తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా విజృంభణ: లక్షకు చేరువలో కేసులు - భారత్​లో కరోనా కేసులు

కరోనా మహమ్మారి నలుదిక్కులా చెలరేగుతోంది. దీని బారిన పడి ఇప్పటి వరకు 3,029 మంది మృత్యువాతపడ్డారు. మరో వైపు కేసుల సంఖ్య లక్షకు (96,169) చేరువైంది. అయితే మొత్తం కేసుల్లో 80 వేలకు పైగా 7 రాష్ట్రాల్లోనే నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకీ పరిస్థితి? మే 16 నాటికి కరోనాను నియంత్రించగలుగుతామన్న కేంద్రం అంచనాలు ఎందుకు తప్పాయి? పరిశీలిద్దాం.

కరోనా విజృంభణ: లక్షకు చేరువలో కేసులు
కరోనా విజృంభణ: లక్షకు చేరువలో కేసులు

By

Published : May 19, 2020, 6:55 AM IST

Updated : May 19, 2020, 7:32 AM IST

భారత్‌లో మెల్లగా మొదలైన కరోనా వ్యాప్తి కొన్ని రోజులుగా ఉద్ధృతమైంది. ఇప్పుడు లక్షకు (96,169) చేరువైంది. మృతుల సంఖ్య కూడా 3,029కి చేరింది. మొత్తం కేసుల్లో 80 వేలకు పైగా 7రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, దిల్లీల్లో కేసుల తీవ్రత ఆందోళనకరంగా ఉంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ అధికంగా కేసులున్నాయి. దేశంలోని మహా నగరాలు కొవిడ్‌కు కేంద్రాలుగా మారిపోయాయి. ఎందుకీ పరిస్థితి? మే 16 కల్లా దేశంలో నమోదయ్యే కొత్త కేసులు సున్నా అవుతాయని నెలరోజుల కిందట కేంద్రం వేసిన అంచనాలు తల్లకిందులు కావడానికి కారణాలేమిటి? రాష్ట్రాల్లో ఏయే కారణాలతో కేసులు పెరుగుతున్నాయి? పరిశీలిద్దాం..

కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న జిల్లాలు

దేశ రాజధానిపై వైరస్‌ పంజా

దిల్లీలో కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ఏప్రిల్‌ 18వ తేదీన 1,893గా ఉన్న కేసుల సంఖ్య మే 18 నాటికి 10,054కు చేరింది. ఇక్కడ జనసాంద్రత చాలా ఎక్కువగా ఉండటంతో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కరోల్‌బాగ్‌లో 10 చ.కి.మీ. పరిధిలో 18 లక్షల మంది ఆరోగ్య సేతు యాప్‌ను వాడుతుండటం గమనార్హం. ఆ ప్రాంతంలో యాప్‌ 1,600 కేసులను చూపిస్తోంది. రోజువారీ కేసుల నమోదు సంఖ్య నెలరోజుల్లో బాగా పెరిగింది. నాలుగు రోజులుగా నిత్యం 400కు పైగా వస్తున్నాయి. మర్కజ్‌ ప్రధాన కేంద్రం ఇక్కడే ఉండటం కేసుల పెరుగుదలకు కారణమైంది. దాదాపు 30% కేసులకు దీనితో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉంది. దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చిలో దాదాపు 40% మందిని సరిగా స్క్రీనింగ్‌ చేయకపోవడం, నిత్యం వేల మంది ఇక్కడకు వచ్చిపోవడం వంటి కారణాలతో భారీ సంఖ్యలో కేసులు వచ్చాయి. షాలిమార్‌ బాగ్‌లో నమోదైన 100పైగా కేసులకు సమీపంలోని ఆజాద్‌పురి మండీ కూరగాయల మార్కెట్‌ కారణంగా భావిస్తున్నారు. దిల్లీలో వ్యాపార ప్రాంతాలు బాగా రద్దీగా ఉండటం కూడా కరోనావ్యాప్తికి ఒక కారణమైంది.

యాక్టివ్ కేసులు

వాణిజ్య రాజధాని విలవిల..

