాట్స్పాట్లుగా నిర్ధరించిన కొన్ని ప్రాంతాలను పూర్తిగా లాక్‌డౌన్ చేయన్నట్లు ప్రకటించింది. నేటి నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇందులో లఖ్‌నవూ, ఆగ్రా, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ నగర్, కాన్పూర్, వారణాసి, షామ్లీ, మేరట్, బరేలీ, భులందర్షహర్, ఫిరోజాబాద్, మహరాజ్‌గంజ్, సీతాపుర్, షహరాన్‌పుర్, బస్తీ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
14:33 April 08
ఇద్దరు యోధులు:
కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య ఓవైపు పెరుగుతుంటే.. కోలుకున్న వారి సంఖ్య మాత్రం నామమాత్రంగానే ఉంది. అయితే ఇలాంటి మహమ్మారిని ఎదుర్కొన్న వారు ప్రస్తుతం బాధితులు, ప్రజల్లో ధైర్యం నింపుతున్నారు. కేరళలో తాజాగా ఇద్దరు వ్యక్తులు వైరస్ నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఇటీవలె విదేశాల నుంచి వచ్చిన వీరికి వైద్య పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో వయనాడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వీళ్లు.. పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. తొలి దశ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఇప్పటికే ఆయా ప్రభుత్వాలు ప్రజలను కోరాయి.
13:31 April 08
దిల్లీలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు కోరనా:
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలట్లేదు. అత్యవసర సేవలు అందిస్తున్నవారికి ఈ వైరస్ బెడద ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు డాక్టర్లు, నర్సులు మాత్రమే ఎక్కువగా వీటి బారిన పడ్డారు. ప్రస్తుతం పోలీసులు కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా దిల్లీలోని 49 ఏళ్ల ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కరోనా బాధితుడిగా మారిపోయాడు. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఇతడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఎయిమ్స్ వైద్యులు నిర్ధరించారు. ఇతడు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని అయితే 14 రోజులు హోమ్ క్వారంటైన్ సూచించినట్లు తెలిపారు.
13:18 April 08
పాకిస్థాన్‌లో కరోనా వైరస్ @ 4,072
దాయాది దేశంలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 4,072కు చేరినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో 208 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇందులో 58 మంది చనిపోగా.. 467 మంది కోలుకున్నారు. 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 42,159 మందికి వైరస్ టెస్టులు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
13:02 April 08
జమ్మూకశ్మీర్‌లో మెరుగైన వైద్యం:
కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపర్చేందుకు నిర్ణయం తీసుకుంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వం. మూడో స్థాయి కొవిడ్-19 పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లూ చేస్తోంది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇప్పటివరకు 125 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు మరణించగా... నలుగురు కోలుకున్నారు.
12:46 April 08
భోపాల్‌లో 8 కేసులు:
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కొత్తగా ఎనిమిది కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ రాజధాని ప్రాంతంలో కేసుల సంఖ్య మొత్తం 91కి చేరింది. ఇప్పటికే ఒక వ్యక్తి చనిపోగా, ఇద్దరు కోలుకున్నారు.
12:40 April 08
లాక్‌డౌన్ ఉల్లంఘన.. ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్
మధ్యప్రదేశ్‌కి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్ధార్థ్ కుశ్వారాపై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి నాయి బస్తీ అనే ప్రాంతంలో కొంతమందితో కలిసి ఇతడు ధర్నాకు దిగాడు. ఈ నేపథ్యంలో సెక్షన్ 144 కింద ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వర్గాలు వెల్లడించాయి.
12:36 April 08
కర్ణాటకలో 6 కేసులు నమోదు:
కర్ణాటకలో గత 24 గంటల్లో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 181 పాజిటివ్ కేసులు రాగా.. వారిలో 5గురు చనిపోయారని, 28 మంది డిశ్చార్జి అయ్యారని వైద్య విభాగం వెల్లడించింది.
12:28 April 08
హనుమంతుడి జీవితమే స్ఫూర్తి: మోదీ
నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది. దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌లో ఉండటం వల్ల.. ఆర్థిక స్థితిగతులు తారుమారవుతున్నాయి. వీటిని ఉద్దేశించి మోదీ ట్వీట్ చేశారు.
" భక్తిభావం, బలం, అకింతభావం, క్రమశిక్షణకు.. వాయుపుత్రుని జీవితం నిదర్శనం. ప్రతి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆయన జీవితం స్ఫూర్తినిస్తుంది" అని ప్రజలకు ధైర్యాన్ని నూరిపోసేలా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో పౌర్ణమి రోజున హిందువులు హనుమాన్ జయంతిని జరుపుకొంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఆ పండుగను జరుపుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి.
12:23 April 08
పుణెలో మరో ముగ్గురు మృతి:
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. పుణెలో ఈ వైరస్ కారణంగా తాజాగా మరో ముగ్గురు మరణించారు. వీరందరూ దీర్ఘకాలంగా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్లేనని అధికారులు స్పష్టం చేశారు. పుణెలో మొత్తం మృతుల సంఖ్య 13కు చేరింది.
12:07 April 08
అమెరికాకు ఉచితంగా క్లోరోక్విన్ మాత్రలు!
కరోనా మహమ్మారితో పోరాటం చేస్తోన్న అమెరికాకు చేయూతనందించేందుకు ముందుకొచ్చింది భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త కుటుంబం. కొవిడ్-19 చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్ సల్ఫేట్ మాత్రల్ని.. భారీ స్థాయిలో ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న అమ్నీల్ ఫార్మాస్యూటికల్ ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 34 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల్ని అందించాలని సంస్థ యజమానులు చిరాగ్, చింటు పటేల్ ప్రకటించారు.
ముఖ్యంగా న్యూయార్క్, లూసియానా రాష్ట్రాలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని కంపెనీ తెలిపింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న తయారీ కేంద్రాల్లో నేటి నుంచి వారం రోజుల్లోపు.. దాదాపు రెండు కోట్ల మాత్రలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. వీటిని నేరుగా ఆస్పత్రులు, సంస్థలకు అందించడమే కాకుండా అమ్నీల్‌కు చెందిన రిటైల్, హోల్‌సేల్ విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.
12:01 April 08
ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా:
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ప్రాంతంలో ఒకే కుటుంబంలో ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకింది. వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందరికీ పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. గత నెల నిజాముద్దీన్‌లోని మర్కజ్లో పాల్గొన్న ఓ వ్యక్తిని కలవడం వల్లే ఈ వైరస్ సోకిందని అధికారులు స్పష్టం చేశారు. ఆ వ్యక్తి, తన తల్లి ఇటీవలె ఇదే మహమ్మారి కారణంగా చనిపోయినట్లు వెల్లడించారు.
11:54 April 08
జర్నలిస్ట్ మృతికి ప్రధాని మోదీ సంతాపం:
కరోనా మహమ్మారితో ప్రముఖ జర్నలిస్ట్ కంచిబొట్ల బ్రహ్మానందం మృతిచెందడంపై సంతాపం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కొవిడ్-19 కారణంగా బ్రహ్మానందం మరణించడం ఎంతో కలచివేసిందని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. జర్నలిజంలో కంచిబొట్ల చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
కంచిబొట్ల బ్రహ్మం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందినవారు. రాష్ట్రంలో ఓ ఆంగ్లపత్రిక పాత్రికేయునిగా జీవితం ప్రారంభించిన ఆయన.. తరువాత పలు పత్రికల్లో పనిచేశారు. ఆంగ్ల వార్తా సంస్థ యూఎన్‌ఐలోనూ కీలకంగా సేవలందించారు. తర్వాత అమెరికా వెళ్లి కుటుంబంతో సహా న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. పదిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన.. సోమవారం సాయంత్రం మరణించినట్లు న్యూయార్క్ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు.
11:52 April 08
దిల్లీలో పెరిగిన కరోనా కేసులు:
దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. గత 24 గంటల్లో 51 కేసులు కొత్తగా వచ్చినట్లు అక్కడి వైద్య విభాగం వెల్లడించింది. ఇందులో 35 మంది విదేశాలకు ప్రయాణించినట్లు రికార్డులు ఉండగా, నలుగురు మర్కజ్‌కు వెళ్లిన వారిగా అధికారులు తేల్చారు. పాజిటివ్ వచ్చిన వాళ్లలో ఇద్దరు మృతి చెందారనీ తెలిపారు. ఫలితంగా దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 576కు చేరింది.
11:47 April 08
విపక్ష నేతలతో మోదీ సమావేశం:
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో అన్ని పార్టీల సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు ప్రధాని మోదీ. ఇందులో భాగంగా ఈరోజు విపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. లాక్‌డౌన్ సమయంలో పేద ప్రజలకు ఏ విధంగా మరింత మద్దతుగా నిలవచ్చు అనే దానిపై చర్చించారు. అంతేకాకుండా లాక్‌డౌన్ పొడిగింపుపైనా అభిప్రాయాలు అడిగారు. ఇందులో పలు పార్టీల అధ్యక్షులు, కీలక నేతలు హాజరయ్యారు.
11:10 April 08
గుజరాత్లో మరో నలుగురికి కరోనా:
గుజరాత్లో కొత్తగా నాలుగు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూరత్, వడోదర, భావ్‌నగర్ నుంచి ఈ కేసులు వచ్చినట్లు ఆ రాష్ట్ర వైద్య విభాగం వెల్లడించింది. మొత్తం బాధితుల సంఖ్య 179కి చేరింది. ఇందులో 83 కేసులు అహ్మదాబాద్‌లోనే నమోదైనట్లు తెలిపారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 16 మంది చనిపోగా.. 25 మంది డిశ్చార్జి అయ్యారు. 138 యాక్టివ్ కేసులు ఉండగా... ఇద్దరిని వెంటిలేటర్‌పై ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి టెస్టులు చేస్తున్నట్లు గుజరాత్ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో 932 మంది నమూనాలు సేకరించామని... ఇందులో 14 మందికి పాజిటివ్ ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. మరో 231 మంది ఫలితాలు రావాల్సి ఉందన్నారు.
10:43 April 08
పోలీసులకు రూ.50 లక్షల బీమా:
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలోనూ రాత్రీ పగలు తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో మొత్తం 305 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 21 మంది డిశ్చార్జి కాగా.. ముగ్గురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
10:39 April 08
ధారావిలో పెరుగుతున్న కేసులు:
ముంబయిలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 9కి చేరింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 1018 కేసులు నమోదుకాగా.. 64 మంది మరణించారు.
10:30 April 08
పార్లమెంటు పక్ష నేతలతో మోదీ సమావేశం:
దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్ సడలించే విషయంపై వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు పక్ష నేతలతో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. ఈరోజు 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ పొడిగించాలా? వద్దా? అనే అంశంపై సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. కరోనా ప్రజ్వలన కేంద్రాలు (హాట్‌స్పాట్) మినహాయించి దశల వారీగా ఆంక్షలు సడలించే విషయంపైనా చర్చించనున్నారు.దేశ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావమూ ఈ చర్చలో కీలకం కానుంది.
సంక్షేమ పథకాలు, రాష్ట్రాల వారీగా ఆర్థిక స్థితిగతులు సహా పలు వివరాలను తెలుసుకొని.. లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులను చక్కదిద్దేందుకు మినీ ప్యాకేజీ ప్రకటించే అంశంపైనా మాట్లాడనున్నారు. ఇందులో రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, గెహ్లోత్, ప్రహ్లద్ జోషి, నిర్మలా సీతారామన్ సహా శివసేన, లోక్ జనశక్తి, సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, బిజు జనతాదల్ ఇందులో భాగస్వామ్యం కానున్నాయి.
10:20 April 08
ఒక్కరోజులో 35 మరణాలు.. 773 కేసులు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గత 24 గంటల్లో 35 మరణాలు నమోదయ్యాయి. అంతేకాకుండా 773 కేసులు కొత్తగా వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. భారత్‌లో ఇప్పటివరకు 5194 కేసులు నమోదుకాగా.. 4643 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 149 మంది మృతిచెందారు. 401 మంది డిశ్చార్జి అయ్యారు.
10:00 April 08
రాజస్థాన్‌లో కరోనా కేసులు @ 348
రాజస్థాన్‌లో ఐదు కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. బాధితులు బికనీర్, జైపుర్, భన్వారాకు చెందిన వారిగా ఆ రాష్ట వైద్య విభాగం వెల్లడించింది. వీళ్లందరికీ ఇప్పటికే కొవిడ్-19 సోకిన వాళ్ల నుంచి ఈ వైరస్ అంటుకుందని వైద్యులు స్పష్టం చేశారు.
09:51 April 08
భారత్‌లో మృతుల సంఖ్య @ 149:
భారత్‌లో కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 35 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5194 కేసులు నమోదుకాగా.. 4643 యాక్టివ్‌గా ఉన్నాయి. 149 మంది మృతిచెందారు. 401 మంది డిశ్చార్జి అయ్యారు.
09:44 April 08
పుణెలో కరోనాతో ఇద్దరు మృతి:
మహారాష్ట్రలోని పుణెలో రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. 44 ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకగా.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందతూ మృతి చెందాడు. ఇతడికి మానసిక సమస్యలూ ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. కొవిడ్-19 కారణంగా పుణెలోనే 44 ఏళ్ల మరో వ్యక్తి మరణించాడు. ఇతడు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ రెండు మరణాలు కలిపితే పుణెలో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది.
09:29 April 08
గుజరాత్లో మృతులు @ 16
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కరోనా సోకి ఓ చిన్నారి మృతి చెందాడు. 14 నెలల పసిబాబుకు వైద్య పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆసుపత్రిలో చేర్చినప్పుడు బాబు పరిస్థితి కాస్త విషమించడం వల్ల వెంటిలేటరపై ఉంచామని.. అయితే రెండు రోజుల తర్వాత అవయవాలు విఫలమై చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 16కు చేరింది. ఇప్పటివరకు గుజరాత్లో 175 కరోనా కేసులు నమోదయ్యాయి.