తెలంగాణ

telangana

ETV Bharat / bharat

24 గంటల్లో 29 మరణాలు, 1,463 పాజిటివ్ కేసులు - coronavirus latest news china

corona-virus-live-updates-14th-april-2020
భారత్​లో 10 వేలు దాటిన కరోనా కేసులు

By

Published : Apr 14, 2020, 8:42 AM IST

Updated : Apr 14, 2020, 11:19 PM IST

23:07 April 14

భారత్​లో కరోనా వైరస్​ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 29 మరణాలు, 1,463 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా కేసులతో దేశంలో మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 10,815కి చేరుకుంది. ప్రస్తుతం 9,279 యాక్టివ్ కేసులుండగా... 1,190 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ముంబయి అతలాకుతలం

ముంబయిలో ఇవాళ ఒక్కరోజే 18 మంది కరోనాతో మరణించారు. కొత్తగా 350 మందికి వైరస్ సోకగా... మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 2,684కి పెరిగింది. 259 మంది కోలుకున్నారు.

బృహన్​ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా కేసులు, మరణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్క రోజే అక్కడ 11 మంది వైరస్తో​ మృతి చెందారు. పాల్ఘర్​లో ఈ రోజు 11 కొత్త కేసులు నమోదు కాగా... ఆ ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 53కి చేరింది.

గుజరాత్​లో ఇద్దరు మృతి

గుజరాత్​ రాష్ట్రంలో ఇవాళ ఇద్దరు మహమ్మారి బారిన పడి బలయ్యారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 28కి పెరిగింది.
 

తమిళనాట తగ్గిన కేసులు

తమిళనాడులో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ అక్కడ కేవలం 31 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీరిలో 21 మందికి తబ్లీగీ ప్రార్థనలతో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,204కి చేరింది. కాగా 81 మంది వ్యాధి నుంచి బాధితులు కోలుకున్నారు.

జమ్ముకశ్మీర్​లో... తగ్గుముఖం

జమ్ముకశ్మీర్​లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ కేవలం 8 కొత్త కేసులు మాత్రమే నమోదుకాగా... 14 మంది కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారు. ప్రస్తుతం అక్కడ మొత్తం కేసుల సంఖ్య 278గా ఉంది.

మూడేళ్ల పసిపాపలకు కరోనా

ఆంధ్రప్రదేశ్​లో 80 ఏళ్ల వృద్ధురాలికి సహా మూడేళ్లు వయస్సు గల ఇద్దరు చిన్నారులకు కూడా కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 473 కరోనా కేసులు నమోదయ్యాయి.

కేరళలో 173 యాక్టివ్​ కేసులు

కేరళలో ఈ రోజు 8 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 13 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 173 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.

కర్ణాటకలో 10కి చేరిన మరణాలు

కర్ణాటకలో ఇవాళ 76 ఏళ్ల ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 10కి చేరింది. అలాగే రాష్ట్రంలో 11 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. కర్ణాటకలో ఇప్పటి వరకు 260 పాజిటివ్​ కేసులు నమోదవ్వగా... 71 మంది కోలుకున్నారు.

బంగాల్​: గత 24 గంటల్లో 10 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 120కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏడుగురు కరోనాకు బలయ్యారు.

ఉత్తర్​ప్రదేశ్​:ఇవాళ కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీనితో మొత్తం మరణాలు సంఖ్య 8కి పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో 102 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 660కి చేరింది.

ఒడిశా:ఒడిశాలో 5 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 60కి చేరింది.

హరియాణా:ఫరీదాబాద్​లో కొత్తగా 2 పాజిటివ్​ కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 184కి పెరిగింది. ప్రస్తుతానికి 41 మంది ఆరోగ్యం బాగుపడి డిశ్చార్జ్​ కాగా.. 141 మంది కరోనాతో పోరాడుతున్నారు.

పంజాబ్​: ఎనిమిది కొత్త కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 184కి పెరిగింది. మరో వైపు జలంధర్​లో ఓ వ్యక్తి కరోనాతో మరణించాడు. దీనితో మృతుల సంఖ్య 13కి పెరిగింది.

ఉత్తరాఖండ్​:ఈ రోజు 2 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 37కు చేరుకుంది. 9 మంది మాత్రం కోలుకున్నారు.

ఝార్ఖండ్​: ఇవాళ రాష్ట్రంలో 3 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 27కి పెరిగింది.

20:40 April 14

మహారాష్ట్రలో భారీగా కేసులు

మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 350 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్​-19 కేసుల సంఖ్య 2,684కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 178 మంది మృతి చెందారు.

20:36 April 14

గుజరాత్​లో 28

కరోనా వైరస్​ సోకి గుజరాత్​లో మరో ఇద్దరు మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 28కి చేరింది.

20:10 April 14

ఉద్ధవ్​ ఠాక్రేకు అమిత్​ షా ఫోన్​

ముంబయి బాంద్రా రైల్వేస్టేషన్​ ఘటనపై ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేతో ఫోన్​లో చర్చించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. కరోనాపై దేశం చేస్తున్న పోరును ఇలాంటి ఘటనలు బలహీనపరుస్తాయని వివరించారు. ప్రభుత్వాధికారులు ఇలాంటి ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ విషయంలో మహా సర్కారుకు కేంద్రం సాయం ఉంటుందని స్పష్టం చేశారు.  

తమను స్వగ్రామాలకు పంపేలా అనుమతివ్వాలంటూ వేలాది మంది వలస కార్మికులు బాంద్రా రైల్వేస్టేషన్​ పరిసరాల్లో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నిరసనకారులను పోలీసులు లాఠీఛార్జ్​ చేసి చెదరగొట్టారు.

19:19 April 14

హెచ్​-1బీ వీసాల గడువు పెంపు

కరోనా కష్టకాలంలో హెచ్​-1బీ వీసాదారులకు ఊరట కల్పించింది అమెరికా ప్రభుత్వం. వీసాల గడువు పొడిగింపునకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది ట్రంప్ సర్కారు. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయులకు ఉపయోగం కలగనుంది.

19:10 April 14

మే 3 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని ప్రకటన మేరకు నోడల్ ఏజెన్సీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

18:58 April 14

కరోనా కారణంగా దేశంలో ప్యాసింజర్​ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది రైల్వేశాఖ. దీంతో పాటు ఏప్రిల్​ 15 నుంచి మే 3 వరకు బుక్​ చేసుకున్న దాదాపు 39 లక్షల టిక్కెట్లను కూడా రద్దు చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది.

18:31 April 14

వలసకార్మికుల ఆందోళన..

ముంబయిలో వలసకార్మికులు భారీగా రోడ్లపైకి చేరుకున్నారు. తమను తమ సొంత రాష్ట్రాలు, గ్రామాలకు వెళ్లేందుకు అనుమతించాలని ఆందోళన చేశారు. లాక్​డౌన్​ అమల్లో ఉన్నందున వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.  

అనంతరం ఆ పరిసర ప్రాంతాలను శానిటైజ్​ చేశారు. 

18:26 April 14

ముంబయిలో మరో 204 కేసులు...

ముంబయిపై కరోనా పంజా విసురుతోంది. ఇవాళ ఒక్కరోజే 204 కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. ఈ ఒక్క నగరంలోనే ఇప్పటివరకు 1753 మందికి కరోనా సోకింది. 

18:16 April 14

భారత వృద్ధి రేటు 1.9శాతమే..

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే 2020లో భారత వృద్ధి రేటు అంచనాలను భారీగా తగ్గించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్​). ఈ ఏడాది 1.9 శాతానికే పరిమితం అవ్వొచ్చని పేర్కొంది. 

17:47 April 14

దేశంలో కరోనా మృతుల సంఖ్య 353కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 29 మంది చనిపోగా..1463 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9272 యాక్టివ్​ కేసులుండగా.. 1190 మంది కోలుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

17:40 April 14

దశలవారీగా విమాన సేవలు : ఇండిగో

మే 3న లాక్​డౌన్​ ముగియనుండగా.. మే 4 నుంచి దశలవారీగా విమాన సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.

17:09 April 14

లక్షా 20వేలు దాటింది

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 మరణాల సంఖ్య 1,20,000 దాటింది. ఇందులో అత్యధికంగా అమెరికాలో-23,644, ఇటలీ-20,465, స్పెయిన్​-18,056, ఫ్రాన్స్​-14,976, బ్రిటన్​లో 11,329 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 20 లక్షలకు చేరువలో ఉంది.

16:28 April 14

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 1,211 కరోనా పాజిటివ్​ కేసులు నమోదుకాగా.. 31 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 1,06,719 ఐసోలేషన్​ బెడ్ల సౌకర్యంతో 602 కొవిడ్​-19 ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. వీటిల్లో 12,024 ఐసీయూ బెడ్లు కూడా ఉన్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 10363 కరోనా కోసులు నమోదయ్యాయి. వీరిలో 1036 మంది కోలుకున్నారు. 339 మంది మృత్యువాతపడ్డారు.

16:22 April 14

  • కొవిడ్‌-19కు సంబంధించి 20 గ్రీవెన్స్‌ సెంటర్లు: కేంద్రం
  • అందుబాటులో 166 ల్యాబ్‌లతో పాటు 77 ప్రైవేటు ల్యాబ్‌లు: కేంద్రం
  • పేదలందరికీ ఉచితంగా ఆహారం అందిస్తాం: కేంద్రం
  • 80 కోట్ల మందికి 5 కిలోల చొప్పున ఆహార వస్తువులు: కేంద్రం
  • 22 లక్షల టన్నుల ఆహారధాన్యాలు అందుబాటులో ఉన్నాయి: కేంద్రం
  • సప్త సూత్రాలు పాటించాలని ప్రధాని మోదీ అందరికీ విజ్ఞప్తి చేశారు: కేంద్రం
  • భౌతిక దూరం వందశాతం పాటించేలా చర్యలు: కేంద్రం
  • ఇప్పటివరకు 2,31,902 కరోనా పరీక్షలు చేశాం: కేంద్రం

15:37 April 14

పుణెలో మరో ముగ్గురు బలి

పుణెలో కరోనా మృతులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇవాళ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినందున పుణెలో మొత్తం 38 మంది ఈ మహమ్మారికి బలైనట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

15:25 April 14

స్పెయిన్​లో 300 మంది మృతి

కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్న స్పెయిన్​లో వైరస్​ సోకి మృతి చెందినవారి సంఖ్య 18వేలు దాటింది. ఆ దేశంలో ఇవాళ ఒక్కరోజే 300 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 1.72 లక్షలకుపైగా నమోదైంది.

15:17 April 14

లాక్​డౌన్​ మరింత కఠినం
దేశ రాజధాని దిల్లీలో లాక్​డౌన్ కట్టుదిట్టంగా కొనసాగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నందున మరిన్ని చర్యలు చేపట్టిన దిల్లీ ప్రభుత్వం. హాట్‌స్పాట్ ప్రాంతాలను 47కు పెంచింది. అలాగే ఇంటివద్దకే వచ్చి నిత్వాసర సరకులు పంపిణీ చేయనున్నారు. 
దిల్లీలో నిన్న ఒక్కరోజే 356 కరోనా పాజిటివ్ కేసుల నమోదైనందున.. మొత్తం కేసుల సంఖ్య 1510కి చేరింది. ఇప్పటివరకు 28 మంది మృతి చెందారు.

ఆజాద్‌పూర్ మార్కెట్‌లో కూరగాయలు, పండ్ల అమ్మకానికి టైం స్లాట్లు కేటాయించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకే కూరగాయల అమ్మకం, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పండ్ల అమ్మకాలు జరపాలని స్పష్టం చేశారు. దుకాణాల సంఖ్యను బట్టి సరి బేసి విధానం అమలు చేయాలని చూస్తున్నారు అధికారులు.

14:57 April 14

విదేశీయులను వెనక్కి పంపిస్తాం.. కానీ!

దేశంలోకి అధికారికంగా వీసా తీసుకుని వచ్చి కరోనా కారణంగా మొత్తం 160 మంది విదేశీయులు చిక్కుకుపోయారని కేంద్ర విదేశాంగశాఖ తెలిపింది. వీరిలో కొందరు పాకిస్థానీలూ ఉన్నట్లు వెల్లడించింది. అయితే వీరందరినీ స్వదేశానికి పంపేందుకు కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఇదే తరహాలో మిగిలిన దేశస్థులకు కూడా తమ సొంత దేశాలకు వెళ్లేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అమెరికన్లను ఆ దేశాధికారులు ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్లినట్లు పేర్కొన్న అధికారులు. ఇదే తరహాలో మిగిలిన దేశాలు కూడా ముందుకు వస్తే.. అనుమతులు ఇస్తామని వెల్లడించింది.

14:46 April 14

రొంగాలీబిహూ సందర్భంగా అసోంలో ట్రాఫిక్​ పోలీసులు సంబరాలు చేసుకున్నారు. నడిరోడ్డుపైనే డోలు వాయిస్తూ నృత్యం చేశారు. అందరికీ బిహూ శుభాకాంక్షలు చెబుతూ.. లాక్​డౌన్​లో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని కోరారు.

14:30 April 14

కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు

కూలీల రోజువారీ వేతనాల ఫిర్యాదులతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించేందుకు 20 కంట్రోల్​ రూమ్​లను ఏర్పాటు చేసింది కేంద్ర కార్మిక​, ఉపాధి మంత్రిత్వశాఖ.

13:34 April 14

కర్ణాటకలో మరో 11 కేసులు..

ఇవాళ మరో 11 కరోనా కేసులు నమోదవగా.. కర్ణాటక మొత్తం బాధితుల సంఖ్య 258కి చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 9 మంది చనిపోగా.. మరో 65 డిశ్చార్జి అయినట్లు వెల్లడించింది. 

13:23 April 14

టిక్కెట్లు క్యాన్సిల్​ చేసుకోవద్దు: ఐఆర్​సీటీసీ

మే 3వరకు అన్ని రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐఆర్​సీటీసీ.. రిజర్వేషన్​ చేసుకున్న టిక్కెట్లను క్యాన్సిల్​ చేసుకోవద్దని సూచించింది. నగదు.. తమ తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని స్పష్టం చేసింది. 

13:10 April 14

ఐపీఎల్​ వాయిదా లాంఛనమే

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున.. ఐపీఎల్​ వాయిదా లాంఛనమే కానుంది. ఈ మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకుందని.. అయితే ఆ తర్వాత ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై స్పష్టత లేదని సమాచారం.

12:52 April 14

దేశంలో కరోనా వైరస్​ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో రేపు కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో వైరస్​తో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

మహారాష్ట్రలో కొత్తగా 121 కరోనా పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో ఇవాళ మరో 121 కరోనా కేసులు గుర్తించారు అధికారులు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం 2,455 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

12:13 April 14

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కారణంగా జాతీయ, అంతర్జాతీయ విమాన సేవలను మే 3 వరకు రద్దు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది.

11:13 April 14

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను మే 3వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటనతో.. అన్ని ప్యాసింజర్ రైళ్లను మే 3 వరకు రద్దు చేసినట్లు రైల్వేశాఖ సీనియర్​ అధికారి ఒకరు వెల్లడించారు. 

11:08 April 14

ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మధ్యతరగతి, పేదవారి కోసం ఎలాంటి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించకుండా ఆంక్షలు కొనసాగించారని విమర్శించారు కాంగ్రెస్​ నేత అభిషేక్​ సింఘ్వీ.

10:14 April 14

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మే 3 వరకు లాక్​డౌన్​ పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇందుకు ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు ప్రధాని. లాక్​డౌన్​పై రేపు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రజల ప్రాణాలే ముఖ్యం

అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యాలతో పోలిస్తే భారత్‌ ఎంతో కొంత మంచి స్థితిలో ఉందన్నారు మోదీ. ఈ సందర్భంలో పోల్చడం సరికానప్పటికీ మన స్థితిని మనం అంచనా వేసుకోవాలిని తెలిపారు. యూరప్‌, అమెరికాలో వేలమంది మృత్యువాత పడుతుండటం ఎంతో బాధ కలిగించే విషయమన్న ఆయన.. లాక్‌డౌన్‌ నిబంధనలు నికచ్చిగా అమలు చేయగలకపోతే వాస్తవ పరిస్థితిని అంచనా వేయలేమని అభిప్రాయపడ్డారు.

లాక్‌డౌన్‌ వల్లే మనం సురక్షితంగా ఉన్నామని.. ఆర్థిక స్థితివైపు నుంచి వస్తే విపరీతమైన భారం మనపై పడిందని వెల్లడించారు. కోలుకోలేనంత దారుణంగా దెబ్బతిన్నామని.. అయినప్పటికీ ప్రజల ప్రాణాల కన్నా ఆర్థిక స్థితి ఎక్కువకాదని స్పష్టం చేశారు ప్రధాని. ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతోనే లాక్‌డౌన్‌ను అమలు చేశామని పునరుద్ఘాటించారు.

ప్రధాని ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు

  • ఏప్రిల్‌ 20 నుంచి అత్యవసర విషయాలకు అనుమతులు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ముందు ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకుంటారు.
  • ఎలాంటి నిర్లక్ష్యాన్ని కూడా సహించే పరిస్థితి లేదు
  • పేదలు, కూలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే
  • గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద తగినంత సాయం అందిస్తున్నాం
  • రబీ పంటల కోతలు జరుగుతున్నాయి
  • రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర, రాష్ట్రాలు చర్యలు తీసుకుంటాయి
  • ఆహార వస్తువులు, మందులు, ఔషదాల సప్లయ్‌ చైన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాం
  • సప్లయ్‌ చైన్‌కు ఎలాంటి అవరోధం కలగకుండా చర్యలు తీసుకుంటాం
  • కేంద్ర, రాష్ట్రాలు నిరంతరం నిత్యావసరాలు, ఔషధాల సరఫరాపై సమన్వయంతో పనిచేస్తాయి
  • కరోనాకు కొత్త ఔషధాలు కనుగొనడానికి యువ శాస్త్రవేత్తలు ముందుకు రావాలి
  • మానవ కల్యాణం, ప్రపంచ మానవాళి కోసం యువ శాస్త్రవేత్తలు ముందుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నా
  • భారతీయ యువ శాస్త్రవేత్తలు కరోనాపై పోరులో ప్రపంచానికి చుక్కానిగా నిలవాలి
  • ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి భౌతిక దూరం, లాక్‌డౌన్‌, లక్ష్మణరేఖ దాటవద్దు
  • ఇంట్లో తయారుచేసుకున్న మాస్కులను ప్రతిఒక్కరూ ధరించాలి
  • రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు అవసరమైన ఆహారం, వేడినీళ్లు తీసుకోవాలి
  • ప్రతిఒక్కరూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అన్ని విషయాలు తెలుసుకోవాలి
  • మీ పరిశ్రమల్లో ఎవరినీ ఉద్యోగాల నుంచి తీసివేయవద్దు
  • వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు తగినంత గౌరవం ఇవ్వాలి

10:12 April 14

సప్తపది... విజయానికి మార్గం

హెల్త్ ఇన్​ఫ్రా... లక్షకుపైగా పడకలు సిద్ధం... భారత్​ దగ్గర పరిమిత వనరులే ఉన్నాయి కానీ... విశ్వకల్యాణం కోసం యువత ముందుకు రావాలి. వ్యాక్సిన్ తయారీకి సంకల్పించుకోవాలి. కరోనాను ఓడిద్దాం.... అందరూ సహకరించండి...  

ఈ ఏడు సూత్రాలు పాటిస్తే కరోనాపై విజయం మనదే

1. వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా గతం నుంచే అనారోగ్య సమస్యలు ఉన్నవారి పట్ల మరింత జాగ్రత్త తీసుకోండి.

2. లాక్​డౌన్​, భౌతిక దూరం విషయంలో ఏమాత్రం రాజీ వద్దు. ఇంట్లో చేసుకున్న మాస్కును తప్పనిసరిగా ఉపయోగించండి.

3. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనలు పాటించండి.  

4. కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆరోగ్య సేతు మొబైల్ యాప్​ తప్పనిసరిగా డౌన్​లోడ్​ చేసుకోండి. ఇతరుల్నీ చేసుకోమనండి.

5. సాధ్యమైనంతవరకు పేద కుటుంబాలకు సాయం చేయండి. భోజనం అందేలా చూడండి.

6. వృత్తి, ఉద్యోగంలో సహచరుల పట్ల సహృదయంతో మెలగండి. ఎవరినీ ఉద్యోగం నుంచి తీయకండి.

7. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులను గౌరవించండి.

10:02 April 14

  • కరోనాపై భారత యుద్ధం బలంగా సాగుతోంది: ప్రధాని
  • కష్టమైనా, నష్టమైనా దేశం కోసం ప్రజలు నిలబడ్డారు: ప్రధాని
  • దేశం కోసం వాళ్ల కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తున్నారు: ప్రధాని
  • రాజ్యాంగంలో వుయ్‌ ద పీపుల్‌ ఆఫ్‌ ఇండియా అన్న పదానికి ప్రజలు సంపూర్ణ నిదర్శనంగా నిలుస్తున్నారు: ప్రధాని
  • అంబేడ్కర్‌ చెప్పిన మాటలు మనకు నిరంతరం ప్రేరణ ఇస్తున్నాయి: ప్రధాని
  • ప్రజలు ఒక్కతాటిపై నిలబడి పరస్పరం సహకరించుకోవడమే అంబేడర్క్‌కు ఇచ్చే నివాళి
  • లాక్‌డౌన్‌ నిబంధనల అమలు ఉండగానే ఉగాది నుంచి విశూ వరకు పండగలు జరుపుకున్నాం
  • భారత్‌ అంటేనే భిన్న మతాలు, సంస్కృతులు, ఉత్సవాలు
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ పండగలు నిరాడంబరంగా నిర్వహించుకున్నారు
  • కరోనా వ్యాప్తి జరగకుండా ప్రజలంతా ఒక్కటై నిలబడి పోరాడుతున్నారు
  • సమస్య మన దృష్టికి రాగానే వేగంగా నిర్ణయాలు తీసుకున్నాం
  • వీలైనంత త్వరగా కట్టడి చేసేందుకు అన్ని మార్గాలను అమలు పరిచాం
  • అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యాలతో పోలిస్తే భారత్‌ ఎంతో కొంత మంచి స్థితిలో ఉంది

09:43 April 14

  • కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
  • లాక్‌డౌన్‌ కొనసాగింపుపై స్పష్టత ఇవ్వనున్న ప్రధాని మోదీ
  • దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించే అవకాశం
  • వైరస్ కట్టడికి చర్యలు కొనసాగిస్తూనే జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఆంక్షలు?
  • వ్యవసాయ, పారిశ్రామిక, నిర్మాణ రంగాలకు వెసులుబాటు కల్పించే అవకాశం
  • దేశవ్యాప్తంగా నేటితో ముగియనున్న లాక్‌డౌన్‌ గడువు
  • లాక్‌డౌన్‌ పొడిగించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసిన పలు రాష్ట్రాల సీఎంలు
  • ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన 6 రాష్ట్రాలు
  • ఇప్పటికే లాక్‌డౌన్‌ పొడిగించిన తెలంగాణ, పంజాబ్‌, ఒడిశా, మహారాష్ట్ర, బంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలు

09:29 April 14

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్ గడువు నేటితో ముగియనుంది. 21 రోజుల పాటు కొనసాగిన ఈ నిర్బంధాన్ని పొడిగిస్తారా? లేదా? అనే అంశంపై ఈరోజు స్పష్టత రానుంది. ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. అయితే దేశంలో వైరస్ వ్యాప్తి దృష్ట్యా మరో రెండువారాల పాటు ఈ ఆంక్షలను పొడిగించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ముఖ్యమంత్రులు, పార్లమెంటరీ పార్టీ నేతలు, దేశంలోని ప్రముఖ నేతలు, విపక్ష సభ్యులు, మీడియా ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు మోదీ. ఆయా వర్గాల అభిప్రాయాలు, నిపుణుల సూచనల తీసుకున్నారు.

కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూడకుండా మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, మిజోరం, పంజాబ్​, బంగాల్ రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్​డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై యావత్​ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

09:07 April 14

అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 1,509 మంది మరణించినట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. 

అగ్రరాజ్యంలో మొత్తం 5 లక్షల 50 వేల మందికిపైగా వైరస్​ సోకింది. ఇప్పటివరకు 23,259 మంది ప్రాణాలు కోల్పోయారు.

08:39 April 14

భారత్​లో 10 వేలు దాటిన కరోనా కేసులు

భారత్​లో కరోనా మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 10 వేలు దాటింది. గత 24 గంటల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 10,363
  • యాక్టివ్ కేసులు: 8,988
  • కోలుకున్నవారు: 1,035
  • మరణాలు: 339
  • విదేశాలకు వెళ్లిన వారు: 1
Last Updated : Apr 14, 2020, 11:19 PM IST

ABOUT THE AUTHOR

...view details