తెలంగాణ

telangana

By

Published : Apr 4, 2020, 8:52 AM IST

Updated : Apr 5, 2020, 5:26 AM IST

ETV Bharat / bharat

కరోనాపై ఉమ్మడి పోరుకు ప్రధాని మోదీ పిలుపు

coronavirus news
విజృంభిస్తున్న కరోనా

22:44 April 04

కేసుల సంఖ్య...

దేశంలో కరోనా కేసులు 3,113కు చేరినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్​ఆర్​) తెలిపింది.

21:11 April 04

కరోనాపై పోరు కోసం ప్రపంచ దేశాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని నరేంద్రమోదీ. బ్రెజిల్​ అధ్యక్షుడు జైర్​ బోల్సొనోరోతో ఫోన్​లో మాట్లాడిన ఆయన... మహమ్మారిని కలిసి ఎదుర్కోవడంపై చర్చించారు.

కాసేపటి క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో మాట్లాడారు మోదీ. భారత్​, అమెరికా పూర్తి శక్తి సామర్థ్యాలతో కలిసి పనిచేసి, కరోనాను ఎదుర్కోవాలని ఇరువురు నేతలు తీర్మానించారు. 

21:02 April 04

మధ్యప్రదేశ్​ ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులకు కరోనా సోకింది. వీరిలో ఒకరు ఐఏఎస్​ అధికారి. ఇద్దరినీ ఐసోలేషన్​లో ఉంచి, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

19:59 April 04

ఆదేశాలు తప్పారు.. ఆసనాలు వేశారు

కరోనా లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై వినూత్నంగా చర్యలు చేపట్టారు కర్ణాటక పోలీసులు. నేడు కాలాబురాగి ప్రాంతంలో గస్తీలో ఉన్న పోలీసులు.. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన వారిచేత గుంజీలు తీయించడమే కాకుండా రోడ్లపైనే యోగాసనాలు వేయించారు. వారికి కొవ్వొత్తులు ఇచ్చి వెలిగించి పట్టుకోవాలని సూచించారు.

19:43 April 04

విదేశాలకు 18 విమాన సర్వీసులు

లాక్​డౌన్​ కారణంగా భారత్​లో చిక్కుకుపోయిన ఆయా దేశాల ప్రజల కోసం ప్రత్యేక విమానాలు నడపనుంది ఎయిర్​ ఇండియా. ఈ మేరకు తాజాగా ప్రకటన చేసింది. జర్మనీ, ఫ్రాన్స్​, ఐర్లాండ్​, కెనడాకు చెందిన వారికోసం దాదాపు 18 విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. ఆయా దేశాల రాయబారి కార్యాలయాల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

19:35 April 04

భారత్​లో యాక్టివ్​ కేసులు @ 2784

దేశంలో కరోనా కేసులు ఎక్కువయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 3,072కు చేరింది. ఇందులో 2784 యాక్టివ్ కేసులు​ ఉండగా.. 212 మంది డిశ్చార్జి అయ్యారు. అంతేకాకుండా 75 మంది మృతి చెందారు. కరోనా పాజిటివ్​ వచ్చాక దేశం విడిచివెళ్లిన వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు.

19:31 April 04

కరోనా మృతులు @ 75

దేశంలో కరోనా మృతులు, బాధితుల సంఖ్య పెరిగింది. కొవిడ్​-19తో మృతిచెందిన వారి సంఖ్య 75కు చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల సంఖ్య 3,072కు చేరింది.

19:27 April 04

తమిళనాడులో మరొకరు మృతి

తమిళనాడులో కరోనా మృతుల సంఖ్య రెండుకు చేరింది. వల్లిపురంలో 51 ఏళ్ల వ్యక్తి వైరస్​తో మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

19:24 April 04

కరోనాతో నలుగురు మృతి

మహారాష్ట్రలోని ముంబయిలో మరో నలుగురు కరోనాతో మృతి చెందారు. అంతేకాకుండా కొత్తగా 52 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

19:20 April 04

కేరళలో యాక్టివ్​ కేసులు @ 254

కేరళలో తాజాగా 11 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 254కు చేరింది. అంతేకాకుండా 1.71 లక్షల మందిపై పర్యవేక్షణలో ఉంచినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు.

19:12 April 04

కరోనాపై పోరుకు భారత్​-అమెరికా సై:

కరోనాపై పోరాటానికి ఇరుదేశాలు మరింత కలిసికట్టుగా పనిచేయాలని భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ నిశ్చయించుకున్నారు. ఈ మేరకు ఇద్దరు ఫోన్​లో చాలాసేపు సంభాషించుకున్నట్లు మోదీ ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

18:56 April 04

'ఆయుష్మాన్​ భారత్'​ పరిధిలోకి కరోనా

కరోనాపై పోరాటంలో భాగంగా పేద ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ముందడుగు వేసింది భారత ప్రభుత్వం. కరోనాకు సంబంధించిన వైద్య చికిత్సలను 'ఆయుష్మాన్​ భారత్​' పథకం కిందకు తీసుకొచ్చింది. ఫలితంగా ఈ పథకంలో సభ్యులైన అందరికీ.. అన్ని ఆసుపత్రుల్లో  కొవిడ్​-19 టెస్టింగ్​, చికిత్సలు ఉచితంగా చేయించుకునే అవకాశం కలుగనుంది.

18:42 April 04

రాజస్థాన్​లో మహిళ మరణం

కరోనా కారణంగా రాజస్థాన్​లో 60 ఏళ్ల మహిళ మృతి చెందింది. బికనీర్​ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. గత 24 గంటల్లో 21 కొత్త కేసులు రాగా.. మొత్తం బాధితుల సంఖ్య 200కు చేరింది. తాజాగా వచ్చిన కేసుల్లో 10 మందికి దిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్​తో సంబంధం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

18:35 April 04

'చేతులు సబ్బుతో కడుక్కొని దీపాలు వెలిగించండి'

కరోనా వైరస్​పై పోరులో భాగంగా ఆదివారం లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయితే ఈ సమయంలో శానిటైజర్లు పూసుకోవద్దని కేంద్రం సూచించింది. శానిటైజర్​లో ఆల్కహాల్​ ఉన్నందువల్ల దానికి మండే గుణం ఉంటుందని తెలిపింది. దీపాలు వెలిగించే సమయంలో చేతులు కాలిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. చేతులు శుభ్రంగా సబ్బుతో కడుగుకున్నాక దీపాలు వెలిగించాలని సూచించింది. విద్యుత్​ దీపాలు ఆపితే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరెంట్​ వినియోగం తగ్గిపోయి గ్రిడ్​ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందన్న ప్రచారం అపోహ మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది.

18:26 April 04

దిల్లీలో కరోనా బాధితులు @ 445

దేశ రాజధాని దిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 445కు చేరింది. ఇప్పటివరకు ఆరుగురు వైరస్​తో చనిపోయారని.. అందులో ఐదుగురు 60 ఏళ్ల పైబడిన వారని ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ తెలిపారు. ప్రస్తుతం వైద్యులకు రక్షణగా ఉండే పీపీఈ కిట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని.. కేంద్ర చొరవ తీసుకొని వాటిని అందించే ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.

18:18 April 04

కరోనాకు 95 మంది పోలీసులు, 46 వైద్య సిబ్బంది బలి

కరోనా మహమ్మారితో జరిగిన పోరులో 95 మంది పోలీసులు, 46 మంది వైద్యసిబ్బంది మరణించారని చైనా అధికారికంగా వెల్లడించింది. శనివారం అక్కడ కొవిడ్‌-19 బాధితులు, మృతుల జాతీయ స్మారకం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసు, వైద్య సిబ్బందిలో ఎందరు ప్రాణాలు కోల్పోయారో తొలిసారి ప్రకటించింది.

హుబెయ్‌ ప్రావిన్స్‌ ప్రధాన నగరం వుహాన్‌లో కొవిడ్‌-19 మహమ్మారి గతేడాది చివర్లో తొలిసారి వెలుగుచూసింది. శనివారం నాటికి 81,639 మందికి సోకగా 3,326 మంది మృతిచెందారని చైనా తెలిపింది. ప్రధాన పోలీసులు 60, సహాయ పోలీసులు 35 మంది కరోనా మహమ్మారి పోరులో ప్రాణత్యాగం చేశారని చైనీస్‌ మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది. మార్చి 15 నాటికి 46 మంది వైద్య సిబ్బంది కన్ను మూశారని పేర్కొంది. 3000కు పైగా వైద్య సిబ్బందికి ఈ వైరస్‌ సోకిందని గతంలో చైనా చెప్పింది.

18:14 April 04

కేరళలో మరో 11 కేసులు:

కేరళలో మరో 11 కరోనా పాజిటివ్​ కేసులు నమోదవగా.. మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 262కు చేరింది.

18:08 April 04

చిన్నారికి 'కరోనా'గా నామకరణం

ఉత్తరప్రదేశ్​లోని బిల్తారా పోలీసు స్టేషన్​లో హోమ్​గార్డుగా పనిచేస్తున్న రియాజుద్దీన్​ తన కొడుక్కి 'కరోనా'గా నామకరణం చేశాడు. ఈ మహమ్మారిపై పోరాటానికి గుర్తుగా తన కుమారుడికి వైరస్​ పేరు పెట్టినట్లు తెలిపాడు.

18:05 April 04

తమిళనాడులో కోరలు చాచిన కరోనా:

తమిళనాడులో ఒక్కరోజులోనే 74 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఈ మహమ్మారి బాధితుల సంఖ్య 485కు చేరింది.

18:00 April 04

కశ్మీర్​లో మరో 14 కేసులు..

కశ్మీర్​లో మరో 14 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 92కు చేరింది.

17:58 April 04

హిమాచల్​ప్రదేశ్​లో బబుల్​గమ్​ నిషేధం

చూయింగ్​ గమ్​/ బబుల్​గమ్​ అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించింది హిమాచల్​ ప్రదేశ్​ ప్రభుత్వం. జూన్​ 30 వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

17:54 April 04

75 వేల మాస్కులు తయారీ:

మార్చి నుంచి ఇప్పటివరకు తీహార్, మండోలి​ జైళ్లలోని ఖైదీలు 75 వేల మాస్కులు తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వాటిని ట్రాఫిక్​ పోలీసులకు అందజేసినట్లు తెలిపారు.

17:50 April 04

కర్ణాటకలో 16 కేసులు..

కర్ణాటకలో మరో 16 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఈ వైరస్​ బారిన పడినవారి సంఖ్య 144కు చేరింది.

17:48 April 04

ఉత్తరప్రదేశ్​లో కరోనా కేసులు @ 94

ఉత్తరప్రదేశ్​లో 24 గంటల్లో కొత్తగా 94 కరోనా కేసులు నమోదయ్యాయి. వీళ్లందరికీ దిల్లీలోని నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాత్​తో సంబంధం ఉన్నట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య 227కు చేరింది. ఇందులో 21 మంది కోలుకున్నారు.

17:40 April 04

కరోనాను జయించిన వ్యక్తికి చప్పట్లతో వీడ్కోలు:

కేరళలోని కాసరగూడకు చెందిన ఓ వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాడు. ఇతడు ఇంటికి తిరిగివెళ్తుండగా ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది, బాధితులు అతడికి చప్పట్లతో అభినందనలు తెలిపారు.

కేరళ రాష్ట్రంలో మొత్తం 295 కేసులు నమోదవగా.. 251 కేసులు యాక్టివ్​గా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పీసీఆర్​ టెస్టులు చేసేందుకు 9 ల్యాబ్​లను ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎవరికైనా టెస్టుల్లో నెగిటివ్​ వచ్చినా 14 రోజులు క్వారంటైన్​ నిబంధనను అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ స్పష్టం చేసింది.

17:08 April 04

ఉత్తరప్రదేశ్​లో మరో 8 కేసులు:

ఉత్తరప్రదేశ్​లోని గౌతమ్​ బుద్ధనగర్​ జిల్లాలో మరో 8 కరోనా వైరస్​ కేసులు నమోదయ్యాయి. వీరందరికీ కరోనా పాజిటివ్​ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 55కు చేరింది.

16:47 April 04

కరోనాపై పోరుకు గౌతమ్​ అదానీ భారీ సాయం:

కరోనాపై పోరుకు భారీ విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చారు సంపన్న వ్యాపారవేత్త గౌతమ్​ అదానీ. ప్రధాని మోదీ ప్రారంభించిన 'పీఎం కేర్స్​'కు రూ.100 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా  అదానీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు రూ.4 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు.

16:30 April 04

17 రాష్ట్రాల్లో వేయికి పైగా 'జమాత్'​ కేసులు:

దిల్లీలోని నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాత్​తో సంబంధం ఉన్నవారిలో.. ఇప్పటికి 1023 మందికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది. మొత్తం 17 రాష్ట్రాల్లో వైరస్​ వ్యాపించినట్లు తెలిపారు. ఇప్పటివరకు వీరికి సంబంధించిన 22వేల మందిని క్వారంటైన్​కు తరలించినట్లు స్పష్టం చేశారు.

కరోనా మొత్తం పాజిటివ్‌ కేసుల్లో... 20 ఏళ్ల లోపువారు -- 9 శాతం, 21-40 ఏళ్ల వయసువాళ్లు -- 41 శాతం, 41-60 ఏళ్లు ఉన్నవారు--  33 శాతం, 60 ఏళ్లు పైబడినవాళ్లు -- 17 శాతం ఉన్నట్లు  కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది. కేరళ, దిల్లీ, మధ్యప్రదేశ్‌ నుంచి అత్యంత సమస్యాత్మక కేసులు వచ్చినట్లు తెలిపింది.

16:21 April 04

ఐసోలేషన్​ వార్డులుగా హోటళ్లు...

ముజాఫర్​నగర్​లో 21 హోటళ్లను ఐసోలేషన్​ వార్డులుగా మార్చింది ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం. కొవిడ్​-19 నియంత్రణ కోసం పాటుపడుతోన్న వైద్య విభాగానికీ వసతితో పాటు ఇందులో ఆహారాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.

16:13 April 04

24 గంటల్లో 601 కేసులు:

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2902 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2650 కేసులు యాక్టివ్​గా ఉండగా.. 68 మృ తిచెందారు. 183 మంది కోలుకున్నారు. 

గడిచిన 24 గంటల్లో 601 కేసులు నమోదవగా.. 12 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

16:05 April 04

పశ్చిమ బంగాలో మరో కరోనా కేసు..

బంగాల్​లో మరో కొవిడ్​-19 కేసు నమోదైంది. ఇతడికి దిల్లీలోని నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాత్​తో సంబంధం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 58కి చేరింది.

15:59 April 04

పీఎం కేర్స్​కు కేంద్ర గిడ్డంగుల సంస్థ విరాళం..

కరోనాపై పోరులో భాగంగా భారీ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చింది కేంద్ర గిడ్డంగుల సంస్థ. తమ వంతు సాయంగా పీఎం కేర్స్​కు రూ.5.65 కోట్లను ఇస్తున్నట్లు ప్రకటించింది.

15:50 April 04

దిల్లీలో మరో 31 మందికి కరోనా పాజిటివ్​:

నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాత్​లో పాల్గొన్న 137 మందికి తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించింది దిల్లీ ప్రభుత్వం. ఇందులో 31 మందికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆగ్రాలో 37 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.  

దిల్లీ జవహర్​ లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్​యూ)లో లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించిన కొంత మంది విద్యార్థులపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. ఏప్రిల్​ 1న ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. విద్యార్థులు గుంపులుగా ఉండటమే కాకుండా సెక్యూరిటీతోనూ దురుసుగా ప్రవర్తించినట్లు వెల్లడించారు.

15:42 April 04

డాక్టర్లకు రిసార్టుల్లో వసతి 'ఫ్రీ':

కరోనాపై పోరాటంలో భాగంగా రాత్రీ, పగలు తేడా లేకుండా పనిచేస్తున్న వైద్యుల కోసం హరియాణా పర్యాటక శాఖ వినూత్న ఆలోచన చేసింది. తమ ఆధీనంలో ఉన్న రిసార్టుల్లో వైద్యులు, పారా మెడికల్​ సిబ్బందికి వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉచితంగా వారికి అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. 

తాజాగా 56 మందికి వైద్య పరీక్షలు చేయగా 16 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వీరందరూ దిల్లీలోని నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాత్​తో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

15:36 April 04

తమిళనాడులో మరో కరోనా మరణం:

కొవిడ్​-19 కారణంగా తమిళనాడులో మరో వ్యక్తి మృతి చెందాడు. ఇటీవలె దిల్లీ నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాత్​లో పాల్గొన్న ఇతడు.. నేడు స్వస్థలంలో చనిపోయినట్లు ఆ రాష్ట్ర అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 411 కరోనా పాజిటివ్​ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇందులోని 364 మంది జమాత్​లో పాల్గొన్నవారని అధికారులు తెలిపారు.

15:30 April 04

కానిస్టేబుల్​కు కరోనా పాజిటివ్​:

మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో మరో 14 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక పోలీసు కానిస్టేబుల్​కు కొవిడ్​-19 సోకింది. అంతేకాకుండా నలుగురికి దిల్లీ నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాత్​తో సంబంధం ఉందని అధికారులు తెలిపారు.

15:16 April 04

రైళ్ల సర్వీసులపై 12 తర్వాతే నిర్ణయం..

దేశవ్యాప్త లాక్​డౌన్​లో భాగంగా ప్రజారవాణా బంద్​ అయిపోయింది. ఇందులో భాగంగా సరకు రవాణా మినహా రైళ్లన్నీ నిలిచిపోయాయి. ఏప్రిల్​ 14న లాక్​డౌన్​ గడువు ముగుస్తుండటం వల్ల ఈ అంశంపై సందిగ్ధం కొనసాగుతోంది. అయితే రైళ్ల పునరుద్ధరణపై ఈ నెల 12 తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రైల్వే శాఖ వెల్లడించింది.

15:10 April 04

బిడ్డకు జన్మనిచ్చిన కరోనా సోకిన తల్లి..

దిల్లీ ఎయిమ్స్​లో కరోనా పాజిటివ్​ బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పసికందు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎయిమ్స్​లో సీనియర్​ రెసిడెంట్​ వైద్యుడిగా పనిచేస్తున్న వ్యక్తికి ఇటీవలె కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. ఆయన భార్యే శుక్రవారం రాత్రి బిడ్డకు జన్మనిచ్చింది. భర్త నుంచి ఆమెకు కొవిడ్​-19 సోకింది. తల్లీబిడ్డను ఐసోలేషన్​ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

14:58 April 04

హరియాణాలో 13 మందికి కరోనా..

హరియాణాలో కొత్తగా 13 మందికి కరోనా వైరస్​ సోకింది. వైద్య పరీక్షల్లో అందరికీ కొవిడ్​-19 పాజిటివ్​ వచ్చినట్లు ఆ రాష్ట్ర వైద్య విభాగం ప్రకటించింది. వీళ్లకు దిల్లీ నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాత్​తో సంబంధం ఉందని అధికారులు తెలిపారు.

13:53 April 04

సీకే బిర్లా గ్రూప్​ భారీ విరాళం..

కరోనాపై పోరులో భాగంగా రూ.35 కోట్ల విరాళం ప్రకటించింది సీకే బిర్లా గ్రూప్​. ఇందులో రూ.25 కోట్లను పీఎం కేర్స్​కు ఇవ్వగా.. రూ.10 కోట్లను మాస్కులు, వైద్య పరికరాల కొనుగోళ్ల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహాయనిధులకు పంపించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

13:50 April 04

మధ్యప్రదేశ్​లో మరో 6 కరోనా కేసులు:

మధ్యప్రదేశ్​లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా భోపాల్​కు చెందిన ఆరుగురికి కొవిడ్​-19 పాజిటివ్​ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం వైరస్​ కేసుల సంఖ్య 164కు చేరింది.

13:42 April 04

జమ్మూ కశ్మీర్​లో మూడు కరోనా కేసులు:

జమ్మూ కశ్మీర్​లో మరో 3 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 78కి చేరింది. ఇప్పటివరకు ఈ కేంద్రపాలిత ప్రాంతంలో 1,218 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వైరస్​కు హాట్​స్పాట్​లుగా ఉన్న 34 ప్రాంతాల పేర్లనూ ప్రకటించారు.

13:30 April 04

పాకిస్థాన్​లో కరోనా కేసులు @ 2700

పాకిస్థాన్​లో కరోనా వైరస్​ తీవ్రరూపం దాలుస్తోంది. దాయాది దేశంలో వైరస్​ బాధితుల సంఖ్య 2708కు చేరింది. ఇందులో వేయికి పైగా కేసులు ఆ దేశంలోని పంజాబ్​ ప్రాంతంలో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 40 మంది చనిపోగా.. 130 మంది కోలుకున్నారు.

13:20 April 04

కరోనాపై పోరుకు 'పిగ్గీ బ్యాంక్​' డబ్బులు విరాళం..

కరోనాపై పోరులో భాగంగా విరాళాలివ్వాలని ప్రధాని మోదీ పిలుపునకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయా సంస్థలు, ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజలూ భాగస్వామ్యం కావాలని సూచించిన మోదీ.. తమకు తోచిన చిన్నామొత్తాలను కూడా విరాళంగా ఇవ్వొచ్చని చెప్పారు. తాజాగా కరోనాపై పోరు కోసం తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు మధ్యప్రదేశ్​కు చెందిన 14 ఏళ్ల బాలుడు. తన పిగ్గీ బ్యాంక్​లో దాచుకున్న 2వేల 280 రూపాయలను ఆ రాష్ట్ర సీఎం సహాయనిధికి అందజేశాడు.

ఇదే రాష్ట్రంలోని కిల్చిపూర్​కు చెందిన 63 ఏళ్ల ఓ మహిళ పక్షవాతంతో బాధపడుతున్నా... తనకు తోచిన మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేసింది. 21 టవళ్లు సహా రూ.5,551 డబ్బును పంపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

13:07 April 04

మధ్యప్రదేశ్​లో మూడు కరోనా మరణాలు..

మధ్యప్రదేశ్​లో మరో మూడు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు ఇండోర్​కు చెందినవారు కాగా, ఓ వ్యక్తి చింద్వారాకు చెందినట్లుగా అధికారులు వెల్లడించారు. ఫలితంగా ఈ రాష్ట్రంలో మృతుల సంఖ్య 11కు చేరింది. మొత్తం 158 కరోనా పాజిటివ్ కేసులు​ నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య విభాగం తెలిపింది.

12:57 April 04

కచ్చితంగా ధరించాల్సిందే!

దేశ ప్రజలంతా విధిగా మాస్కులు ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నిత్యావసర వస్తువుల కొనుగోలు సహా పలు అవసరాల కోసం బయటకు వచ్చేవాళ్లు ఇకపై కచ్చితంగా ముఖానికి మాస్కులు వేసుకోవాలని సూచించింది. దుకాణాల్లో కొనుక్కున్న మాస్కులే కాకుండా ఇంటి వద్ద తయారు చేసుకున్నవైనా పర్లేదని చెప్పింది. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

12:43 April 04

అసోంలో పాజిటివ్​ కేసులు @ 25

అసోంలోని ఉత్తర లకీమ్​పుర్​ జిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. ఫలితంగా ఈ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 25కు చేరింది.

12:25 April 04

'దయచేసి ప్రజలంతా ఈ విషయం గమనించాలి'

ఆదివారం రాత్రి 9 గంటలకు అన్ని లైట్లను ఆపేసి.. ఇంటి గుమ్మం ముందో, బాల్కనీలోనో నిలబడి 9 నిముషాల పాటు కొవ్వొత్తి, దీపం, టార్చ్​ లేదంటే మొబైల్​ ఫ్లాష్​లైట్​ రూపంలో వెలుగులు ప్రసరింపజేయాలని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు. ఫలితంగా దేశంలోని ప్రజలంతా ఒక్కతాటిపై పోరాడుతున్నామన్న భావన అందరిలో ఉద్భవిస్తుందని ఆయన చెప్పారు. అయితే ప్రజలంతా ఇళ్లలో పూర్తిగా లైట్లు ఆపడం వల్ల కలిగే పరిణామాలపై తాజాగా మహారాష్ట్ర విద్యుత్​శాఖ మంత్రి నితిన్​ రావన్​ ఆందోళన వ్యక్తం చేశారు.

9 నిముషాల పాటు అందరూ లైట్లు ఆపేస్తే.. విద్యుత్​ అందించే గ్రిడ్​లు దెబ్బతింటాయని, ఫలితంగా పునరుద్ధరణకు చాలా రోజులు పడుతుందని చెప్పారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా ఇళ్లలో లైట్లు అన్నింటినీ పూర్తిగా ఆపేయొద్దని సూచించారు. ఈ సమయంలోనూ రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఎలక్ట్రానిక్​ గృహోపకరణాలు వినియోగించాలని నితిన్​ రావత్​ కోరారు. ఫలితంగా లోడ్​ సాధారణంగా కొనసాగుతుందని, సమస్యలు రావని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు.

12:23 April 04

లద్దాఖ్​లో 9 మంది సేఫ్​​...

లద్దాఖ్​ ప్రాంతంలో కరోనా బారిన పడిన 14 మందిలో 9 మంది కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారందరికీ వైద్య పరీక్షల్లో నెగిటివ్​ వచ్చినట్లు తెలిపారు.

12:19 April 04

గుజరాత్​లో మరో కేసు:

గుజరాత్​లో తాజాగా మరో 10 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఈ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 105కు చేరింది.

12:13 April 04

రాజస్థాన్​లో మరో రెండు కేసులు...

రాజస్థాన్లోని జోధ్​పుర్​లో మరో రెండు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 198కు చేరింది. ఇందులో 41 మందికి గత నెల దిల్లీ నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాత్​తో సంబంధం ఉందని అధికారులు తెలిపారు.

12:08 April 04

మహారాష్ట్రలో మరో 47 కేసులు...

మహారాష్ట్రలో మరో 47 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబయి నుంచి 28, థానేలో 15, అమరావతిలో 1, పుణెలో 2, పింపిరి చించ్వాడా నుంచి ఒక కేసు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా ఈ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 537కు చేరింది.

12:01 April 04

ఏప్రిల్​ 15 నుంచి రిజర్వేషన్లకు అనుమతి!

ఏప్రిల్​ 14 తర్వాత దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ ఎత్తివేస్తారా? లేదా అనేదానిపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్​ 15 నుంచి రైల్వేశాఖ రిజర్వేషన్లకు అనుమతినివ్వడం ఊరటనిస్తోంది. రైల్వే ఉద్యోగులు విధుల్లో చేరాలని ఇప్పటికే భారతీయ రైల్వేశాఖ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

11:48 April 04

ఉత్తరప్రదేశ్​లో మరో 7 కేసులు...

ఉత్తరప్రదేశ్​లో మరో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. భాందా జిల్లాలో తొలి కరోనా పాజిటివ్​ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 40 ఏళ్ల వ్యక్తికి వైరస్​ సోకినట్లు ధ్రువీకరించారు. వీరందరికీ గత నెల దిల్లీ నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాత్​తో సంబంధం ఉందని తెలిపారు.

11:41 April 04

వినోదరంగ కూలీలకు నెట్​ఫ్లిక్స్​ భారీ సాయం...

దేశంలోని వినోదరంగంలో పనిచేస్తోన్న రోజూవారి కూలీలకు భారీ సాయం ప్రకటించింది నెట్​ఫ్లిక్స్. ఇందులో భాగంగా వారి కోసం ఏర్పాటు చేసిన ప్రోడ్యూసర్స్​ గిల్డ్​ ఆఫ్​ ఇండియా(పీజీఐ) సహాయనిధికి దాదాపు రూ.7.5 కోట్లు ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

11:37 April 04

నెస్లే సంస్థ రూ.15 కోట్లతో సేవాకార్యక్రమాలు..

కరోనా లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందిపడుతున్న బాధితులకు.. ఆహారం, నిత్యావసర వస్తువులు అందించేందుకు ముందుకొచ్చింది ప్రముఖ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ నెస్లే. దాదాపు రూ.15 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా దిల్లీలోని నారాయణ హృద్యాలయ ఫౌండేషన్​ ద్వారా కోటి రూపాయలతో స్థానికంగా ఉన్న కొన్ని ఆసుపత్రుల్లో వైద్య పరికరాలనూ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

11:27 April 04

పీఎం కేర్స్​కు ఎయిమ్స్​ విరాళం...

కరోనాపై ప్రజలకు వైద్య సహాయం అందిస్తోన్న ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​(ఎయిమ్స్​).. పీఎం కేర్స్​కు తన వంతు విరాళం అందించేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఎయిమ్స్​ ఉద్యోగులంతా ఒకరోజు వేతనాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

11:19 April 04

వైద్యులకూ క్వారంటైన్​...

ఇద్దరు కరోనా పాజిటివ్​ బాధితులకు వైద్యం అందించిన 108 మంది వైద్య సిబ్బందికీ క్వారంటైన్​ ఇబ్బందులు తప్పట్లేదు. వారందరూ దిల్లీలోని సర్​ గంగారామ్​ ఆసుపత్రికి చెందిన వారిగా అధికార వర్గాలు  వెల్లడించాయి. ఇందులో 85 మంది స్వీయ నిర్బంధంలో ఉండగా.. 23 మంది ఆసుపత్రిలో నిర్బంధంలో ఉన్నారు.

11:13 April 04

యూపీలో మాస్కుల పంపిణీ

కరోనా నియంత్రణ కోసం ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని 23 కోట్ల మంది జనాభాకు 66 కోట్ల ఖాదీ మాస్కులు అందించాలని నిర్ణయించింది. 

11:08 April 04

మధ్యప్రదేశ్​లో మరో మరణం

మధ్యప్రదేశ్​లో కరోనా సోకి మరొకరు మరణించారు. చింద్వాడాలో 36 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 9కి చేరింది.

11:02 April 04

ఫాల్క్​ల్యాండ్స్ దీవుల్లో తొలి కరోనా కేసు...

ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్​ దాదాపు 206 దేశాలకు పాకేసింది. తాజాగా బ్రిటన్​ ఆధీనంలో ఉన్న ఫాల్క్​ల్యాండ్స్​ ఐస్​లాండ్​కూ ఈ మహమ్మారి చేరింది. దక్షిణ అట్లాంటిక్​ మహాసముద్రంలో ఉన్న ఈ దీవుల్లో తొలి కరోనా కేసు నమోదైనట్లు ఆ ప్రాంత అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితుడిని ఐసోలేషన్​లో ఉంచగా.. కోలుకుంటున్నట్లు తెలిపారు. ఈ దీవుల్లో మొత్తం 3వేల 400 మంది నివాసం ఉంటున్నారు. వారందరికీ వైద్య పరీక్షలు చేపడుతున్నట్లు బ్రిటన్​ ప్రభుత్వం తెలిపింది.

10:59 April 04

మరో కరోనా మరణం...

కరోనాతో గుజరాత్​లోని అహ్మదాబాద్​కు చెందిన ఓ మహిళ మరణించింది. ఫలితంగా ఈ రాష్ట్రంలో మృతుల సంఖ్య 10కి చేరింది.

10:45 April 04

బోపాల్​లో ఆ మహిళకు కరోనా నెగిటివ్​...

బోపాల్​కు చెందిన ఓ మహిళ మార్చి 21 కరోనా పాజిటివ్​గా తేలగా.. అనంతరం క్వారంటైన్​ తర్వాత నేడు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇందులో నెగిటివ్​ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆమెతో పాటు తన తండ్రికీ కరోనా నెగిటివ్​ వచ్చిందని చెప్పారు. అతడు జర్నలిస్ట్​ కావడం వల్ల అప్పట్లో పెద్ద దుమారం రేగింది. వీరిద్దరూ బోపాల్​లోని ఎయిమ్స్​ నుంచి డిశ్చార్జి అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

10:35 April 04

రాజస్థాన్​లో మరో 5 కరోనా కేసులు...

రాజస్థాన్​లోని జోధ్​పుర్​కు చెందిన మరో ఐదుగురికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 196కు చేరింది. ఇందులో ఇందులో 41 మందికి దిల్లీ నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాత్​తో సంబంధం ఉందని అధికారులు వెల్లడించారు. 

10:33 April 04

12 మంది బంగ్లాదేశీయులపై కేసులు..

నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాత్​లో పాల్గొన్న 12 మంది బంగ్లాదేశీయులపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు దిల్లీ పోలీసులు. ప్రస్తుతం వీరందరూ ఉత్తరప్రదేశ్​లోని షామ్లీ జిల్లాలో క్వారంటైన్​లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఇద్దరికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు తెలిపారు.

10:27 April 04

గోవాలో మరో కరోనా కేసు...

గోవాలోని పనాజీకి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్​ వచ్చింది. ఫలితంగా రాష్ట్రంలోని మొత్తం బాధితుల సంఖ్య 7కు చేరింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి విశ్వజిత్​ రాణే వెల్లడించారు.

10:19 April 04

డ్రోన్లతో పోలీసుల గస్తీ..

లాక్​డౌన్​ సమయంలో కేరళ పోలీసులు సాంకేతికతను వినియోగించుకుని గస్తీ చేపడుతున్నారు. నేడు పనంబిల్లి నగర్​లోని కొంతమంది ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి రోడ్లపైకి వాకింగ్​కు వచ్చారు. డ్రోన్​ కెమేరాలతో గస్తీ కాస్తున్న పోలీసులు.. 41 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత వారికి అవగాహన కల్పించి బెయిల్​ మీద విడిచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

10:14 April 04

దేశంలో మృతుల సంఖ్య @ 68

దేశంలో మొత్తం 2902 కరోనా కేసులు నమోదవగా.. వాటిలో 2650 యాక్టివ్​​ కేసులు ఉన్నాయి. 68 మంది మృతి చెందారు. 183 మంది డిశ్చార్జీ అయ్యారు.

10:08 April 04

మరో కరోనా మరణం..

మధ్యప్రదేశ్​లో మరో కరోనా మరణం నమోదైంది. చింద్వాడాకు చెందిన 36 ఏళ్ల ఓ వ్యక్తి కొవిడ్​-19 పాజిటివ్​గా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా రాష్ట్రంలోని బాధితుల సంఖ్య 155నకు చేరగా.. మృతుల సంఖ్య 9కు పెరిగింది.

10:03 April 04

ఆ వ్యక్తి చనిపోయింది కరోనాతోనే..

మహరాష్ట్రలోని అమరావతిలో 45 ఏళ్ల ఓ వ్యక్తి ఏప్రిల్​ 2న మృతిచెందాడు. ఇతడు కరోనాతో చనిపోయినట్లు తాజాగా ఆ జిల్లా కలెక్టర్​ శైలేశ్​ నైవాల్​ వెల్లడించారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్​ వచ్చినట్లు ధ్రువీకరించారు.

09:56 April 04

భారత్​ నుంచి ఫ్రాన్స్​కు ప్రత్యేక విమానం..

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో దేశంలో చిక్కుకుపోయిన 112 మంది ఫ్రెంచ్​ దేశస్థుల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈరోజు ఉదయం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్యారిస్​కు.. ఎయిర్​ ఇండియా ఈ విమాన సర్వీసును నడిపింది. విదేశీయులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఎయిర్​పోర్టు అధికారులు వెల్లడించారు.

09:43 April 04

ఐకరాజ్యసమితి సమావేశాలు వాయిదా..

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఐకరాజ్యసమితి సాధారణ సభ్య సమావేశాలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్​, మే నెలలో ఈ సమావేశాలు జరగాల్సి ఉంది. సెప్టెంబర్​లో నిర్వహించాల్సిన ఉన్నత స్థాయి వార్షిక భేటీపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.

09:34 April 04

కరోనాపై పోరుకు 500 మంది విద్యార్థులు..

కరోనాపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు వైద్య విద్యార్థుల సేవలను వినియోగించుకుంటోంది ఒడిశా. వైరస్​ బాధితుల కోసం మూడు ఆసుపత్రులు ఏర్పాటు చేసిన నవీన్​ పట్నాయక్​ ప్రభుత్వం.. 500 మంది ఎంబీబీఎస్​ విద్యార్థులకు శిక్షణ నిచ్చి మహమ్మారిపై పోరుకు సిద్ధం చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

08:47 April 04

రాజస్థాన్​లో మరో 12 కేసులు- 8 మందికి తబ్లీగీతో లింక్​

రాజస్థాన్​లో కరోనా కారణంగా ఒకరు మరణించారు. 60 ఏళ్ల వృద్ధురాలు బికనేర్​లో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 

ఆ రాష్ట్రంలో మరో 12 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఇందులో 8 మందికి దిల్లీ నిజాముద్దీన్​లో జరిగిన తబ్లీగీ జమాత్​తో సంబంధం ఉందని అధికారులు వెల్లడించారు. 

రాజస్థాన్​లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 191కి చేరింది.

Last Updated : Apr 5, 2020, 5:26 AM IST

ABOUT THE AUTHOR

...view details