కరోనా వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా ఏప్రిల్ 15 వరకు అన్ని రకాల వీసాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సస్పెన్షన్ మార్చి 13 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే దౌత్య, ఉపాధి వంటి కొన్ని రకాల వీసాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం (జీఓఎమ్) ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
"దౌత్య, అధికారిక, ఐక్యరాజ్యసమితి/అంతర్జాతీయ సంస్థలు, ఉపాధి, ప్రాజెక్టు వీసాలు మినహా మిగిలిన అన్ని వీసాలు 2020 ఏప్రిల్ 15 వరకు నిలిపివేస్తున్నాం. వీసా సస్పెన్షన్ మార్చి 13 నుంచి అమల్లోకి వస్తుంది."- జీఓఎమ్ ప్రకటన
అనవసర ప్రయాణాలు వద్దు
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారతీయులెవరూ అత్యవసరమైతే తప్పా.. విదేశీ ప్రయాణాలు చేయవద్దని జీఓఎమ్ గట్టిగా హెచ్చరించింది.
ఓసీఐ
ఓవర్సీస్ సిటిజెన్షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారులకు కూడా వీసా రహిత ప్రయాణ సౌకర్యం ఏప్రిల్ 15 వరకు నిలిపివేస్తున్నట్లు జీఓఎమ్ స్పష్టం చేసింది.
14 రోజుల నిర్బంధం తప్పనిసరి
సరైన కారణంతో భారతదేశానికి రావాలనుకునే ఏ విదేశీ జాతీయులైనా సమీప భారతీయ మిషన్‌ను సంప్రదించొచ్చని జీఓఎమ్ తెలిపింది. అలాగే ఫిబ్రవరి 15 తరువాత చైనా, ఇటలీ, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ నుంచి వచ్చిన భారతీయ పౌరులతో సహా ప్రయాణికులందరూ కనీసం 14 రోజుల పాటు నిర్బంధ కరోనా పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
విమాన సేవలు బంద్
కరోనా భయాలతో.. రోమ్, మిలాన్, సియోల్ దేశాలకు తమ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇటలీలోని రోమ్కు మార్చి 15 నుంచి 25 వరకు, మిలాన్, సియోల్‌కు మార్చి 14 నుంచి 28 వరకు ఎయిర్ ఇండియా విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:'దిల్లీ అల్లర్లకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలం'