దేశంలో మరో ముగ్గురిని బలిగొన్న కరోనా - కరోనా కొత్త కేసులు
దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఇవాళ మరో ముగ్గురు వైరస్‌కు బలికాగా.. మృతుల సంఖ్య 7కు చేరింది. ఇప్పటివరకు 341 మంది వైరస్ బారిన పడ్డారు. అత్యధికంగా మహారాష్ట్రలో 74 మందికి ఈ మహమ్మారి సోకింది.
దేశంలో మరో ముగ్గురిని బలితీసుకున్న కరోనా
By
Published : Mar 22, 2020, 7:04 PM IST
భారత్‌లో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. ఆదివారం వైరస్ కారణంగా మరో ముగ్గురు మరణించగా.. మృతుల సంఖ్య 7కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 341 మందికి వైరస్ సోకింది.
ఇవాళ మృతిచెందిన వారిలో 38 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. బిహార్‌కు చెందిన ఇతను ఇటీవలే ఖతార్ వెళ్లొచ్చాడు. పట్నాలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. దేశంలో వైరస్‌తో మృతిచెందిన వారిలో పిన్న వయస్కుడు ఇతడే కావడం గమనార్హం.
వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో మరో మరణం సంభవించింది. 63 ఏళ్ల వ్యక్తి ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించాడు. ఒక్క మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 74కు చేరింది. గుజరాత్‌లోనూ 69 ఏళ్ల వ్యక్తి మరణించాడు.