కొవిడ్-19 చికిత్సలో కీలకంగా మారిన ఔషధం ఫవిపిరవిర్‌ను ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఔషధ తయారీ సంస్థ సిప్లా త్వరలో మార్కెట్‌లో ప్రవేశపెట్టనుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పేర్కొంది. తక్కువ ఖర్చుతో కరోనా ఔషధాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎస్‌ఐఆర్ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. స్ధానికంగా లభ్యమయ్యే రసాయనాలతో ఈ మందును అభివృద్ధి చేసిన సీఎస్‌ఐఆర్ ఈ సాంకేతికతను సిప్లాకు బదలాయించింది.
ఈ మందు త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుందని సీఎస్‌ఐఆర్ ప్రకటించింది. తాము అభివృద్ధి చేసిన సాంకేతికత అత్యంత సమర్థంగా పనిచేస్తుందని, తక్కువ వ్యవధిలోనే ఔషధ తయారీదారులు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేపట్టేందుకు అనువైందని సీఎస్‌ఐఆర్-ఐఐసీఆర్ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ మండే తెలిపారు. ఒక మోస్తరు నుంచి మధ్యస్థంగా కొవిడ్-19తో బాధపడుతున్న రోగుల్లో ఫవిపిరవిర్ మంచి ఫలితాలిస్తున్న విషయం తెలిసిందే.