కరోనా కోరల్లో ప్రపంచమంతా విలవిల్లాడుతోంది. 200లకు పైగా దేశాల్లో 33 లక్షలకు పైగా కేసులు.. 2 లక్షలు దాటిపోయిన మరణాలు.. రూ.లక్షల కోట్లలో ఆర్థిక నష్టం.. ఇలా కొవిడ్ భారీగా కల్లోలం రేపుతోంది. ప్రపంచంలో, భారత్‌లో మహమ్మారి ఏ రీతిలో ప్రభావం చూపుతోందో గణాంకాల్లో చూస్తే..
ప్రపంచంలో అత్యధికంగా కేసులు, మరణాలు నమోదైన దేశం అమెరికా. 10.64 లక్షలకు పైగా కేసులు నమోదవగా, 63 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
కొవిడ్ మహమ్మారి ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2 ట్రిలియన్ డాలర్ల భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు ఐరాస వాణిజ్య, అభివృద్ధి మండలి(యూఎన్‌సీటీఏడీ) అంచనా వేసింది. భారత్ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.150 లక్షల కోట్లు.
భారత్‌లో కరోనా మరణాల రేటు (ఏప్రిల్ 29 నాటికి) 3.17శాతం . ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ రోగుల్లో 7.09 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ మరణాల రేటుతో పోలిస్తే భారత్‌లో ఇది సగం కంటే తక్కువే.
భారత్‌లో నాలుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు నమోదై.. రోగులు పూర్తిగా కోలుకున్నారు. గోవా, మణిపుర్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌లలో వైరస్ బారిన పడిన వారంతా కోలుకోవడం వల్ల ఇక్కడ గురువారం నాటికి సున్నా కేసులున్నాయి.
ప్రపంచంలో 20 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించిన దేశాలు అమెరికా, ఇటలీ, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్ మాత్రమే కావడం గమనార్హం.
ప్రపంచంలో 11 లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధరణ పరీక్షలు జరిపించిన దేశాలు ఆరు . అవి అమెరికా, రష్యా, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
అమెరికా కాకుండా లక్షకు పైగా కేసులు నమోదైన దేశాల సంఖ్య ఏడు . అవి స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, టర్కీ, రష్యా. అమెరికా (10.64 లక్షల కేసులు)తో పాటు ఈ 7 దేశాల్లో కలిపి 22.22 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 68.67 శాతం ఈ దేశాల్లోనే ఉన్నాయి.
భారత్‌లో కేసులు 30 నుంచి 30,000లకు చేరడానికి పట్టిన వారాలు ఎనిమిది. మార్చి 5న 30 కేసులు నమోదవగా ఏప్రిల్ 29 నాటికి కేసుల సంఖ్య 30 వేలు దాటింది.