ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా సహజంగా రాలేదని.. ల్యాబ్లో తయారు చేసినదే అంటూ వ్యాఖ్యానించారు కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు.
" మనం కరోనాతో కలిసి బతకడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ సహజ సిద్ధంగా వచ్చినది కాదు. ల్యాబ్లో తయారుచేసినది. ప్రపంచ దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి."
-- నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి.
కరోనా సంక్షోభంతో పరిశ్రమలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన అంశంపై స్పందించిన గడ్కరీ... ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అనుకూలతలు సృష్టించడం సవాలుతో కూడుకున్నదని అన్నారు. భారత్ ప్రస్తుత పరిస్థితులకు సన్నద్ధంగానే ఉందని అభిప్రాయపడిన గడ్కరీ.. ధైర్యంగా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
కరోనా చైనాలోని ఓ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. అమెరికాతో పాటు బ్రిటన్, జర్మనీ వంటి దేశాలూ ఆ దేశంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. భారత్ మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు సమన్వయం పాటిస్తూ వస్తోంది. అయితే తొలిసారిగా భారత్కు చెందిన ఓ మంత్రి చైనాపై ఈ విధంగా విమర్శలు చేయడం సంచలనమైంది.