దేశంలోని కరోనా కేసుల్లో దాదాపు 30 శాతానికి పైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఏప్రిల్‌ 18 నాటికి ఇక్కడ నమోదైన కేసులు 3,648. మే 18 నాటికి ఆసంఖ్య 33,053కు చేరింది. వీటిలో 18,337 కేసులు ముంబయి, శివారు ప్రాంతాల్లో నమోదయ్యాయి. 1,198 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కారణంగా అత్యధికంగా మృతి చెందిందీ ముంబయిలోనే. లాక్‌డౌన్‌ ప్రకటించాక స్థానికులు చాలారోజులపాటు జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లపై తిరగడం ఒక కారణం. నవీ ముంబయి వ్యవసాయ మార్కెట్‌ను తొలి దశలోనే మూసేయడానికి ఇష్టపడలేదు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో తొలి దశలో కొవిడ్‌ కేసులు వేళ్లూనడానికి కారణమైంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ధారావిలో ఓ వ్యక్తి తబ్లిగీకి వెళ్లిన వారికి ఆశ్రయం ఇవ్వడంతో.. మార్చి23న అక్కడ తొలికేసు నమోదైంది. సోమవారం నాటికి ఒక్క ధారావిలోనే 1,200 కరోనా కేసులు నమోదుకాగా.. 56 మంది మృతి చెందారు. ఠాణేలో 3,065 మందికి కరోనాకు సోకినట్లు తేలింది. పుణెలోనూ 3,161 మంది కొవిడ్‌ బారిన పడగా.. 170 మంది మరణించారు. నాసిక్‌, ఔరంగాబాద్‌, పాల్గఢ్‌, రాయ్‌గఢ్‌, శోలాపుర్‌, నాగ్‌పుర్‌, జల్‌గావ్‌, అకోలా, సతార వంటి చోట్లా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.

గుజరాత్‌లో సూపర్‌ స్ప్రెడర్ల బెంబేలు

పారిశ్రామిక ప్రాంతమైన అహ్మదాబాద్‌ హాట్‌స్పాట్‌గా మారడం గుజరాత్‌కు శాపమైంది. ఏప్రిల్‌ 18న ఇక్కడ 1,376 కేసులు ఉండగా.. మే18 నాటికి అవి 11,379కు చేరాయి. ఒక్క అహ్మదాబాద్‌లోనే 8,420 కేసులు నమోదుకాగా.. 524 మంది చనిపోయారు. దాదాపు 250 మంది తబ్లిగీకి వెళ్లి రావడం, వందల సంఖ్యలో సూపర్‌ స్ప్రెడర్లు ఉండటంతో ఇక్కడ కేసులను అదుపు చేయడం కష్టంగా మారింది. సూరత్‌లో 1,049, వదోదరలో 639 కేసులు వచ్చాయి. భావ్‌నగర్‌, గాంధీనగర్‌, రాజ్‌కోట్‌లోనూ వైరస్‌ భారీగా వ్యాపించింది. ఇక్కడ కొందరు రాజకీయ నాయకులూ ప్రాణాలు కోల్పోయారు. దిల్లీకి వెళ్లి రాష్ట్రానికి వచ్చినవారు పరీక్షలకు రాకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసింది. దీనికి తోడు ఆహార సరఫరా, సూపర్‌ మార్కెట్లు, ఐస్‌క్రీమ్‌ పార్లర్లు వంటివి కొవిడ్‌ వ్యాప్తికి దోహదం చేశాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర సాయుధ బలగాలను రంగంలోకి దింపాల్సి వచ్చింది. అహ్మదాబాద్‌లో 38, సూరత్‌లో 6, వడోదరలో 2 కంపెనీల సీఏపీఎఫ్‌ సిబ్బందిని దించారు. దాదాపు 2 లక్షల కొవిడ్‌ కేర్‌ కిట్లను 600 బృందాలతో కలిసి పంపిణీ చేశారు.

