కొవిడ్ వ్యాప్తి గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 9,354కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 324 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
ఆధారం: భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాల్లో స్వైరవిహారం
మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌లో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో ఇవాళ 82 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,351కి చేరుకుంది. ఇందులో 217 మంది కోలుకోగా.. 149 మంది మరణించారు. 1985 మంది చికిత్స పొందుతున్నారు.
తమిళనాడులో నేడు 98 కొత్త కేసుల నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 1,173కి చేరింది.
రాజస్థాన్‌లో కేసుల సంఖ్య 828కి చేరింది. 21 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలో ఈరోజు 15 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 247కు చేరినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇందులో 59 మంది డిశ్చార్జ్ కాగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
లాక్డౌన్ పొడగింపు
దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు ముందుగానే లాక్డౌన్ పొడిగిస్తున్నాయి. ఇప్పటికే ఆరు రాష్ట్రాలు లాక్డౌన్ పొడిగించగా.. తాజాగా తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 30 వరకు ఆంక్షలు కొనసాగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశాయి. రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.
14 రోజులుగా కేసులే లేవు
గతంలో కేసులు నమోదైన 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో గడిచిన 14 రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రాలు, జిల్లాల్లోని కమాండ్ సెంట్రల్ తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా నియంత్రణ సాధ్యమైందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
కేంద్ర తీసుకున్న చర్యలతో ప్రజలందరికీ నిత్యావసరాలు అందుతున్నాయని స్పష్టంచేశారు. అత్యవసర రంగాల్లో పనిచేసే కూలీలు, కార్మికులను పోలీసులు అడ్డుకోరాదని సూచించారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద మహిళల జన్‌ధన్ ఖాతాల్లో ఇప్పటికే నగదు జమ చేసినట్లు తెలిపారు.
6 వారాలకు సరిపడా కిట్లు
చైనా నుంచి రావాల్సిన కరోనా పరీక్ష కిట్లు తొలి విడతగా ఈనెల 15న భారత్ చేరుకుంటాయని భారతీయ వైద్య పరిశోధన మండలి అధికారి రామన్ ఆర్ గంగాఖేద్కర్ తెలిపారు. కరోనా పరీక్షలు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మరో 6 వారాలపాటు పరీక్షలు చేసేందుకు కిట్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మొత్తం 2లక్షల 6 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.
"నిన్నటి వరకు 2,06,212 మందిని పరీక్షించాం. అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుత కరోనా పరీక్షల వేగాన్ని బట్టి.. మన దగ్గర ఉన్న కిట్లతో 6 వారాల వరకు సులభంగా పరీక్షలు నిర్వహించవచ్చు."-రమణ్ ఆర్ గంగాఖేద్కర్, భారతీయ వైద్య పరిశోధన మండలి అధికారి
జమ్ము కశ్మీర్లో 25 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర పాలిత ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సాల్ వెల్లడించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 270కి చేరినట్లు తెలిపారు. కొత్త కేసులన్నీ జమ్ము డివిజన్‌లోనే గుర్తించినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:లాక్డౌన్ ఎత్తివేత ఒత్తిడిలో ప్రపంచదేశాలు