దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా జాడ కనిపించినప్పుడు గుజరాత్‌లో ఆ ఊసే లేదు. ఇప్పుడక్కడ వైరస్ వ్యాపిస్తున్న తీరు భయాందోళనలను రేకెత్తిస్తోంది. కేసుల సంఖ్యాపరంగా చూస్తే ఈ రాష్ట్రం మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో నిలుస్తోంది. పెరుగుతున్న కేసులు, మరణాలతో మార్చి 22 నుంచి అహ్మదాబాద్ నగరం ఇప్పటికీ హాట్‌స్పాట్‌గానే కొనసాగుతోంది.
ఇలా మొదలు
దిల్లీలో సమావేశంలో పాల్గొని గుజరాత్ తిరిగి వచ్చిన తబ్లిగీలతో తొలుత కరోనా కేసులు పెరిగాయి. పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తమ ఆచూకీ గురించి అధికారులకు తెలపకుండా వేర్వేరు పట్టణాల్లో ఉన్న 126 మందిని అరెస్టుచేసి, ఆసుపత్రుల్లో చేర్పించారు. వారి ద్వారా మిగిలిన వారినీ గుర్తించారు. అహ్మదాబాద్ ఆ తర్వాత సూరత్, రాజ్‌కోట్, వదోదర, భావ్‌నగర్, భుజ్ పట్టణాల్లో కేసులు కనిపించాయి. నానాటికీ అవి పెరుగుతూనే ఉన్నాయి. మరణాలూ పెరిగాయి. కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ బద్రుద్దీన్ షేక్, మరో కాంగ్రెస్ నేత హబీబ్ మెవ్ లాంటి వారూ మృతుల్లో ఉన్నారు.
కఠిన చర్యలు అమలు
వైరస్ వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ముందస్తు చర్యగా మార్చి 22న పాక్షిక లాక్‌డౌన్ ప్రకటించారు. ఆ తర్వాత 24 నుంచి కఠిన లాక్‌డౌన్ అమలవుతోంది. దుకాణాల్ని మూసి వేయించారు. పాలబూత్‌లకు మాత్రం వెసులుబాటు కల్పించారు. పాకిస్థాన్‌తో సరిహద్దు ఉన్న కచ్, బనాస్కాంత, పఠాన్ జిల్లాల్లో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 500 మందిని పోలీసులు అరెస్టుచేశారు. వందలాది వాహనాలను సీజ్ చేశారు. లాక్‌డౌన్ మూడోదశ మరింత కఠినంగా అమలవుతోంది. అయినప్పటికీ పాజిటివ్ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రైవేటు ఆసుపత్రులూ...
దిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం రాష్ట్రానికి వచ్చి, ప్రభుత్వ వైద్యులకు మార్గనిర్దేశం చేసింది. భవిష్యత్తు పరిణామాల్ని పకడ్బందీగా ఎదుర్కొనేందుకు పలు ప్రైవేటు ఆసుపత్రులనూ కరోనా ప్రత్యేక చికిత్సాలయాలుగా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నుంచి కోలుకున్న వారి డిశ్చార్జి విషయంలో భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెలువరించిన మార్గనిర్దేశాలను అనుసరించి... రాష్ట్ర అధికారులు మార్పులు చేశారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ఆసుపత్రుల నుంచి పెద్దసంఖ్యలో రోగులను ఇళ్లకు పంపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది.
అహ్మదాబాద్‌లో ఆ స్థాయిలో ఎందుకు?
దిల్లీ నుంచి వచ్చిన తబ్లీగీల్లో అహ్మదాబాద్ వాసులే 250 మంది ఉన్నారని, మొదట్లో వారు యథేచ్ఛగా ఇతరులను కలవడంతోనే కేసులు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటిదాకా అహ్మదాబాద్‌లో 334 మంది సూపర్ స్ప్రెడర్లను గుర్తించారు. కూరగాయలు, కిరాణా సరకులు, పాల విక్రేతలు, పెట్రోలు బంకుల సిబ్బంది, చెత్త సేకరణ కార్మికులు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వృత్తిపరంగా వీరు ఇతరులను కలవాల్సి ఉంటుందని... అప్పుడు వైరస్ ఒకరి నుంచి ఒకిరికి సోకే ప్రమాదముందని ఈనెల 15 వరకు అహ్మదాబాద్‌లోని అన్ని దుకాణాలనూ మూసేశారు. నగరానికి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ కనీసం 14,000 మంది సూపర్ స్ప్రెడర్లు ఉంటారని భావిస్తున్నట్లు, రాబోయే రోజుల్లో అందరికీ పరీక్షలు చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు.
కోలుకొన్నవారి శాతం పెరిగింది
పరీక్షలు భారీగా చేస్తుండటంతోనే కేసులు ఎక్కువ బయట పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కోలుకుంటున్న వారూ ఎక్కువగానే ఉంటున్నారని, ఇప్పటిదాకా 3,753 మంది స్వస్థత పొంది, ఇళ్లకు వెళ్లారని గుజరాత్ ఆరోగ్య కార్యదర్శి జయంతి రవి తెలిపారు. జాతీయస్థాయి రికవరీ రేటు 31.7% కాగా గుజరాత్‌లో అది 36.5% ఉన్నట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం 30 మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నట్లు వివరించారు. బాధితులకు హోమియోపతి, ఆయుర్వేద వైద్య చికిత్సలనూ అందిస్తున్నామని, హెర్బల్ టీతోపాటు ఆవిరి పట్టుకునే సౌకర్యాన్నీ కల్పిస్తున్నామన్నారు.
విమర్శలు... నిరసనలు
మహమ్మారి వ్యాప్తిని నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య విభాగ యంత్రాంగం విఫలమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని, రోగులకు సరైన చికిత్స అందకనే మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. లాక్‌డౌన్‌తో పనుల్లేక... ఆకలితో ఇబ్బందులు పడుతున్నామని, తమను సొంత రాష్ట్రాలకు పంపాలని వలస కార్మికులు నిరసనలకు దిగుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం...వలస కార్మికుల తరలింపునకు గుజరాత్ నుంచి వేర్వేరు రాష్ట్రాలకు 264 రైళ్లను కేటాయించారు. వీటితోపాటు ఇతర రవాణా సదుపాయాలలో రాష్ట్రం నుంచి దాదాపు 3.17 లక్షల మంది వలస కార్మికులను తరలించారు.
స్ఫూర్తిదాయక విజయం
జునాగఢ్ నగరంతోపాటు జిల్లా అంతటా గడచిన 50 రోజులుగా కరోనాను కట్టడి చేయడంలో అధికారులు స్ఫూర్తిదాయక విజయాన్ని నమోదుచేశారు. లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడంలో పౌరులు చక్కగా సహకరించారని మున్సిపల్ కమిషనర్ తుషార్ సుమేరా ప్రశంసించారు.
మొదలైన కార్యకలాపాలు
లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కొన్ని పనులు మళ్లీ ఊపందుకున్నాయి. అలంగ్‌లోని షిప్ బ్రేకింగ్ యార్డులో ప్రస్తుతం 4ఓడలను విడగొడుతున్నారు. సూరత్ సెజ్‌లో వజ్రాలు, రత్నాలకు సంబంధించిన 8యూనిట్లలో పనులు మొదలయ్యాయి. మూడో విడత లాక్‌డౌన్ ముగియగానే నిర్ధిష్ట జాగ్రత్తలు తీసుకుంటూ పరిశ్రమలను నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమూ అనుమతించింది.