తమిళనాడుకు కోయంబేడు దెబ్బ

తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య చాలా వేగంగా పెరిగిపోతోంది. ఏప్రిల్‌ 18 నాటికి 1,379 కేసులు నమోదవగా... మే 18కి అవి 11,760కు చేరాయి. తొలుత మర్కజ్‌తో సంబంధం ఉన్న కేసులు 800 వరకు రావడంతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ తర్వాత కేసుల పెరుగుదల వేగం మందగించింది. కానీ గత నెల చివర్లో చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్లో ఓకేసు వెలుగు చూసింది. ఇక్కడ 1200 దుకాణాలు ఉన్నాయి. గత నెలలో ఇక్కడ చిల్లర, టోకు వర్తకాలను పూర్తిస్థాయిలో కొనసాగించడం వంటి కారణాలతో వైరస్‌ భారీగా వ్యాపించింది. గత నెలలో నిత్యం ఇక్కడకు 70,000 మంది వచ్చేవారు. తొలుత ఒక కొత్తిమేర వ్యాపారిలో కరోనా లక్షణాలు గుర్తించి.. మిగిలిన వారికి కూడా పరీక్షలు నిర్వహించగా భారీగా కేసులు బయటపడ్డాయి. ఈ మార్కెట్‌ నుంచి 2,100 కేసులు వచ్చినట్లు అధికారికంగా చెబుతున్నారు. దీనికి తోడు ఈ మార్కెట్‌తో సంబంధం ఉన్న కేసులు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా బయటపడుతున్నాయి. చెన్నైలో 6,750 కేసులు నమోదు కాగా.. వీటిల్లో ఎక్కుగా మార్కెట్‌తో సంబంధం ఉన్నవే. కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, విల్లుపురం, అరియాలూరు, పెరంబలూరు, తిరువణ్ణామలైల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.

రాజస్థాన్‌లో ఇలా...

రాజస్థాన్‌లో నమోదైన కరోనా కేసుల్లో దాదాపు సగం కేవలం రెండు నగరాల్లోనే ఉన్నాయి. జైపుర్‌లో 1,598, జోధ్‌పుర్‌లో 1,036 మంది వైరస్‌ బారిన పడ్డారు. గత నెల 18 నాటికి రాష్ట్రంలో 1,351 కేసులు నమోదుకాగా మే 18 నాటికి ఈ సంఖ్య 5,202కు చేరింది. ఈ రాష్ట్రంలోని భిల్వారాలో తొలుత కరోనా ఒక్కసారిగా విస్తరించడంతో అక్కడ పకడ్బందీగా కట్టడి చేశారు. కానీ అజ్మేర్‌, కోట, పర్యాటక ప్రాంతమైన ఉదయ్‌పుర్‌లో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఉదయ్‌పుర్‌లోని 'కంజీ కా హతా' అనే ప్రాంతంలోనే 113 కేసులు వచ్చాయి. ఈ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించారు.

మధ్యప్రదేశ్‌లో రెండు చోట్ల ..

మధ్యప్రదేశ్‌లో రెండు నగరాల్లోనే రాష్ట్రంలో నమోదైన దాదాపు మూడొంతుల కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్‌ 18న 1,402కేసులు నమోదుకాగా.. మే 18 నాటికి 4,977కు చేరుకొన్నాయి. ఇక్కడ ఇండోర్‌లో అత్యధికంగా 2,238, భోపాల్‌లో 900 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 20 తర్వాత నుంచి ఇక్కడ కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతూ వస్తోంది. ఉజ్జయిని, జబల్పుర్‌, బుర్హాన్‌పుర్‌ల్లో కూడా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కేవలం 30 లక్షల జనాభా ఉన్న ఇండోర్‌లో రెండు వేలకు పైగా కేసులు రావడం ఆందోళనకరం.

యూపీలోని ఆగ్రాలో అత్యధికంగా..

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 51 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. గత నెల 18 నాటికి 975 కేసులు ఉండగా.. అవి మే18 నాటికి 4,259కు చేరాయి. 112 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రాలో అత్యధికంగా 810 కేసులు నమోదయ్యాయి. మేరఠ్‌లో 330, కాన్పూర్‌లో 316, లఖ్‌నవూలో 295, గౌతమ్‌ బుద్ధనగర్‌లో 269, షెహరాన్‌పుర్‌లో 219, ఫిరోజాబాద్‌ 200 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:సూపర్ సైక్లోన్​గా 'అంపన్'​.. తీర ప్రాంతాలపై ప్రభావం

Last Updated : May 19, 2020, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details