ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారితో వివిధ దేశాలు కకావికలం అవుతున్నాయి. ఈ సందర్భంగా మిగతా దేశాలతో పోల్చితే కొవిడ్-19 మరణాల రేటు భారత్‌లోనే అతి తక్కువని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా దేశంలో కొవిడ్ మరణాలు రేటు 3.2శాతం ఉందని.. ఇది ప్రపంచంలోనే అతి తక్కువగా కావడం ఊరటనిచ్చే విషయమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ వెల్లడించారు. ఇప్పటికే ఈ వైరస్ బారినపడిన వారిలో 10,633మంది కోలుకున్నారని తెలిపారు.
కరోనా మరణాల రేటు భారత్‌లోనే తక్కువ!
ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్‌లోనే కరోనా మరణాల రేటు తక్కువని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా మృతి చెందిన వారితో కలిపి కొవిడ్ మరణాలు రేటు 3.2 శాతమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు.
ఈ వైరస్ నుంచి కోలుకుంటున్న వారిశాతం భారత్‌లో 26.59గా ఉండటం ఊరట కలిగిస్తోంది. అయితే, గత 14రోజుల క్రితం కేసుల రెట్టింపు 10.5 రోజులు ఉండగా.. ప్రస్తుతం 12రోజులకు చేరిందని కేంద్రమంత్రి తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 10లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా వీరిలో దాదాపు 30వేల మందికి రెండోసారి పరీక్షలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా ఆదివారం నాటికి కరోనా వైరస్ బాధితుల సంఖ్య 39,980కి చేరగా 1301మంది మృత్యువాతపడ్డారు. కేవలం గడచిన 24గంటల్లోనే అత్యధికంగా 2,644 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి.