దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20వేలు దాటింది. 24గంటల్లో 1,486 కొత్త కేసులు నమోదయ్యాయి, 49మంది మరణించారు. ఇప్పటివరకు 20వేల 471మంది వైరస్ బారినపడ్డారు. 652మందికి వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
వివిధ రాష్ట్రాల్లో ఇలా...
గుజరాత్లో మరో 94...
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గుజరాత్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. తాజాగా 94మందికి వైరస్ సోకగా రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2వేల 272కు చేరింది. ఈ 94 మందిలో 61 మంది అహ్మదాబాద్, 17మంది సూరత్, వడోదర నుంచి 8, అరావలి నుంచి ఐదుగురు, బోటాడ్ నుంచి ఇద్దరు, ఒకరు రాజ్కోట్వాసులని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
గుజరాత్లో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 95కు చేరింది.
144మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 38వేల 59 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించారు. 2,033 యాక్టివ్ కేసుల్లో 13మంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది.
రాజస్థాన్‌లో...
రాజస్థాన్‌లో తాజాగా 64 కేసులు నమోదయ్యాయి. ఈ 64లో 44 కేసులు అజ్మీర్‌కు చెందినవే. ఫలితంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,799కు చేరింది. వైరస్‌తో ఇప్పటివరకు 26మంది మృతి చెందారు. మృతుల్లో 14మంది జైపుర్‌కు చెందినవారు ఉన్నారు. మొత్తం 97మంది వైరస్‌ను జయించారు.