అంటువ్యాధులు ప్రబలిన ప్రతిసారీ వినిపించే పదం 'సూపర్ స్ప్రెడర్'. ఒక మహమ్మారిని అత్యధిక మందికి వ్యాపింపజేసిన వ్యక్తికి ఈ పదాన్ని వాడతారు. వీరి ద్వారా కొన్ని సందర్భాల్లో వేల మందికి వ్యాధి వ్యాపిస్తుంది. దీన్ని అడ్డుకోవాలంటే సూపర్ స్ప్రెడర్‌ను గుర్తించడం చాలా అవసరం. వీరిలో కొందరిలో అరుదైన సందర్భాల్లోనూ వ్యాధి లక్షణాలు బయటపడవు. కానీ, వాహకులుగా పనిచేస్తారు.
చరిత్రలో 'టైఫాయిడ్ మేరీ' పేరు సూపర్ స్ప్రెడర్‌కు ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. 1869-1938 మధ్య కాలంలో జీవించిన ఆమెలో ఎప్పుడూ టైఫాయిడ్ లక్షణాలు బయటపడలేదు. దీంతో ఆమె టైఫాయిడ్‌కు నిశ్శబ్ద వాహకురాలిగా మారింది. దాదాపు 51 మందికి వ్యాధిని వ్యాప్తి చేసింది. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు..! దీంతో ఆమెను మరణించే వరకు క్వారంటైన్‌లో ఉంచాల్సి వచ్చింది.
2002లో వచ్చిన 'సార్స్' కంటే కొవిడ్-19కు వేగంగా వ్యాపించే లక్షణముంది. 200కుపైగా దేశాల్లో విజృంభించిన ఈ వైరస్‌కు భారీ సంఖ్యలో సూపర్ స్ప్రెడర్‌లు ఉన్నారు. వీరి కారణంగా దేశాలు గజగజలాడిపోయాయి.
దక్షిణ కొరియా పేషెంట్ 31
దక్షిణ కొరియాలో భారీ సంఖ్యలో ప్రజలు కొవిడ్ బారినపడటానికి పేషెంట్ 31గా పేరు తెచ్చుకొన్న మహిళ కారణమైంది. కొవిడ్ లక్షణాలతో ఉన్న ఆమెను తొలుత వైద్యులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కానీ, ఆమె స్థానికంగా ప్రార్థనా మందిరంలో స్వచ్ఛందంగా సేవ చేసింది. ఈ క్రమంలో ఒక హోటల్‌లో భోజనం చేసింది. ఆ తర్వాత కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ది కొరియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లెక్కల ప్రకారం ఆమె కనీసం 1,160 మందికి ఈ వ్యాధిని వ్యాప్తిచేసింది. డేగూ అనే పట్టణంలో సోకిన మొత్తం కరోనా కేసుల్లో దాదాపు 60 శాతం ఈమె వల్ల వ్యాపించినవే.
బ్రిటన్ స్టీవ్ వాల్ష్
బ్రిటన్‌లో ఇప్పటిదాకా స్టీవ్ వాల్ష్ అనే వ్యాపారవేత్తను సూపర్ స్ప్రెడర్‌గా భావిస్తున్నారు. సింగపూర్ వెళ్లిన సందర్భంగా ఆయన కొవిడ్ బారిన పడ్డాడు. ఆయన తన ప్రయాణంలో కనీసం 11 మందికి కొవిడ్‌ను వ్యాప్తిచేశాడు.
భారత్‌లోని వేర్వేరు రాష్ట్రాల్లో...
పంజాబ్ బల్‌దేవ్‌సింగ్
పథ్లావా గ్రామ గురుద్వారాలో బోధకుడు బల్‌దేవ్‌సింగ్ జర్మనీ, ఇటలీలో పర్యటించి మార్చి 7న భారత్‌కు వచ్చాడు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి వేల మందితో కలిసి హోలా మొహల్లా వేడుకకు హాజరయ్యాడు. ఆ తర్వాత అనారోగ్యంతో మృతిచెందాడు. బల్‌దేవ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. పంజాబ్‌లోని తొలి 33 కేసుల్లో 32కు బల్‌దేవ్ సింగ్‌తో సంబంధం ఉంది. దీంతో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో 40 వేల మంది స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
దిల్లీ మొహల్లా క్లినిక్ వైద్యుడు
మొహల్లా క్లినిక్‌లో ఒక వైద్యుడు సౌదీఅరేబియా నుంచి వచ్చిన కొవిడ్-19 రోగిని పరీక్షించాడు. ఈ క్రమంలో ఆ వైద్యుడికి కూడా సోకింది. దీంతో ఆయన చికిత్స చేసిన 900 మందిని నిర్బంధంలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రాజస్థాన్ వైద్యుడు
రాజస్థాన్‌లోని భిల్వారాలో ఓ వైద్యుడు సౌదీ నుంచి వచ్చిన బంధువుకు ఆశ్రయం ఇచ్చాడు. ఆ బంధువు నుంచి సదరు వైద్యుడికి కొవిడ్ సోకింది. లక్షణాలు బయటపడక ముందే తాను పనిచేసే ఆసుపత్రిలో 16 మందికి ఈ వ్యాధిని వ్యాప్తిచేశాడు. 8,000 మంది స్వీయనిర్బంధంలో ఉన్నారు.