కరోనాపై పోరుకు కేంద్రం... ఎంపీల జీతాల్లో 30శాతం కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. అయితే ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని.. 2 సంవత్సరాల పాటు కేంద్రం రద్దు చేయడాన్ని వ్యతిరేకించింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది.
ఈ ఎంపీ ల్యాడ్స్ నిధులను ఎంపీలు తమ వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకోవట్లేదని, తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
"ఏంపీల జీతాల్లో కోతను కాంగ్రెస్ స్వాగతిస్తుంది. కానీ ఎంపీ ల్యాడ్స్ ఓ ఎంపీ.. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వినియోగించే నిధులని మీరు గుర్తించాలి. వీటిని రద్దు చేస్తే.. నియోజకవర్గం అభివృద్ధిలో ఓ ఎంపీ పాత్ర ఏమాత్రం ఉంటుంది? ఈ నిధులను మేము ప్రకృతి వైపరిత్యాలు, కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులు సంభవించినప్పుడు.. వాటిని ఎదుర్కొనేందుకు కూడా వినియోగిస్తున్నాము. ఒకవేళ ఈ నిధులను కేంద్రం సమకూర్చకపోతే... ఈ ప్రభావం నేరుగా ప్రజలపై పడుతుంది. ఎంపీలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం సమర్థవంతంగా పనిచేయలేరు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉంది."
- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి.