తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో కరోనా కేసులు@536 ... 10కి చేరిన మరణాలు - కరోనా తాజా వార్తలు

LIVE
కరోనా

By

Published : Mar 24, 2020, 7:55 AM IST

Updated : Mar 24, 2020, 11:57 PM IST

23:54 March 24

దేశంలో కరోనా కేసులు 536కు చేరినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 10 మరణాలు సంభవించాయి. తాజా మరణం దిల్లీలో నమోదైంది. 

మహారాష్ట్ర, దిల్లీలో ఇద్దరు చొప్పున కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. బంగాల్​, బిహార్​, కర్ణాటక, పంజాబ్​, గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

22:57 March 24

శబరిమలలో  ఉత్సవాలు రద్దు..

దేశంలో లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో శబరిమలలో జరగాల్సిన ఉత్సవాలను ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు (టీబీడీ) రద్దు చేసింది. బోర్డు పరిధిలోకి వచ్చే అన్ని ఆలయాల్లో ఉత్సవాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 

22:26 March 24

కేంద్రం చేసిన మార్గదర్శకాలు ఇవే.. 

దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్​డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ నేపథ్యంలో స్పష్టమైన నిబంధనలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్​డీఎంఏ)కు అధికారాలు కట్టబెడుతూ ఉత్తర్వులతో పాటు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.  

  • రక్షణ, కేంద్ర పారా మిలిటరీ బలగాలు, ట్రెజరీ, ఇంధన, గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, తపాలా సేవలు, జాతీయ సమాచార వ్యవస్థ, ముందస్తు హెచ్చరికల కేంద్రాలు, విపత్తు నిర్వహణ మినహా అన్ని కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, స్వతంత్ర వ్యవస్థలన్ని మూసివేయాలి.
  • రాష్ట్రాల్లో పోలీసు, హోం గార్డ్స్, పౌర రక్షణ, అగ్నిమాపక, అత్యవసర సేవలు, జైళ్లు, జిల్లా పరిపాలన, ట్రెజరీ, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం నిర్వహణ, నీటి సరఫరా మినహా అన్ని సేవలు బంద్.
  • ఆసుపత్రి, అనుబంధ వ్యవస్థల నిర్వహణ, ఔషధ దుకాణాలు, వైద్య పరికరాల దుకాణాలు, ల్యాబ్​లు, అంబులెన్సులు, వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి మినహాయింపు ఉంటుంది.
  • రేషన్ దుకాణాలు, ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపల దుకాణాలకు తెరిచి ఉంటాయి.
  • అవకాశం ఉన్నంత వరకు స్థానిక పాలన యంత్రాంగం నిత్య అవసరాలను ఇళ్లకే సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలి.
  • బ్యాంకులు, బీమా కార్యాలయాలు, ఏటీఎంలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ వ్యవస్థలు, కేబుల్ సేవలు కొనసాగుతాయి.
  • ఆహార పదార్థాలు, ఔషధాలు, వైద్య పరికరాలు ఈ- కామర్స్ ద్వారా సరఫరా చేసే వారికి మినహాయింపు ఇచ్చారు.
  • పెట్రోల్ పంపు, గ్యాస్ కేంద్రాలు యథావిధిగా నడుస్తాయి.
  • క్షేత్ర స్థాయిలో విద్యుత్ రంగ సేవల్లో పనిచేసే వారికి మినహాయింపు ఉంటుంది.
  • కోల్డ్ స్టోరేజ్​లు, గిడ్డంగులు, నిత్యావసరాల తయారీ యూనిట్లు, ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు మినహాయింపులు ఇచ్చారు.
  • ఇతర ఉత్పత్తుల సంస్థలు విధిగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.
  • అత్యవసర రవాణా సేవలు మినహా మిగిలిన రవాణా వ్యవస్థలన్నీ నిలిపివేత.
  • అన్ని విద్యా, పరిశోధన, శిక్షణ సంస్థలన్నీ మూసివేయాల్సి ఉంటుంది.
  • అన్ని మత సంబంధిత స్థలాలు మూసివేయాలి. మత పరమైన కార్యక్రమాలకు ఎటువంటి మినహాయింపులు లేవు.
  • అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలన్ని రద్దు.
  • ఫిబ్రవరి 15 తరువాత విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా అధికారుల సూచన మేరకు వ్యవహరించాలి. అధికారులు సూచించిన విధంగా ఇంటికి కానీ లేదా నిర్బంధ కేంద్రాలకు పరిమితమవ్వాలి. ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు చేసే సూచనలను పౌరులు పాటించాలి.
  • సామాజిక దూరం కొనసాగించాలి. అన్ని సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. ఉద్యోగులకు కోవిడ్-19 వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • స్థానికంగా ఈ నిబంధనలను అమలు చేసే వారు మినహాయింపులు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని వ్యవహరించాలి.
  • ఈ అర్ధరాత్రి నుంచి నిబంధనలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయి. 21 రోజుల పాటు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందే. జిల్లా న్యాయాధికారి కమాండర్​గా వ్యవహరిస్తూ నిబంధనలన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూడాలి.
  • ఉల్లంఘనలకు కమాండర్​లే బాధ్యులు అవుతారు. స్పష్టంగా మార్గదర్శకాల జాబితా విడుదల చేసిన కేంద్ర హోం శాఖ. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసి సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులు.

21:39 March 24

మరొకరు మృతి..

కరోనా వైరస్​ కారణంగా దేశంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా దిల్లీలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. దీంతో దేశవ్యాప్తంగా కొవిడ్​-19 మరణాలు సంఖ్య 10కి చేరింది.  

21:28 March 24

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​పై కేంద్రం మార్గదర్శకాలు జారీ...

నేటి అర్ధరాత్రి నుంచి దేశమంతా లాక్​డౌన్​ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా 21 రోజుల పాటు పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. నిబంధనలు, జరిమానాల అంశాలతో కూడిన జాబితా వెలువరించింది. 

20:27 March 24

మోదీ ప్రసంగంలోని కీలకాంశాలు
  • వైద్య సదుపాయాల కోసం రూ.15 వేల కోట్లు కేటాయింపు: మోదీ
  • ఆరోగ్య సేవలకే తొలి ప్రధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలను కోరుతున్నా: మోదీ
  • సంక్షోభ సమయంలో భుజం భుజం కలిపి పనిచేయాలి: మోదీ
  • కేంద్ర, రాష్ట్రాలు నిరంతరం ఇదే విషయంపై ఆలోచిస్తున్నాయి: మోదీ
  • నిత్యావసరాలన్నీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం: మోదీ
  • కేంద్ర, రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు పేదల ఇబ్బందులు పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి: మోదీ
  • ప్రజల ప్రాణాలు కాపాడటమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం: మోదీ
  • ఎలాంటి పుకార్లు, వదంతులు, మూఢనమ్మకాలు నమ్మవద్దు: మోదీ
  • కేంద్ర, రాష్ట్రాలు ఇచ్చే మార్గదర్శకాలు పాటించాలి: మోదీ
  • వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోవద్దు: మోదీ
  • నిర్లక్ష్య ధోరణితో మందులు తీసుకుంటే మరింత ప్రమాదంలో పడతారు: మోదీ
  • 21 రోజుల లాక్‌డౌన్‌.. మన ప్రాణాల కంటే ఎక్కువ కాదు: మోదీ

20:23 March 24

ప్రాణాలు కాపాడేవారి క్షేమం కోసం ప్రార్థించాలి: మోదీ

ప్రజల ప్రాణాలు కాపాడేవారి క్షేమం కోసం మనమంతా ప్రార్థించాలి

వైద్యులు, నర్సులు, వైద్యసిబ్బంది.. నిర్విరామంగా పనిచేస్తున్నారు

పరీక్షా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు సరిగా సేవలు అందిస్తున్నారు

సమాజ పారిశుద్ధ్యాన్ని కాపాడుతున్న వారి క్షేమం కోసం ప్రార్థించాలి

24 గంటలూ పనిచేస్తున్న పోలీసులు, మీడియా ప్రతినిధుల క్షేమం కోసం ప్రార్థిద్దాం

20:20 March 24

ఎవరూ బయటకు రాకూడదు: మోదీ

  • ఎవరూ ఇంటినుంచి బయటకు రాకూడదు: మోదీ
  • ఈ దేశంలో ఏం జరిగినా ఇళ్లలోనే ఉండాలి: మోదీ
  • ప్రధాని నుంచి గ్రామవాసుల వరకు సామాజిక దూరం పాటించాలి: మోదీ
  • ఏం జరిగినా ఇంటిచుట్టూ ఉన్న లక్ష్మణరేఖ దాటి రావొద్దు: మోదీ
  • కరోనాపై పోరాటానికి మన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయమిది: మోదీ
  • ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంయమనం పాటించాల్సిన సమయమిది: మోదీ
  • ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నా..: మోదీ

20:14 March 24

ప్రతి ఇంటికి లక్ష్మణరేఖ: మోదీ

  • ఈ లాక్‌డౌన్ నిర్ణయం.. ప్రతి ఇంటికి లక్ష్మణరేఖ..: మోదీ
  • కరోనా సోకినవాళ్లు తొలుత సాధారణంగానే ఉంటారు, కాబట్టి ఇతరులను కలిసే ప్రయత్నం చేయవద్దు: మోదీ
  • రహదారులపై ఎవరూ తిరగవద్దు: మోదీ
  • కరోనా లక్షణాలు బయటపడేందుకు కొన్నిరోజుల సమయం పడుతుంది: మోదీ
  • దానివల్ల తెలియకుండానే ఆ వ్యక్తి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం: మోదీ
  • వైరస్ సోకిన వ్యక్తి వందలమందికి వ్యాపింపజేయగలడని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది: మోదీ
  • కరోనా బాధితుల సంఖ్య లక్షకు చేరేందుకు 67 రోజులు పట్టింది: మోదీ
  • తర్వాత 11 రోజుల్లోనే మరో లక్ష మంది బాధితులు నమోదయ్యారు: మోదీ
  • ఇదే పరిస్థితి కొనసాగితే మరో లక్ష మందికి సోకేందుకు 4 రోజులే పడుతుంది
  • కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తుందో చెప్పేందుకు ఈ గణాంకాలే ఉదాహరణ
  • చైనా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్‌ దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి: మోదీ

20:09 March 24

రెండ్రోజులుగా అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి: మోదీ

రాష్ట్ర ప్రభుత్వాలు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి: మోదీ

ఇతర దేశాల అనుభవాలు చూసి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మోదీ

ఈ అర్ధరాత్రి నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌: మోదీ

ఈ లాక్‌డౌన్‌ 21 రోజులపాటు కొనసాగుతుంది: మోదీ

ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధం: మోదీ

ఇది కర్ఫ్యూ తరహా వాతావరణం: మోదీ

జనతా కర్ఫ్యూకు మించి లాక్‌డౌన్ అమలు చేస్తాం: మోదీ

లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థపై పెనుప్రభావం, కాని ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఇది తప్పనిసరి: మోదీ

కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థల ప్రథమ కర్తవ్యం.. ప్రజల ప్రాణాలు కాపాడటం: మోదీ

20:05 March 24

  • కరోనా వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది: మోదీ
  • ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సవాలు విసురుతూనే ఉంది: మోదీ
  • సామాజిక దూరం పాటించడమే కరోనా నియంత్రణకు మందు: మోదీ
  • 2 నెలల పరిశోధనల తర్వాత శాస్త్రవేత్తలు కూడా ఇదే చెబుతున్నారు: మోదీ
  • వైరస్ నియంత్రణకు సామాజిక దూరం పాటించడం కంటే మరో మార్గం లేదు: మోదీ
  • కరోనా వైరస్‌ వ్యాప్తి సైకిల్‌ను అడ్డుకుని తీరాలి: మోదీ
  • ప్రతి వ్యక్తి, కుటుంబం సామాజిక దూరం పాటించాలి: మోదీ
  • కొంతమంది నిర్లక్ష్యం ప్రజలందరినీ ప్రమాదంలోకి నెడుతుంది: మోదీ

20:00 March 24

దేశమంతా ఒక్కటిగా నిలిచింది: మోదీ

  • మార్చి 22న జనతా కర్ఫ్యూను ప్రజలంతా పాటించారు: మోదీ
  • జనతా కర్ఫ్యూను ఆబాలగోపాలం కచ్చితంగా పాటించారు: మోదీ
  • సంకట సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలిచింది: మోదీ
  • కరోనా వ్యాప్తి ఎలా విస్తరిస్తుందో వార్తల్లో చూస్తున్నాం: మోదీ
  • అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో నిలిచాయి: మోదీ

19:54 March 24

కరోనా భయంతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు దిశానిర్దేశం చేసేందుకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ప్రసంగంలో వైరస్​ ప్రమాదానికి సంబంధించిన కీలక అంశాలపై మాట్లాడనున్నారు. భారత్‌లో కరోనా కేసులు 519కి చేరువ కావడం వల్ల ప్రధాని మరిన్ని ఆంక్షలను అమల్లోకి తెచ్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

వైరస్​ కేసులు పెరగడం వల్ల అధికారులు దాదాపు మొత్తం దేశాన్ని లాక్​డౌన్​లో ఉంచారు. మార్చి 31 వరకు రహదారి, రైలు, వాయు రవాణాను నిలిపివేశారు.

19:34 March 24

ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్ర విపత్తుగా కరోనా

కరోనా మహమ్మారిని ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్ర విపత్తుగా పరిగణిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్​ ఆనందీబెన్​ పటేల్​ ప్రకటించారు.

19:09 March 24

కేరళలో మరో 105కు కరోనా కేసులు

దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కరోనా వైరస్​ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో 14 కేసులు నమోదైనందున కేరళలో కొవిడ్​-19 కేసుల సంఖ్య 105కు చేరింది. 

18:45 March 24

ప్రపంచమంతా కరోనా వైరస్‌ను ఎలా కట్టడి చేయాలా అని బాధపడుతోంది. దేశాలన్నీ క్రమంగా లాక్‌డౌన్‌ అవుతున్నాయి. మూడో దశలోకి చేరితే పరిస్థితేంటా అని భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనాలో మరో వైరస్‌తో ఓ వ్యక్తి మృతిచెందడం అందరినీ కలవపరుస్తోంది. ఆ వైరస్‌కు టీకామందు ఉండటం ఊరట కలిగించే అంశం.

చైనాలోని యున్నన్‌ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి హంటా వైరస్‌తో మృతిచెందాడు. ఈ విషయాన్ని ఆ ప్రభుత్వ మీడియా సంస్థ ‘గ్లోబల్‌ టైమ్స్‌’ ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. సోమవారం షాండోగ్‌ ప్రావిన్స్‌లో బస్సులో ప్రయాణిస్తుండగా అతడు చనిపోవడం గమనార్హం. ఈ వైరస్‌ లక్షణాలు సైతం ఫ్లూ, కరోనాని పోలివుండటం గమనార్హం.

మరణాలు అనేకం

విస్తుగొలిపే మరో విషయం ఏంటంటే చైనాలో 1950 నుంచి 2007 మధ్య హంటా వైరస్‌తో 46,000 మంది మృత్యువాత పడ్డారు. 15 లక్షల మందికి ఈ వైరస్‌ సోకింది. 2005-2010 మధ్య ఫిన్లాండ్‌లో 32వేల మందికి హంటా సోకింది. రష్యాలో 1996 నుంచి 2006 మధ్య 90,000 కేసులు నమోదయ్యాయి.

ఇలా సోకుతుంది

హంటా వైరస్‌ ముఖ్యంగా ఎలుకలు, మూషిక జాతి జీవుల ద్వారా వ్యాప్తిస్తుంది. ఉదాహరణకు ఎలుకల మలం, మూత్రం, లాలాజలం కలిసిన గాలిని పీల్చుకుంటే ఈ వైరస్‌ సోకుంది. అయితే మనిషికి సోకిన తర్వాత మరో మనిషికి ఇది అంటుకోదు. అమెరికాలో దీనిని ‘న్యూ వరల్డ్‌’ హంటా వైరస్‌ అని, ఐరోపా, ఆసియాలో ‘ఓల్డ్‌ వరల్డ్‌’ హంటా వైరస్‌ అని అంటారు. న్యూ వరల్డ్‌తో  హంటావైరస్‌ ఫల్మనరీ సిండ్రోమ్‌ (హెచ్‌పీఎస్‌), ఓల్డ్‌ వరల్డ్‌తో హెమోరాజిక్‌ ఫీవర్‌ విత్‌ రీనల్‌ సిండ్రోమ్‌ (హెచ్‌ఎఫ్‌ఆర్‌ఎస్‌) వ్యాపిస్తుంది.

లక్షణాలు

హెచ్‌పీఎస్‌: ముందు అలసట, జ్వరం, కండరాల నొప్పి (మరీ ముఖ్యంగా తొడలు, పిరుదులు, కొన్నిసార్లు భుజాల్లో), తలనొప్పి, బద్దకం, తిమ్మిర్లు, ఉదర ఇబ్బందులు ఉంటాయి. పది రోజుల తర్వాత దగ్గు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడటం.

హెచ్‌ఎఫ్‌ఆర్‌ఎస్‌: ఒకటి నుంచి రెండు వారాల్లోనే లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఎనిమిది వారాల వరకు కనిపించవు. మొదట తలనొప్పి, వెన్ను నొప్పి, కడుపు నొప్పి, జ్వరం, తిమ్మిర్లు, చూపు తగ్గడం ఉంటాయి. తర్వాత రక్తపోటు, మూత్రపిండాల వైఫల్యం కనిపిస్తుంది.

18:10 March 24

భారత్​లో 519కి చేరిన కేసులు

దేశంలో కరోనా కేసులు 519కి చేరినట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం 470 యాక్టివ్​ కేసులున్నట్లు స్పష్టం చేసింది. 

17:27 March 24

  • కరోనా దృష్ట్యా ప్రజలంతా నిబంధనలు పాటించాలి: కేంద్ర వైద్యశాఖ
  • కరోనా ధ్రువీకరణకు మరిన్ని ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం: కేంద్రం
  • కరోనా కిట్ల కొరత రాకుండా చర్యలు తీసుకుంటాం: కేంద్రం
  • కరోనా సోకిన వారికి ప్రత్యేక మందులు ఇవ్వాల్సి ఉంది: కేంద్రం
  • సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న మందులు వాడవద్దు: కేంద్రం
  • కొన్ని మందులు ఇంకా ప్రయోగదశలోనే ఉన్నాయి: కేంద్రం
  • ఎక్కడికక్కడ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాం: కేంద్రం

16:26 March 24

స్పెయిన్​లో 514 మంది మృతి

కరోనా దెబ్బతో స్పెయిన్​లో వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఈ మహమ్మారి ధాటికి స్పెయిన్​లో గత 24 గంటల్లో 514 మంది మృతి చెందారు. ఫలితంగా దేశవ్యాప్తంగా కొవిడ్​-19 మృతుల సంఖ్య 2,696కు చేరగా.. ప్రపంచవ్యాప్తంగా ఆ సంఖ్య 17వేలు దాటింది.

15:28 March 24

ఇరాన్​లో మరో 122 మంది మృతి

కరోనా వైరస్​ బారినపడి ఇరాన్​లో ఇవాళ మరో 122 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా ఆ దేశంలో కొవిడ్​-19 మృతుల సంఖ్య 1,934కు చేరింది.

15:14 March 24

  • ఖాతాదారులు అన్ని ఏటీఎంల్లో డబ్బు తీసుకోవచ్చు: నిర్మలా సీతారామన్‌
  • ఖాతాదారులు 3 నెలలపాటు ఛార్జీలు లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు: నిర్మల
  • బ్యాంకుల్లో కనీస నగదు నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు: నిర్మల
     

15:09 March 24

196 దేశాలకు పాకిన కరోనా

కరోనా మహమ్మారి ఇప్పటివరకు 196 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 3.84 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 16,591 మంది మృతి చెందగా.. 1,02,536 మంది రోగులు ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.

15:05 March 24

  • కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికే లాక్‌డౌన్‌: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌
  • ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు దాదాపు కొలిక్కివచ్చింది: నిర్మలా సీతారామన్‌
  • ఆర్థిక సంవత్సరం చివరిరోజుల్లో వేగంగా స్పందించాలి: నిర్మలా సీతారామన్‌
  • 2018-19 ఐటీ రిటర్న్‌ల దాఖలుకు ఈ ఏడాది జూన్‌ 30 వరకు గడువు: నిర్మల
  • ఈ వ్యవధిలో పన్ను చెల్లింపు ఆలస్య రుసుము 12 నుంచి 9 శాతానికి తగ్గింపు: నిర్మల
  • ఆధార్‌-పాన్‌ అనుసంధానం గడువు జూన్‌ 30 వరకు పొడిగింపు: నిర్మల
  • టీడీఎస్‌ జమలో ఆలస్య రుసుము 18 నుంచి 9 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్‌
  • వివాద్‌ సే విశ్వాస్‌ పథకం గడువు జూన్‌ 30 వరకు పొడిగింపు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌
  • పన్ను వివాదాల మొత్తాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుం తొలగింపు: నిర్మల
  • మార్చి, ఏప్రిల్‌, మే జీఎస్టీ రిటర్న్‌ల దాఖలు గడువు జూన్‌ 30 వరకు పొడిగింపు: నిర్మల
  • కాంపొజిషన్‌ స్కీమ్‌ రిటర్న్‌ల దాఖలుకూ జూన్‌ 30 వరకు గడువు: నిర్మల
  • 5 కోట్లలోపు టర్నోవర్‌ కంపెనీలకు పన్ను చెల్లింపుపై వడ్డీ, అపరాధ రుసుం ఉండవు: నిర్మల
  • రూ.5 కోట్ల టర్నోవర్‌ దాటిన కంపెనీలకు పన్ను చెల్లింపుపై వడ్డీ, పెనాల్టీ 9 శాతానికి తగ్గింపు

15:03 March 24

అతి త్వరలో ఆర్థిక ప్యాకేజీ..

కరోనా వైరస్​పై పోరాడేందుకు అతిత్వరలో ఆర్థిక ప్యాకేజీ తీసుకురానున్నట్లు ప్రకటించారు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్. పన్ను రిటర్నులు సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగిస్తున్నట్లు  చెప్పారు.  

పన్ను రిటర్నుల దాఖలుకు గడువు పెంపు

ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జూన్ 30వరకు గడువు పెంచింది కేంద్రం. ప్రభుత్వమే గడువు పెంచుతున్నందున పన్ను మొత్తంపై 10 శాతం వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.  కరోనాపై పోరాడేందుకు త్వరలో ఆర్థిక ప్యాకేజీ తీసుకోస్తామన్నారు. అదే సమయంలో ఆధార్, పాన్ కార్డుల అనుసంధానికి ఇంతకుముందున్న మార్చి 31 ఆఖరు తేదిని కూడా జూన్ 30కి పెంచుతున్నట్లు చెప్పారు. ఆదాయపన్ను చట్టం కింద తీసుకోవాల్సిన పలు నిర్ణయాలను కూడా పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

13:28 March 24

దేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి కొవిడ్​-19 ఆసుపత్రి వీడియోను విడుదల చేశారు అధికారులు. కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు రిలయన్స్​ సంస్థ ఈ ఆసుపత్రిని ముంబయిలో ఏర్పాటు చేసింది. 

13:21 March 24

దేశంలో కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రింట్​ మీడియా అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా భేటీ అయ్యారు ప్రధాని మోదీ.

13:02 March 24

బయటికొస్తారా.. గుంజీలు తీయండి

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్​డౌన్​ విధించాయి ఆయా ప్రభుత్వాలు. అయినప్పటికీ పలువురు రోడ్లపైకి వచ్చి కర్ప్యూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి వారిపై వినూత్న చర్యలు తీసుకుంటున్నారు మహారాష్ట్ర​ పోలీసులు. నాగ్​పూర్​లో అనవరసంగా రోడ్లపైకి వచ్చిన వారితో ఇలా గుంజీలు తీయిస్తున్నారు.

12:42 March 24

ఆర్థిక ప్యాకేజీ!

మధ్యాహ్నం 2 గంటలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌ పరిస్థితులు, ఆర్థిక అంశాలపై ప్రకటన ఉంటుందని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు ‌నిర్మల.

12:28 March 24

కరోనా వైరస్​తో దేశంలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. యూఏఈ నుంచి వచ్చిన 65 ఏళ్ల వృద్ధుడు ముంబయిలోని కస్తూర్బా హాస్పిటల్​లో చికిత్స పొందుతూ మరణించాడు.

12:19 March 24

త్వరలో కరోనా వైరస్​ పరీక్షలు, వైద్య సేవలను ఆయుష్మాన్​ భారత్​ పరిధిలోకి తీసుకొచ్చేందుకు జాతీయ ఆరోగ్యశాఖ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. 

11:40 March 24

భారత్‌ ప్రపంచానికే మార్గం చూపింది

పోలియో, స్మాల్‌ పాక్స్‌ వంటి అతిపెద్ద మహమ్మారులను జయించిన భారత్‌.. ప్రపంచానికే మార్గం చూపిందని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ గుర్తుచేశారు.  తాజాగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌(కొవిడ్‌-19)ను కూడా కట్టడి చేసే సత్తా మన దేశానికి ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, వైరస్‌ విజృంభిస్తున్న ప్రదేశాల్లో వైద్య పరీక్షా సదుపాయాల్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ వంటి అత్యంత జన సాంద్రత గల దేశాల్లోనే వైరస్‌ కట్టడి నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 16వేలకు మందికి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. మరోవైపు బాధితుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. దీంతో అన్ని దేశాలు మరింత కఠినమైన, వేగవంతమైన చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ ఆదేశించింది. 

11:19 March 24

లాక్​డౌన్​లో 560 జిల్లాలు...

32 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 560 జిల్లాల్లో పూర్తి లాక్​డౌన్​ అమల్లోకి వచ్చింది. కరోనా వైరస్​ను నియంత్రించేందుకు కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.

11:07 March 24

మోదీ ప్రసంగం...

ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా నియంత్రణ చర్యలపై పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.

10:57 March 24

కేంద్ర ఆరోగ్యమంత్రి భేటీ...

జాతీయ రోగ నియంత్రణ అధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ దిల్లీలో భేటీ అయ్యారు. కరోనా నియంత్రణ చర్యలపై వారితో చర్చిస్తున్నారు.

10:26 March 24

దిల్లీలో ఉద్రిక్తత... 

దిల్లీ షహీన్​బాగ్​ నుంచి సీఏఏ వ్యతిరేకులను ఖాళీ చేయించిన నేపథ్యంలో స్థానికులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి వచ్చారు. దిల్లీ మొత్తం లాక్​డౌన్​ ఉన్నప్పటికీ వారు ఏ మాత్రం లెక్కచేయడం లేదు.

10:17 March 24

మహారాష్ట్రలో 100 దాటిన కేసులు...

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 101కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజాగా పుణేలో 3, సతారాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

10:08 March 24

మహారాష్ట్రలో రోడ్లపైకి జనం...

మహారాష్ట్ర పుణే వ్యవసాయ మార్కెట్​కు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినప్పటికీ ప్రజలు లెక్కచేయడం లేదు.

10:02 March 24

దిల్లీలో డ్రోన్ల వినియోగం...

దిల్లీ జామియా మిలియా ఇస్లామియా (జేఎమ్​ఐ) ప్రాంతంలో పరిస్థితిని డ్రోన్లతో పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఆ ప్రాంతంలోని నిరసనకారులను ఖాళీ చేయించారు.

09:34 March 24

500కు చేరువలో...

దేశంలో కరోనా కేసులు 500కు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం 492 మందికి వైరస్​ సోకినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

09:12 March 24

కిటకిటలాడుతోన్న ప్రజలు...

ఉత్తర్​ప్రదేశ్​ మోరాదాబాద్​ కూరగాయల మార్కెట్​ జనంతో నిండిపోయింది. జిల్లా లాక్​డౌన్​లో ఉన్నప్పటికీ ప్రజలు ఏ మాత్రం నియమాలు పాటించడం లేదు.

08:59 March 24

తిరువనంతపురం...

కేరళ రాజధాని తిరువనంతపురంలో రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ నెల 31 వరకు రాష్ట్రం మొత్తం లాక్​డౌన్​ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్​ నిన్న ప్రకటించారు. 

08:40 March 24

గుజరాత్​లో నిర్బంధం...

గుజరాత్​లో లాక్​డౌన్​ కొనసాగుతోంది. ప్రజలు చాలా చోట్ల స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. అహ్మదాబాద్​లో రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 

08:35 March 24

షహీన్​బాగ్​ ఖాళీ...

కరోనా వైరస్ నియంత్రణ నేపథ్యంలో దిల్లీ షహీన్​బాగ్​లో నిరసనలు చేపడుతోన్న ఆందోళనకారులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు పోలీసులు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. 

07:55 March 24

భద్రత కట్టుదిట్టం...

దిల్లీ షహీన్​బాగ్​ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దిల్లీలో 144 సెక్షన్​ విధించిన దృష్ట్యా నిరసనలు చేపట్టకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

07:38 March 24

భారత్​లో కరోనా కేసులు@536 ... 10కి చేరిన మరణాలు

లాక్​డౌన్​...

కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో దేశంలోని 30 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 548 జిల్లాల్లో పూర్తిగా లాక్​డౌన్​ విధించారు. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం వెలువరించింది.

ఆదివారం వరకు దేశంలోని 80 జిల్లాల్లోనే లాక్​డౌన్​ విధించగా ఆ జాబితాను విస్తరించింది ప్రభుత్వం. భారత్​లో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుండగా 23 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తి దిగ్బంధం ప్రకటించింది. మధ్యప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని 58 జిల్లాల్లో మాత్రమే లాక్​డౌన్​ విధించారు. మరో కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్​​లో పాక్షికంగా సేవలు నిలిపి వేశారు. సిక్కిం, మిజోరం రాష్ట్రాల్లో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Last Updated : Mar 24, 2020, 11:57 PM IST

ABOUT THE AUTHOR

...view details