కేంద్ర నాడీ వ్యవస్థపైనా కరోనా వైరస్ ప్రభావం చూపిస్తోందని జోధ్‌పుర్ ఐఐటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ ‘హ్యూమన్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్-2’ (హెచ్‌ఏసీఈ) అనే నిర్దిష్ట రెసెప్టార్‌తో సంధానమవుతున్నట్లు ఇప్పటికే తేలిందని పరిశోధనకు నాయకత్వం వహించిన సుర్జిత్ ఘోష్ చెప్పారు.
"ఇవి మానవ శరీరంలోకి ప్రవేశించడానికి ప్రవేశద్వారాలుగా వైరస్‌కు ఉపయోగపడుతున్నాయి. ఈ రెసెప్టార్లు అనేక అవయవాల్లో ఉన్నాయి. మెదడు కూడా వీటిని కలిగి ఉంటుంది. తొలుత ఈ వైరస్ నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తోంది.
ఆ తర్వాత ముక్కులో వాసనకు సంబంధించిన కణజాలాల (ఆల్‌ఫ్యాక్టరీ మ్యూకోసా) నాడీ కణాలను ఉపయోగించుకొని ఆల్‌ఫ్యాక్టరీ బల్బు వరకూ వైరస్ వ్యాపిస్తుంది. ఈ ఆల్‌ఫ్యాక్టరీ బల్బు అనేది మెదడు ముందు భాగంలో ఉంటుంది. వాసన, రుచి చూసే సామర్థ్యాలకు ఇదే ప్రధాన కారణం."