దేశంలో కరోనా వ్యాప్తి అంతులేకుండా కొనసాగుతోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా రికార్డు స్థాయిలో 37,724 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 648 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 28 వేలు దాటగా... కేసుల సంఖ్య 12 లక్షలకు చేరువైంది.
ఆయా రాష్ట్రాలలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోందిలా...
- మహారాష్ట్రలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,27,031కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 12,276 మంది వైరస్ ధాటికి బలయ్యారు.
- తమిళనాడులో వైరస్ బాధితుల సంఖ్య 1,80,643కి చేరింది. మొత్తంగా 2,626 మంది కొవిడ్ బారినపడి మృతి చెందారు.
- దిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య 1,25,096గా ఉంది. మొత్తంగా 3,690 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
- గుజరాత్లో వైరస్ కేసుల సంఖ్య 50 వేలు దాటగా.. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 2,196 మంది వైరస్ కారణంగా చనిపోయారు.