దేశవ్యాప్తంగా శనివారం కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి రాష్ట్రం కనీసం మూడు ప్రదేశాల్లో డ్రై రన్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కేరళ, మహారాష్ట్ర మినహా.. అన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల రాజధానులు, సమీప ప్రదేశాల్లో డ్రై రన్ నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేరళ, మహారాష్ట్రలోని మూడు ప్రధాన పట్టణాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపింది.
డ్రై రన్ నిర్వహణపై గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శులతో సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, కార్యదర్శి రాజీవ్ భూషణ్. డిసెంబర్ 28, 29 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన డ్రై రన్‌లో వచ్చిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడడంపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం.