భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 81కి చేరింది. వీరిలో 16 మంది ఇటలీకి చెందినవారు కాగా.. ఒకరు కెనడావాసిగా గుర్తించారు వైద్యులు. అయితే.. కరోనాతో భయపడాల్సిన పనేమీ లేదని.. దీనికోసం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన అవసరం కూడా లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
"ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఏడుగురు కరోనా బాధితులు కోలుకుంటున్నారు. 71 మంది ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. చైనాకు చెందిన 124 మంది, జపాన్‌కు చెందిన 112 మంది శరణార్థుల్లో కరోనా లేదని నిర్థరణ అయితే.. వారిని విడుదల చేస్తాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మరిగా ప్రకటించింది. అందుకే దేశంలో దాదాపు 42 వేల మందిని పరిశీలనలో ఉంచాం."
- లవ్ అగర్వాల్, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి
సరిహద్దుల్లో నివారణ చర్యలు..
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మొత్తం 37సరిహద్దు చెక్‌పోస్టులలో కేవలం 19 చెక్‌పోస్ట్‌ల వద్ద మాత్రమే అంతర్జాతీయ రాకపోకలను అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. ఇండో-బంగ్లాదేశ్ క్రాస్ బార్డర్ వద్ద ప్యాసింజర్ రైళ్లు, బస్సుల నిలిపివేత ఏప్రిల్ 15 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఇక దౌత్య, ఉద్యోగపరమైనవి తప్పితే మిగతా అన్ని విమానయాన వీసాలను రద్దు చేసింది.