తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​... కరోనా కేసులు@471 - తాజా వార్తలు కరోనా

corona
కరోనాపై భారత్​ యుద్ధం- దేశంలో 80 జిల్లాలు లాక్​డౌన్​

By

Published : Mar 23, 2020, 7:52 AM IST

Updated : Mar 23, 2020, 11:18 PM IST

23:11 March 23

548 జిల్లాల్లో పూర్తిస్థాయిలో లాక్ డౌన్

దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 548 జిల్లాల్లో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశాల్లోని 58 జిల్లాల్లో పాక్షికంగా నిర్బంధం అమలవుతుండగా.. మిగతా రాష్ట్రాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అత్యవసర మినహా ఇతర సేవలన్నీ నిలిచిపోయాయి. ఈ మేరకు కేంద్రం వివరాలను వెల్లడించింది.

22:43 March 23

కర్ణాటకలో లాక్​డౌన్​...

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటకలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి యడియూరప్ప. ఇవాళ అర్ధరాత్రి నుంచి లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 31వరకు వర్తిస్తుందని స్పష్టం చేశారు.

20:39 March 23

భారత్​లో కరోనా కేసులు 471కి చేరాయి. మహారాష్ట్ర, కేరళల్లో కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 9కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. 

ఇవాళ బంగాల్​, హిమాచల్​ ప్రదేశ్​లలో తొలి కరోనా మరణాలు సంభవించాయి. కొవిడ్​ ధాటికి మహారాష్ట్రలో ఇద్దరు, గుజరాత్​, బిహార్​, కర్ణాటక, పంజాబ్​ల్లోనూ ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 

18:35 March 23

433కు చేరిన కరోనా కేసులు..

దేశంలో కొవిడ్​-19 కేసులు 433కు చేరినట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కోలుకున్న, మరణించిన వారు మినహా ప్రస్తుతం 402 యాక్టివ్​ కేసులున్నట్లు స్పష్టం చేసింది. 

కేరళలో ఇవాళ ఒక్క రోజే కొత్తగా 28 కేసులు నమోదైనట్లు పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం.

18:18 March 23

కేరళలో మరో 28 కేసులు

కేరళలో ఇవాళ ఒక్కరోజే కొత్తగా మరో 28 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్​డౌన్​ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.​

17:45 March 23

మహారాష్ట్రలో కర్ఫ్యూ

  • అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసివేత: మహారాష్ట్ర సీఎం
  • నేటి నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది: మహారాష్ట్ర సీఎం
  • అత్యవసర సేవలకు మాత్రమే కర్ఫ్యూ నుంచి మినహాయింపు: మహారాష్ట్ర సీఎం

17:18 March 23

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 15వేలు దాటింది. మొత్తం 15,189 మంది ఈ మహమ్మారి వల్ల మృత్యువాత పడగా అందులో ఒక్క యూరప్​లోనే 9,197 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 1,395 మంది మరణించడం గమనార్హం.

16:56 March 23

రిలయన్స్​ ఉచిత పెట్రోల్​, భోజనం

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రిలయన్స్ సంస్థ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్టతో పాటు ప్రభుత్వానికి తమ వంతు సాయంగా కొన్ని సౌకర్యాలను కల్పిస్తూ ప్రకటన చేసింది. ఇందులో భాగంగా మాస్కుల ఉత్పత్తిని రోజుకు లక్ష యూనిట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

కరోనా బాధితులను మోసుకెళ్లే అత్యవసర వాహనాలకు ఉచితంగా ఇంధనంతో పాటు వివిధ నగరాల్లో జీవనోపాధి కోల్పోయిన వారికి ఉచిత భోజనం అందిస్తామని స్పష్టం చేసింది. ముంబయిలోని కరోనా బాధితుల కోసం 100 పడకల ఆసుపత్రిని సిద్ధం చేసింది. దేశంలో ఇదే తొలి ఆసుపత్రి.  తమ సంస్థకు చెందిన ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగులకూ పని లేకపోయినా వేతనం చెల్లిస్తామని రిలయన్స్​ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

16:48 March 23

దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది విమానయానశాఖ. సరకు రవాణా మినహా మిగతా అన్ని విమానాలను ఈనెల 25 నుంచి రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

16:42 March 23

24 గంటల్లో 462 మంది మృతి

కరోనా వైరస్​ కారణంగా స్పెయిన్​లో 24 గంటల్లో మరో 462 మంది మరణించారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 2,182కు చేరింది.

16:33 March 23

  • వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడమే నియంత్రణ చర్యల ఉద్దేశం: కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ
  • అత్యవసర సేవలన్నీ అందుబాటులో ఉంటాయి: కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ
  • కోవిడ్‌ బాధితుల కోసం ఆస్పత్రులను సిద్ధం చేయాలని రాష్ట్రాలను కోరుతున్నాం
  • దేశవ్యాప్తంగా 15 వేల ల్యాబ్‌ల్లో నమూనాలు సేకరిస్తున్నాం: కేంద్ర వైద్యఆరోగ్యశాఖ
  • కరోనా నిర్ధరణ కిట్ల తయారీదారులకు వెసులుబాట్లు కల్పించాం
  • కిట్ల తయారీదారులకు ఐసీఎంఆర్‌, ఎన్‌ఐబీ ధ్రువీకరణ ఉంటే చాలు
  • ఇప్పటికే 2 తయారీ సంస్థలకు అనుమతులు ఇచ్చాం
  • క్యాబినెట్‌ సెక్రటరీ స్థాయిలో నిత్యావసరాల నిల్వలు, రవాణాపై నిరంతరం సమీక్ష
  • శానిటైజర్లు, మాస్కుల ధరలపై ఇప్పటికే పరిమితులు విధించాం
  • శానిటైజర్ల తయారీలో కీలకమైన ఇథనాల్‌ సరఫరాలో కొరత లేకుండా చేస్తున్నాం
  • దేశంలో ఉన్న డిస్టిలరీలతో సంప్రదింపులు జరిపాం
  • అసత్య వార్తలు, వదంతులను ప్రజలు నమ్మవద్దు
  • కరోనా బాధితులకు చికిత్స చేసేవారికి మాత్రమే క్లోరోఫిన్‌ మాత్రలు సిఫారసు
  • ఐసోలేషన్‌లో బాధితుల సహాయకులకు కూడా క్లోరోఫిన్‌ మాత్రలు సిఫారసు

16:17 March 23

'నేను సమాజ శత్రువును'

జనతా కర్ప్యూను ఉల్లంఘించిన వారిపై వినూత్న చర్యలు తీసుకుంటున్నారు ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారితో ' నేను సమాజ శత్రువును, నేను ఇంట్లో ఉండలేదు.' అని రాసి ఉన్న కాగితాలను ఇచ్చి.. రోడ్లపై తిరుగుతున్న వారితో చదివిస్తున్నారు.

16:08 March 23

అరుణాచల్​ ప్రదేశ్​లో అంటువ్యాధుల చట్టం-1857

కరోనా వైరస్​ కట్టడికి 1857 అంటువ్యాధుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది అరుణాచల్​ ప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 31 వరకు ఇది అమలులో ఉండనుంది.

16:01 March 23

ఇరాన్​లో మరో 127 మంది మృతి

ఇరాన్​లో కరోనా పంజా విసురుతోంది. ఈ మహమ్మారి ధాటికి ఇవాళ మరో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఇరాన్​లో కొవిడ్​-19 మృతుల సంఖ్య 1,812కు చేరింది.

15:27 March 23

కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లోక్‌సభ నివధికంగా వాయిదా పడింది. అంతకముందు సభలో ఎలాంటి చర్చా లేకుండానే మూజువాణి ఓటుతో ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపింది. 2020-21 బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన అనంతరం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభను నివరధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, పలు బిల్లులను ఆమోదించిన తర్వాత రాజ్యసభ సమావేశాలను కూడా నిరవధికంగా వాయిదా వేయనున్నట్టు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. ఆర్థిక, జమ్మూకశ్మీర్‌ బిల్లులతో పాటు  లద్దాఖ్‌, డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌ బిల్లులకు ఆమోదం తర్వాత సమావేశాలు ముగుస్తాయని ఆయన స్పష్టంచేశారు. 

15:17 March 23

తమిళనాడులో 144 సెక్షన్​​

కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్రాన్ని లాక్​డౌన్​ చేస్తున్నట్లు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్​ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు.

15:03 March 23

దిల్లీలోనూ ఆయుష్మాన్​ భారత్​

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్​ భారత్​ పథకాన్ని దిల్లీలో అమలు చేసింది కేజ్రీవాల్​ సర్కారు. ఈ మేరకు దిల్లీ ఆర్థిక మంత్రి మనీశ్​ సిసోడియా అసెంబ్లీలో ప్రకటించారు.

14:49 March 23

లోక్​సభ వాయిదా

ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సభలో ఎలాంటి చర్చ లేకుండానే.. మూజువాణి ఓటుతో ఆర్థిక బిల్లు లోక్‌సభలో గట్టెక్కింది. అలాగే జనతా కర్ఫ్యూ విజయవంతంపై లోక్‌సభ హర్షం వ్యక్తం చేసింది. అనంతరం సభను వాయిదా స్పీకర్​.

13:14 March 23

కరోనా వైరస్​ దేశంలో వేగంగా వ్యాప్తిచెందుతున్న తరుణంలో మీడియా అధినేతలతో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పలు విషయాలపై చర్చించారు.

12:24 March 23

మరో మూడు రాష్ట్రాలు​ లాక్​డౌన్​

కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాల బాటలో పయనించాయి ఛత్తీస్​గఢ్​, హిమాచల్​ ప్రదేశ్​, అరుణాచల్​ ప్రదేశ్​ ప్రభుత్వాలు. నేటి నుంచి ఈనెల 31 వరకు ఆయా రాష్ట్రాలను లాక్​డౌన్​ చేస్తున్నట్లు జైరాం ఠాకూర్​, ప్రేమా ఖాండూ సర్కార్లు ప్రకటించాయి.

12:02 March 23

సుప్రీంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కేసుల విచారణ

కరోనా కారణంగా రేపటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఈ మేరకు న్యాయవాదులు వారి కార్యాలయం నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఏస్​ఏ బోబ్డే ఆదేశించారు.

11:47 March 23

చండీగడ్​లో 7కు చేరిన కరోనా కేసులు

చండీగఢ్​లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్​ వచ్చింది. ఫలితంగా చండీగఢ్​లో కరోనా కేసుల సంఖ్య 7కు చేరింది.

11:17 March 23

415కు చేరిన కేసులు...

దేశంలో కరోనా కేసుల సంఖ్య 415కు చేరినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు వైరస్​ ధాటికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 

11:16 March 23

లాక్​డౌన్​పై ప్రధాని ట్వీట్​...

కరోనా లాక్​డౌన్​పై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

"లాక్​డౌన్​ను కొంతమంది ప్రజలు సీరియస్​గా తీసుకోవడం లేదు. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి. నియమాలను పాటించండి. ప్రజలు లాక్​డౌన్​ పాటించేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను." - నరేంద్ర మోదీ, ప్రధాని

09:47 March 23

నిర్మానుష్యం...

ఈ నెల 31 వరకు రైళ్లు రద్దు కావటం వల్ల మహారాష్ట్ర నాగ్​పుర్​ రైల్వేస్టేషన్​ ప్రజలు లేక నిర్మానుష్యంగా ఉంది.

09:25 March 23

మార్కెట్లపై ఎగబడ్డ జనం...

కరోనా వైరస్​ నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్​డౌన్​ పాటిస్తున్నాయి. అయితే లాక్​డౌన్​ విధించినప్పటికీ​ ప్రజలు యథేచ్చగా తిరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లోని కూరగాయల మార్కెట్​లో ప్రజలు పెద్దఎత్తున గుమిగూడారు.

09:12 March 23

మహారాష్ట్రలో 89...

మహారాష్ట్రలో కరోనా కేసులు 89కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

08:40 March 23

బంగాల్​లో...

ఈ నెల 31 వరకు అన్ని రైళ్లను రద్దు చేయడం వల్ల బంగాల్​లోని ఖారదాహ రైల్వేస్టేషన్​ ఖాళీగా ఉంది.

08:32 March 23

జనసంచారం లేదు...

కరోనా నియంత్రణ కోసం బిహార్​ ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్​డౌన్​ ప్రకటించింది. ముజఫర్​పుర్​ సదార్​ థానా ప్రాంతంలో జనసంచారం అత్యల్పంగా ఉంది.  

07:57 March 23

ఉత్తర్​ప్రదేశ్​లో 16 జిల్లాలు..

కరోనా వైరస్​ నియంత్రణ కోసం ఉత్తర్​ప్రదేశ్​లో 16 జిల్లాల్లో లాక్​డౌన్​ ప్రకటించారు సీఎం యోగి ఆదిత్యనాథ్​. ఈ నెల 23 నుంచి 25 వరకు లాక్​డౌన్​ కొనసాగనుంది. ప్రయాగ్​రాజ్​లో దృశ్యాలిలా ఉన్నాయి.

07:54 March 23

రాజ్​పథ్​ నిర్మానుష్యం...

దిల్లీలో ఈ రోజు ఉదయం 6 నుంచి మార్చి 31 వరకు లాక్​డౌన్​ ప్రకటించారు సీఎం కేజ్రీవాల్​. ఈ నేపథ్యంలో రాజ్​పథ్​ ఇలా నిర్మానుష్యంగా మారింది.

07:43 March 23

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​... కరోనా కేసులు@471

దేశంలో అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా వైరస్ కోరలు పీకేందుకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న 80 జిల్లాల్లో లాక్​డౌన్​ ప్రకటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన కేంద్రం.. మహమ్మారిని తరిమికొట్టేందుకు 144 సెక్షన్​ తరహా నిషేధాజ్ఞలను అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. జనతా కర్ఫ్యూ ద్వారా ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనను గమనించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈ రాష్ట్రాల్లో లాక్​డౌన్​..

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్​డౌన్​ ప్రకటించాయి. దిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్​, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లలో ఈ నెల 31వరకు లాక్​డౌన్​ ప్రకటించారు. రాజస్థాన్​లో ఇప్పటికే అమల్లో ఉంది. నాగాలాండ్​లో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదుకానప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా నిరవధిక లాక్​డౌన్ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

  • ఛత్తీస్​గఢ్​లోని అన్ని పట్టణ ప్రాంతాల్లో లాక్​డౌన్ ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్​ బగేల్​.
  • బిహార్​లోని అన్ని పట్టణాలను ఈ నెలాఖరు వరకు లాక్​డౌన్​గా ప్రకటించింది ప్రభుత్వం.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా ప్రభావం ఉన్న 16 జిల్లాల్లో లాక్​డౌన్​ విధించారు.
  • మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, ఒడిశా, హిమాచల్​ ప్రదేశ్​ సహా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో లాక్​డౌన్ ప్రకటించారు.

396కు చేరిన కేసులు..

దేశంలో కరోనా కేసులు 396కు చేరాయి. ఆదివారం ఒక్కరోజే 64 కొత్త కేసులు బయటపడ్డాయి. మృతుల సంఖ్య 7 కు పెరిగింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమైన కేంద్రం.. మొత్తం రైళ్లను నిలిపేసింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

కొత్త కేసులు

మహారాష్ట్రలో ఆదివారం 10 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 74కు చేరుకుంది. ముంబయిలో 24, పుణెలో 15 మందికి వైరస్‌ పాజిటివ్​గా నిర్ధరించారు. కేరళలో మొత్తం కేసులు 64కు చేరగా.. ఒక్కరోజు వ్యవధిలో 15 మంది వైరస్​ బారినపడ్డారు.

తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్​, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాలలో 6 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం బాధితుల సంఖ్య 27కు, కర్ణాటకలో 26కు చేరింది. రాజస్థాన్‌లో 3 కొత్త కేసులు సహా మొత్తం బాధితుల సంఖ్య 28కి పెరిగింది. దిల్లీలో మొత్తం కేసులు 30కి, ఉత్తర్‌ప్రదేశ్‌లో 27కు చేరాయి. గుజరాత్‌లో మొత్తం 18 మందికి వైరస్‌ సోకగా.. ఓ 67ఏళ్ల వృద్ధుడు మృతిచెందారు. బిహార్‌లోనూ చనిపోయిన వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు.

Last Updated : Mar 23, 2020, 11:18 PM IST

ABOUT THE AUTHOR

...view details