ఇటలీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లోనే ఈ వైరస్ ధాటికి సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. 80వేలకుపైగా వైరస్ బారిన పడ్డారు.
ఇటలీపై కరోనా పంజా..24 గంటల్లో 1000 మంది మృతి - కరోనా లక్షణాలు
22:24 March 27
ఇటలీలో 24 గంటల్లో వెయ్యి మంది మృతి
20:53 March 27
మాంద్యంలోకి...
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) అధినేత్రి క్రిస్టలినా జార్జివా అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని చూస్తే ఇది నిజమనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.
20:40 March 27
మరో వ్యక్తి మృతి...
మహారాష్ట్ర ముంబయిలో 85 ఏళ్ల కరోనా అనుమానితుడు మృతి చెందినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
20:28 March 27
25 వేలు...
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాలు 25,000 దాటేశాయి. ఇందులో సగానికిపైగా ఐరోపాకు చెందినవారే.
20:20 March 27
మోదీకి వైద్యుల లేఖ...
ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఫోర్డా) ప్రధాని మోదీకి లేఖ రాసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో మరింత మంది వైద్య బృందాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
20:11 March 27
లాటిన్ అమెరికాలో 10వేల కేసులు...
లాటిన్ అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం నాటికి ఈ ప్రాంతంలో కొవిడ్-19 బాధితుల సంఖ్య 10వేలకు చేరింది. ఫిబ్రవరి 26న బ్రెజిల్లో తొలికేసు నమోదైంది. మొత్తం లాటిన్ అమెరికాలో మృతుల సంఖ్య 181 చేరింది.
20:00 March 27
రేడియో జాకీలతో మోదీ సమావేశం..
ప్రధాని మోదీ ఈరోజు రేడియో జాకీ(ఆర్జే)లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. కరోనాపై ప్రజలకు అవగాహన పెంచడంలో సహాయపడుతున్నారని.. వారిపై ప్రశంసల జల్లు కురిపించారు.
19:45 March 27
ఉల్లం'ఘను'లపై దిల్లీ ప్రభుత్వం కేసులు..
భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నేడు 60 మందిపై ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదు చేసింది దిల్లీ ప్రభుత్వం. అంతేకాకుండా 3,432 మందిని అదుపులోనికి తీసుకుంది. వీరిపై ఐపీసీ 188, దిల్లీ పోలీస్ యాక్ట్ 65, 66 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
19:35 March 27
నీట్ పరీక్ష వాయిదా..
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. మే 3న జరగాల్సిన జాతీయ అర్హత పరీక్ష (నీట్) వాయిదా పడింది. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది మానవ వనరుల అభివృద్ధి శాఖ(హెచ్ఆర్డీ). ఈ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
19:06 March 27
కరోనా కలవరం...
ప్రపంచవ్యాప్తంగా కరోనా ధాటికి ఇప్పటివరకు 24,663 మంది మృతి చెందారు. 1,12,200 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం 5,39,360 మందికి ఈ మహమ్మారి సోకింది.
18:44 March 27
బ్రిటన్ ఆరోగ్య మంత్రికి వైరస్...
బ్రిటన్ ఆరోగ్య మంత్రి హాన్‌కాక్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా సోకినట్లు నిర్ధరణయింది.
18:10 March 27
కేరళలో మరో 39 కేసులు...
కేరళలో ఈ రోజు కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. తాజాగా మరో 39 మందికి కరోనా వైరస్ నిర్ధరణయిందని సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఇందులో 34 మంది కాసర్కోడ్ జిల్లాకు చెందినవారని వెల్లడించారు. 12 మంది డిశ్చార్జ్ అయిన బాధితులతో కలిపి మొత్తం కేరళలో కరోనా కేసుల సంఖ్య 176కు చేరినట్లు స్పష్టం చేశారు.
17:07 March 27
భారీ ప్యాకేజీ...
కరోనా వైరస్ వ్యాప్తి నుంచి రాష్ట్రాన్నిరక్షించుకునేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భారీ ప్యాకేజీ ప్రకటించారు. పేదల సంక్షేమం కోసం రూ.2,200 కోట్లను కేటాయించారు.
16:39 March 27
ముందుగానే 3 నెలల పింఛను...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు 3 నెలల పింఛను ముందుగానే ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
16:22 March 27
24 గంటల్లో...
స్పెయిన్‌లో గత 24 గంటల్లో 769 మంది మృతి చెందారు. దేశంలో వైరస్ మృతుల సంఖ్య. 4,858కి చేరింది.
16:13 March 27
724 కేసులు, 17 మంది మృతి...
దేశంలో కరోనా వైరస్ ధాటికి ఇప్పటివరకు 17 మంది మృతి చెందగా, 724 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 75 కొత్త కేసులు నమోదవగా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
15:59 March 27
ఏప్రిల్ 14 వరకు...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశీయ విమానాలపై ఉన్న ఆంక్షలను ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తున్నట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.
15:39 March 27
మరో 12 మందికి...
మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలో తాజాగా 12 మందికి కరోనా వైరస్ నిర్ధరణయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 147 మందికి వైరస్ సోకినట్లు తేలిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
15:15 March 27
చిన్నారికి సోకిన వైరస్...
కర్ణాటక మంగళూరులో ఓ 10 నెలల చిన్నారికి కరోనా సోకినట్లు నిర్ధరణయింది. అయితే ఆ చిన్నారి కుటుంబంలో ఎవరూ విదేశాలకు వెళ్లినట్లు దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. అయితే కుటుంబసభ్యులు ఇటీవల చిన్నారిని కేరళకు తీసుకువెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ప్రస్తుతం ఆరుగురిని గృహ నిర్బంధంలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
14:56 March 27
15 లక్షల మంది...
జనవరి 18 నుంచి మార్చి 23 మధ్య 15 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు భారత్‌కు వచ్చినట్లు కేబినెట్ కార్యదర్శి వెల్లడించారు. వీరందరినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. అయితే వాస్తవ చిత్రానికి లెక్కలకు తేడా ఉందని.. ఇది కరోనా నియంత్రణపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ప్రభావం చూపిస్తుందని కేబినెట్ కార్యదర్శి అభిప్రాయపడ్డారు.
14:18 March 27
భారీ విరాళం...
కరోనా వైరస్‌పై పోరాడేందుకు మహారాష్ట్ర సీఎం సహాయనిధికి షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ రూ.51 కోట్లు విరాళం ఇచ్చింది.
13:47 March 27
కరోనా మహమ్మారికి కర్ణాటకలో మరొకరు బలయ్యారు. తుమకూరు జిల్లాలో 65 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. ఫలితంగా ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3కు చేరింది.
13:36 March 27
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు పెద్దసంఖ్యలో సొంతూళ్లకు వలస వెళ్తున్న వేళ... అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. ఆ వలసలు అడ్డుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్న విషయాన్ని తెలియచేసి, వారు ఆందోళన చెందకుండా చూడాలని సూచించింది.
13:10 March 27
మరో ఆరుగురికి...
తమిళనాడులో మరో ఆరుగురికి కరోనా సోకినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
12:25 March 27
ఆర్‌బీఐ నిర్ణయాలు భేష్...
కరోనా విజృంభిస్తోన్న వేళ ఆర్థిక రంగ బలోపేతానికి ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. లిక్విడిటీ వృద్ధితో పాటు మధ్యతరగతి, వ్యాపారులకు ఈ నిర్ణయాలు ఎంతో ఉపయోగకరమన్నారు మోదీ.
11:56 March 27
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఫోన్లో చర్చలు జరిపారు. ఆ మహమ్మారిపై పోరాటానికి రెండు దేశాలు కలిసి పోరాడాల్సిన అవసరముందని ట్రంప్‌కు చెప్పారు జిన్‌పింగ్. కరోనా నియంత్రణలో తమ అనుభవాలు, ఇతర సమాచారం మొత్తాన్ని అగ్రరాజ్యంతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
10:57 March 27
కరోనా సంక్షోభం నేపథ్యంలో అన్ని రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. లాక్డౌన్ వేళ ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బందిని కొనియాడారు.
10:49 March 27
ఆందోళన వద్దు...
భారత్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ భద్రంగా ఉందని భరోసా ఇచ్చారు శక్తికాంత దాస్. ప్రైవేటు బ్యాంకుల్లోనూ ప్రజల డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. అనవసరంగా ఆందోళన చెంది, ప్రజలు ఒక్కసారిగా నగదు విత్‌డ్రా చేయొద్దని కోరారు.
10:44 March 27
రుణగ్రహీతలకు ఊరట- ఈఎంఐలపై 3 నెలల మారటోరియం
కరోనా సంక్షోభ సమయంలో సామాన్యులకు కాస్త ఊరటనిచ్చేలా కీలక చర్యలు చేపట్టింది రిజర్వు బ్యాంకు. టెర్మ్ లోన్స్ నెలవారీ వాయిదాల చెల్లింపుపై 3 నెలల మారటోరియం విధించేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చింది. వర్కింగ్ కేపిటల్‌పై వడ్డీ చెల్లింపు ఆలస్యమైనా రుణ ఎగవేతగా పరిగణించరాదని సూచించింది. చెల్లింపుల్లో జాప్యం... రుణగ్రహీత క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన చేశారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు తీసుకుంటున్న మరిన్ని చర్యల్ని వెల్లడించారు.
10:34 March 27
'ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ముప్పు- భారత్‌కూ ఇబ్బందే '
కరోనా సంక్షోభం... ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. 2019లో దశాబ్దపు కనిష్ఠానికి ప్రపంచ వృద్ధి రేటు పతనం కావడాన్ని గుర్తుచేశారు. 2020లో వృద్ధి కొంతైనా పుంజుకుంటుందన్న ఆశలు ఇప్పుడు ఆవిరైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా వ్యాప్తి తీవ్రత, వేగం, ఎంత కాలం ఈ మహమ్మారి కొనసాగుతుందన్న అంశాలపైనే ప్రపంచ ఆర్థిక భవిత ఆధారపడి ఉంటుందని విశ్లేషించారు ఆర్‌బీఐ గవర్నర్. ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోయే ప్రమాదముందని అంచనా వేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం... భారత్‌పైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు శక్తికాంత దాస్. అయితే... ముడి చమురు ధరల తగ్గుదల మాత్రమే మనకు లాభించే అంశం అవుతుందని చెప్పారు.
10:31 March 27
కీలక నిర్ణయాలు...
- నగదు నిల్వ నిష్పత్తి వంద బేసిస్ పాయింట్లు తగ్గింపు: ఆర్‌బీఐ గవర్నర్
- ఎంఎస్‌ఎఫ్ 1 శాతం పెంపు: ఆర్‌బీఐ గవర్నర్
- టర్మ్ లోన్ల ఈఎంఐలపై మార్చి నుంచి 3 నెలల మారటోరియం: ఆర్‌బీఐ గవర్నర్
10:24 March 27
మరింత ప్రమాదం...
- కరోనాతో ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి: ఆర్‌బీఐ
- పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం: ఆర్‌బీఐ
10:21 March 27
ఆర్‌బీఐ కీలక నిర్ణయం...
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా అనూహ్య నిర్ణయం తీసుకుంది రిజర్వు బ్యాంకు. కీలక వడ్డీ రేటును ఒకేసారి 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా రెపో రేటు 4.4 శాతానికి దిగొచ్చింది. రివర్స్ రెపో రేటు 90 బేసిస్ పాయింట్ల క్షీణతతో 4 శాతానికి చేరింది.
కరోనా విజృంభణ, దేశవ్యాప్తంగా లాక్డౌన్ వంటి పరిస్థితుల మధ్య ఈ అసాధారణ నిర్ణయాలను ప్రకటించారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. మరికొద్ది రోజుల్లో జరగాల్సిన ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశాన్ని ఈనెల 25, 26, 27 తేదీల్లో ముందుగానే నిర్వహించినట్లు తెలిపారు. రెపో రేటు తగ్గింపు సహా ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడతామని భరోసా ఇచ్చారు శక్తికాంత దాస్.
10:18 March 27
ఆర్‌బీఐ గవర్నర్ మీడియా సమావేశం
- రెపోరేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గింపు: ఆర్‌బీఐ గవర్నర్
- రివర్స్ రెపోరేటు 90 బేసిస్ పాయింట్లు తగ్గింపు: ఆర్‌బీఐ గవర్నర్
- 4.40 శాతానికి చేరిన రెపో రేటు: ఆర్‌బీఐ గవర్నర్
- 4 శాతానికి చేరిన రివర్స్ రెపోరేటు : ఆర్‌బీఐ గవర్నర్
- ప్రస్తుత పరిస్థితులను ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోంది: ఆర్‌బీఐ గవర్నర్
- అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటాం: ఆర్‌బీఐ గవర్నర్
- ఆర్థిక స్థిరత్వం కోసం చర్యలు తీసుకుంటాం: ఆర్‌బీఐ గవర్నర్
- సరైన సమయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది: ఆర్‌బీఐ గవర్నర్
- ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సహకరిద్దాం: ఆర్‌బీఐ గవర్నర్
- ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది: ఆర్‌బీఐ గవర్నర్
- ఫైనాన్షియల్ మార్కెట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం: ఆర్‌బీఐ గవర్నర్
10:09 March 27
కరోనా సంక్షోభం దృష్ట్యా ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.4శాతంగా నిర్ణయించింది.
10:04 March 27
గవర్నర్లతో వీడియో కాన్పరెన్స్...
అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
09:58 March 27
ఆర్‌బీఐ గవర్నర్ మీడియా సమావేశం
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
09:40 March 27
17కు చేరిన మృతుల సంఖ్య
దేశంలో కరోనాకు మరొకరు బలయ్యారు. వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 17కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
భారత్‌లో ఇప్పటివరకు మొత్తం 707 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 66 మంది కోలుకున్నారు.
09:21 March 27
భారత్‌లో కరోనాకు మరొకరు బలి- రాజస్థాన్‌లో తొలి మరణం
భారత్‌లో కరోనాకు మరొకరు బలయ్యారు. వైరస్ సోకి రాజస్థాన్ భిల్వారాలో 60 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.
అయితే ఆ వ్యక్తి వైరస్ సోకక ముందు నుంచే అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. మూత్రపిండం పాడయ్యే అతడు మృతి చెందాడని చెప్పారు.