ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ విజృంభణకు దేశదేశాల్లో ఎన్నో రంగాలు, జీవితాలు నిస్తేజమవుతున్నాయి. అనూహ్య స్థాయిలో ఉపాధి అవకాశాలు తెగ్గోసుకుపోతున్నాయి. దేశీయంగా అసంఘటిత రంగంలోని అసంఖ్యాకుల బతుకు దీపాలే కాదు, ఖరారయ్యాయనుకున్న ఐఐటీల ప్రాంగణ కొలువులూ ఆరిపోతున్నాయి. కరోనా మహా సంక్షోభం మూలాన విశ్వవ్యాప్తంగా 125 కోట్లమంది శ్రామికుల జీవనోపాధికి ముప్పు ఏర్పడినట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తాజాగా మదింపువేసింది.
భారత్‌లోనూ..
భారత్‌లోని అసంఘటిత రంగంలో 40కోట్లమంది వరకు కార్మికులు దుర్భర పేదరికంలోకి జారిపోయే ప్రమాదం పొంచి ఉందనీ అది హెచ్చరించింది. ఐఎల్‌ఓ అధ్యయనంతోపాటు వెలుగు చూసిన సీఎమ్‌ఐఈ (భారత ఆర్థిక రంగ పర్యవేక్షక కేంద్రం) నివేదికాంశాలు- గత నెల మూడోవారం దరిమిలా దేశంలో నిరుద్యోగిత మూడింతలైందని స్పష్టీకరిస్తున్నాయి. నిజానికిది, దెబ్బమీద దెబ్బ. ఆరు నెలల క్రితమే ఆర్థిక మాంద్యం ముదురుతున్న చిన్నెలు ప్రస్ఫుటమయ్యాయి. స్థిరాస్తి, ఆటొమొబైల్ మొదలు ఆతిథ్య, రవాణా, సమాచార ప్రసార, వ్యవసాయ తదితర రంగాల్నీ మాంద్యం అప్పటికే ఆవరించింది. కరోనా రూపేణా మహోత్పాతం విరుచుకుపడ్డాక, ప్రపంచ యుద్ధాలనాటి పరిస్థితులకు మించిన సవాళ్లు ఎదురవుతున్నట్లు ప్రధానమంత్రే అంగీకరించారు. దీటైన పరిష్కారాన్వేషణలో ప్రభుత్వం ఎంత మేరకు కృతకృత్యమైనట్లు?
ఉద్దీపన చర్యలు..
మాంద్యానికి విరుగుడుగా ప్రభుత్వ వ్యయీకరణను భారీగా పెంచడంలో అమెరికా, బ్రిటన్, జర్మనీ ప్రభృత దేశాల చొరవను ఆర్థిక నిపుణులెందరో గతంలో ప్రశంసించారు. కరోనా రూపేణా సంక్షోభ తీవ్రతను పసిగట్టగానే ఉద్దీపన ప్యాకేజీల్లోనూ ఉట్టిపడింది అదే ముందుచూపు! సుమారు 370 బిలియన్ యూరోల(దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు)ను ప్రత్యేకించిన బ్రిటన్- వ్యాపార సంస్థలకు ఏడాదిపాటు వడ్డీలేని రుణాలు అందిస్తోంది. కిరాయి ఇళ్లలో నివసించేవారికి ఆర్థిక తోడ్పాటు సమకూరుస్తోంది. వివిధ సంస్థల సిబ్బంది వేతనాల్లో 80శాతం మేర అక్కడి ప్రభుత్వమే భరిస్తోంది. తన వంతుగా అమెరికా రెండు లక్షల కోట్ల డాలర్ల భూరి ప్యాకేజీలో భాగంగా లక్షలాది శ్రామికులకు సాయపడుతోంది.