దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో, మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహించింది. అలాగే 21 రోజుల లాక్డౌన్ వల్ల తలెత్తే పరిస్థితులపైనా సమీక్ష చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు.
రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఈ సమీక్ష నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి రాంవిలాస్ పాసవాన్, సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ సహా పలువురు మంత్రులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
కరోనా కట్టడికి
కరోనా కేసుల నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలతోపాటు, లాక్డౌన్ సమయంలో సరిపడా ఔషధాలు, నిత్యావసర వస్తువుల సరఫరా ఏర్పాట్లు గురించి మంత్రులు చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సాయుధ దళాల ఆసుపత్రుల్లో పరీక్షలు
కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సాయుధ దళాల ఆసుపత్రుల్లో ఐదు వైరల్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు రక్షణమంత్రిత్వ శాఖ తెలిపింది.
దిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రీసెర్చ్ అండ్ రెఫరల్), బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ కమాండ్ ఆసుపత్రి, పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ, లఖ్‌నవూలోని కమాండ్ హాస్పిటల్, ఉదంపుర్లోని కమాండ్ ఆసుపత్రిలో వైరల్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటుచేశారు.