తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాతో ముప్పు... మానవాళికి కనువిప్పు

కరోనా.. ఈ పేరు వింటేనే యావత్​ ప్రపంచం ఉలికిపడుతోంది. ఇప్పటివరకు వేలాది ప్రాణాలను బలితీసుకుంది. ఈ వైరస్​ నుంచి ప్రజలను కాపాడటానికి వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, సమాచార సాధనాలు, పాలకులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అలాగే ప్రజలు కూడా సామాజిక దూరం పాటిస్తూ, సాధ్యమైనంత తక్కువగా ఇతరులతో కలవడం, పరిశుభ్రతను పాటించడం వంటి చేస్తేనే కరోనాపై అంతిమ విజయం సాధించగలరు.

corona virus special story
కరోనా ముప్పుతో మానవాళికి కనువిప్పు

By

Published : Apr 7, 2020, 6:58 AM IST

గడచిన ఆరు నెలలుగా కంటికి కనిపించని ఒక సూక్ష్మ కణం భూగోళమంతటికీ వ్యాపిస్తూ జన జీవనాన్ని స్తంభింపజేస్తోంది. వేలాది ప్రాణాలను బలితీసుకొంది. ఇంకా బలిగొంటూనే ఉంది. సృష్టికి ప్రతిసృష్టి చేయగలనని విర్రవీగుతున్న 21వ శతాబ్ది మానవుడికి గర్వభంగం చేస్తోంది. సకల చరాచర జగత్తులో తనకు సాటి లేదని ఎనలేని దర్పం ప్రదర్శిస్తున్న ఆధునిక మానవుడికి, నీవు ప్రకృతి ముందు పిపీలికంలాంటివాడివని కనువిప్పు కలిగిస్తోంది. గతేడాది నవంబరు 17న చైనాలోని హుబై రాష్ట్రంలో తొలిసారిగా ఓ 55 ఏళ్ల వ్యక్తికి కోవిడ్‌ 19 వ్యాధి వచ్చిందని ‘ది సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ పత్రిక వెల్లడించింది. సార్స్‌ కోవ్‌-2 అనే వైరస్‌ ఈ వ్యాధికి కారకం. దీన్ని మానవుడు ఎప్పటికి లొంగదీస్తాడో ఇప్పుడప్పుడే చెప్పలేని స్థితి. ఈలోపు వైరస్‌తో సమరంలో మనం తగు పాఠాలు నేర్చుకొంటున్నామా లేదా అని తరచి చూసుకోవాలి.

అంటు వ్యాధుల పుట్టుక

మానవాళికి ఇలాంటి ప్రచ్ఛన్న ప్రమాదాలు కొత్త కావు. దాదాపు 5,000 ఏళ్ల క్రితం చైనాలో ఒక గ్రామం ఏదో తెలియని అంటువ్యాధి వల్ల తుడిచిపెట్టుకుపోయింది. మృతులను ఖననం చేస్తే మహమ్మారి ఇతరులకు వ్యాపిస్తుందనే భయంతోనో ఏమో, దాదాపు 100 మృతదేహాలను ఒకే ఇంట్లో పెట్టి ఆ ఇంటికి నిప్పంటించారు. ఈశాన్య చైనాలో ఉన్న ఆ గ్రామం పేరు హమీన్‌ మంఘా. చరిత్ర పూర్వ కాలం నుంచి విరుచుకుపడుతున్న అంటు వ్యాధుల గురించి మానవ జాతికి ఆ పురాతన గ్రామం హెచ్చరికగా నిలుస్తోంది.

క్రీస్తుపూర్వం 430లో ఏథెన్స్‌ను ప్లేగు వ్యాధి కబళించింది. క్రీస్తు శకం 541-542 మధ్య కాలంలో జస్టినియన్‌ చక్రవర్తి హయాములో విరుచుకుపడిన మరో ప్లేగు బైజాంటైన్‌ సామ్రాజ్య క్షీణతకు నాంది పలికింది. క్రీ.శ.1346-1353 మధ్య బ్యుబోనిక్‌ ప్లేగ్‌ (బ్లాక్‌ డెత్‌) ఐరోపాలో సగంకన్నా ఎక్కువ జనాభాను పొట్టనపెట్టుకొంది. మెక్సికో, మధ్య అమెరికా దేశాల్లో 1545-1548 మధ్య కోకోల్జిట్లి మహమ్మారి కోటిన్నర మందిని బలితీసుకుంది. 16వ శతాబ్దంలో మధ్య, దక్షిణ అమెరికా ఖండ దేశాల్లో పేట్రేగిన అమెరికన్‌ ప్లేగ్‌ స్థానిక తెగల్లో 90 శాతం జనాభా అంతరించిపోవడానికి కారణమైంది. 1918-1920 మధ్య స్పానిష్‌ ఫ్లూ దాదాపు అయిదు కోట్ల మంది ప్రాణాలు తీసిందని అంచనా. 1957-58లో ఆసియన్‌ ఫ్లూ పది లక్షలమందిని బలిగొంది.

ఆ తరవాత హెచ్‌ఐవీ, హెచ్‌1ఎన్‌1 స్వైన్‌ ఫ్లూ, ఎబోలా, సార్స్‌, జికా వైరస్‌లు మానవులకు అంటు వ్యాధుల వల్ల వచ్చే ప్రాణ గండం గురించి హెచ్చరికలుగా నిలుస్తున్నాయి. అదేసమయంలో మానవుడు ఈ మహమ్మారులను ఎప్పటికప్పుడు తట్టుకొంటూ ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. నాగరికతను పునర్నిర్మించుకొంటున్నాడు. కరోనా వైరస్‌ విషయంలోనూ అదే జరగనుంది. అయితే, ఈ మహా జాఢ్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ తదుపరి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడానికి సన్నద్ధులమవుతున్నామా లేదా అన్నది పశ్న.

తాజా ఉదాహరణ కరోనా వైరస్‌

భూగోళం మీద మానవ జనాభా అంతకంతకూ వృద్ధి చెందుతూ పట్టణాలు విస్తరిస్తున్నాయి. జనసమ్మర్దం పెరుగుతోంది. ప్రపంచీకరణ వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసులు పలు దేశాలకు వ్యాపించి, ఎగుమతి దిగుమతులు ఊపందుకున్నాయి. ఉపాధి, వ్యాపారాల కోసం జన వలసలు విజృంభించాయి. ఈ కారణాల వల్ల ఒక చోట పుట్టిన అంటు వ్యాధి- తేలిగ్గా వేగంగా ఇతర ప్రాంతాలకు పాకిపోతోంది. దీనికి తాజా ఉదాహరణ కరోనా వైరస్‌వల్ల పుట్టుకొచ్చిన కోవిడ్‌ 19 వ్యాధే. వలసలు, వాణిజ్యం, సాంకేతిక అనుసంధానాలను ఇప్పటికిప్పుడు నిరోధించలేం కానీ, వీటివల్ల భవిష్యత్తులో మళ్లీ ఏదైనా మహమ్మారి విరుచుకుపడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో నిర్దేశించే విధివిధానాలను ప్రపంచ దేశాలు ముందుగానే రూపొందించుకోవాలి. లాక్‌డౌన్‌ అనేది ఆ విధివిధానాల్లో ముఖ్యమైనది. ఏ దేశంలో అంటు వ్యాధి పుట్టినా ఆ దేశ సర్కారు దాని గురించిన సమాచారాన్ని నిజాయితీగా పారదర్శకంగా ఇతర దేశాలతో పంచుకోవాలి. ఆ అంటు వ్యాధిని కలసికట్టుగా ఎదుర్కోవాలి.

కోవిడ్‌ 19 గురించి పూర్తి సమాచారాన్ని ముందుగానే బయటి ప్రపంచానికి తెలియజెప్పకుండా, రోగ ప్రాంతాల నుంచి జనం ఇతర దేశాలకు వెళ్ళడానికి అనుమతించినందునే ప్రస్తుత ఉపద్రవం సంభవించింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రపంచ దేశాలు తగు మార్గదర్శకాలను ఏర్పరచుకోవాలి. ఆరోగ్యం ముఖ్యమా ఐశ్వర్యం ముఖ్యమా అనే ప్రశ్నను లాక్‌డౌన్‌ కాలం మన ముందుకుతెచ్చింది. పేదలు ఆరోగ్యం కోసం రోజువారీ కూలీని కూడా వదులుకోవలసి వస్తోంది. ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అనే పెద్దల మాట ఇప్పుడు పాడియై వర్ధిల్లుతోంది. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడం రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులకు పిడుగుపాటు. అలాగని లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే అందరికన్నా అత్యధికంగా నష్టపోయేది పేద ప్రజానీకమే. లాక్‌డౌన్‌ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతిని మరణించే ప్రమాదం అందరికన్నా నిరుపేదలకు ఎక్కువ. ప్రస్తుతానికి మనం జీడీపీ వృద్ధి రేటుకన్నా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడటానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. మెరుగైన భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. పరిస్థితి తీవ్రతను బట్టి మన స్పందన ఉండాలి.

లాక్‌డౌన్‌ అమలు చేయడమనేది ఎంతో సాహసోపేతం

మార్చి 25 నుంచి మూడు వారాలపాటు దేశమంతటా లాక్‌డౌన్‌ పాటిస్తున్నాం. 130 కోట్ల పైచిలుకు జనాభా కలిగిన ఈ దేశంలో 21 రోజులపాటు లాక్‌డౌన్‌ అమలు చేయడమనేది ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. కరోనాను ఎదుర్కోవడానికి మన ముందున్న మార్గాలు చాలా పరిమితం. పరిస్థితి మాత్రం అత్యంత తీవ్రం. ఈ నేపథ్యంలో ఏం చేయాలో నిర్ణయించడానికి స్పష్టమైన దృష్టికోణం కావాలి. అది తనకుందని దేశ నాయకత్వం నిరూపించుకొంటోంది. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోనని చాటుకొంటోంది. ప్రజానీకం కూడా ఉక్కు సంకల్పంతో ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉంటోంది. విపత్కర పరిస్థితిలో దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఒక్కమాటపై నిలచి కలసికట్టుగా కార్యాచరణకు దిగడం మన సమాఖ్య స్ఫూర్తికి అద్దం పడుతోంది. రాజకీయంగా వారు ఏకాభిప్రాయం ప్రకటించడం ఎంతో ఆనందకరం. ఇది ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపుతోంది. సంక్షోభాలను సమష్టిగా ఎదుర్కోగలమని జాతి యావత్తూ ఎలుగెత్తి చాటుతోంది.

ప్రపంచానికి స్ఫూర్తినిచ్చేలా...

కరోనాపై పోరాటంలో భారతదేశానిది కీలక పాత్ర కానుంది. మన విజయం ప్రపంచానికి స్ఫూర్తినిస్తుంది. కీలకమవుతుంది. కరోనాపై భారతదేశం సకాలంలో సమర్థంగా పోరు ప్రారంభించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. కరోనా వైరస్‌ వ్యాప్తినీ, మరణాల సంఖ్యనూ చాలా తక్కువ స్థాయికి పరిమితం చేయగలిగాం. తద్వారా కొవిడ్‌ 19 సామాజిక వ్యాప్తిని కట్టడి చేశాం. కరోనా సంక్షోభంలో భారత్‌ మూడో దశకు చేరకుండా నిలువరించగలుగుతున్నాం. అలాగని ఉదాసీనత పనికిరాదు. ముఖ్యంగా తబ్లిగీ మర్కజ్‌ ఉదంతం దృష్ట్యా అత్యంత జాగరూకత ప్రదర్శించాలి. నిరుపేదలు, వలస కూలీలు లాక్‌డౌన్‌ వల్ల అగచాట్ల పాలవకుండా ఆదుకోవడానికి కేంద్రం, రాష్ట్రాలు సత్వర చర్యలు తీసుకున్నాయి.

మన దేశంలో నెలకొన్న సామాజిక సంక్షేమ పథకాలు ఈ విషయంలో ఎంతో అక్కరకొచ్చాయి. కరోనా ముప్పు గురించి ప్రభుత్వం, సమాచార సాధనాలు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి. జనం కూడా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. కరోనాపై గెలవాలంటే మరి కొంతకాలం పోరాడకతప్పదు. ప్రజలు, ప్రభుత్వం ఒకే మాట ఒకే బాటగా ముందుకుసాగుతూ పోరులో నెగ్గాలి. సామాజిక దూరం పాటిస్తూ, సాధ్యమైనంత తక్కువగా ఇతరులతో కలుస్తూ, వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న విధంగా పరిశుభ్రతను పాటిస్తూ ఉంటే కరోనా వ్యాప్తిని ఖాయంగా అడ్డుకోవచ్చు. తబ్లిగీ ఉదంతం మన కళ్లు తెరిపించాలి. భవిష్యత్తులో ఈ తరహా మత సమ్మేళనాలు జరగకుండా నిరోధించాలి.

కలసికట్టుగా పోరాటం సాగించాలి

కరోనా వైరస్‌ మహా మహా దేశాల సత్తాకే సవాలు విసరుతోంది. దాన్ని ఎదుర్కోవడానికి భారతదేశమూ శతధా ప్రయత్నిస్తోంది. కరోనాపై విజయ సాధనకు వ్యక్తులు, సంస్థలు, మౌలిక వసతులు, అంతర్జాతీయ సహకారం కలసికట్టుగా పోరాటం సాగించాలి. ఈ సమరంలోని లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. రేపు ఏదైనా కొత్త మహమ్మారి ముంచుకొస్తే దాన్ని చిత్తు చేయడానికి ప్రస్తుత పోరు పాఠాలు అక్కరకొస్తాయి. భవిష్యత్తులో ఎలాంటి అదృశ్య వైరస్‌లు ముంచుకొస్తాయో ఇప్పుడే అంచనా వేయలేం కానీ, వాటివల్ల కలిగే వినాశకర ఫలితాలను మాత్రం సాధ్యమైనంత తక్కువ స్థాయికి కుదించడం సాధ్యమవుతుంది.

స్థానిక, అంతర్జాతీయ కార్యాచరణల్లో విజయవంతమైనవాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం ఇక్కడ ఎంతో ముఖ్యం. ఈ విపత్కాలంలో ప్రజలను కాపాడటానికి వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, సమాచార సాధనాలు, పాలకులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. జనం కూడా ఈ సమష్టి కృషిలో మమేకమవుతున్నారు. కరోనాపై అంతిమ విజయం సాధించేవరకు ఇదే ఏకాగ్ర దృష్టి, అకుంఠిత దీక్షలను మనం ప్రదర్శించాలి. కరోనా వైరస్‌ల కుటుంబంలో అత్యంత భయంకరమైన సార్స్‌ కోవ్‌-2ని త్వరలోనే చిత్తుచేస్తామని నమ్ముతున్నాను. ఈ విజయం నేర్పిన అనుభవంతో భావి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలమని విశ్వసిస్తున్నాను.

-వెంకయ్యనాయుడు, భారత ఉప రాష్ట్రపతి.

ఇదీ చూడండి : 'ఎంపీ ల్యాడ్స్​ నిధుల రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి'

ABOUT THE AUTHOR

...view details