తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా - covid latest news

corona
కరోనా పంజా

By

Published : Apr 1, 2020, 8:42 AM IST

Updated : Apr 1, 2020, 11:34 PM IST

23:29 April 01

దేశంలో 1834కు చేరిన కరోనా కేసులు

దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా రికార్డు స్థాయిలో 437 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 1834కు చేరినట్లు పేర్కొంది. 

22:43 April 01

మరో కరోనా మరణం

కరోనా సోకి ముంబయిలోని సియాన్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు.   అతనికి జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు,  మూత్రపిండాల వైఫల్యం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

20:47 April 01

భారత్​కు మా మద్దతు ఉంటుంది: కువైట్​

కరోనాపై పోరులో భాగంగా భారత్​కు అన్నిరకాలుగా తమ మద్దతు ఉంటుందని అన్నారు కువైట్​ ప్రధాని షేక్​ సభా అల్​ ఖలీద్. భారత ప్రధాని మోదీతో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు.

20:35 April 01

మహారాష్ట్రలో మరొకరి మృతి

మహారాష్ట్రలో కరోనాతో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య రాష్ట్రంలో 16కు చేరుకుంది. కేసుల సంఖ్య 336గా ఉంది. 

20:09 April 01

దిల్లీలో 152మందికి కరోనా..

దిల్లీలో కరోనా కేసులు 152కు పెరిగాయి. బాధితుల్లో 53మంది నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారు ఉన్నారు.

20:02 April 01

బంగాల్​లో మరొకరి మృతి..

కరోనా కారణంగా బంగాల్​లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాష్ట్రంలో వైరస్​తో  మృతి చెందినవారి సంఖ్య ఏడుకు చేరింది.

19:54 April 01

పీఎం కేర్స్​కు కిషన్​రెడ్డి కోటి విరాళం..

కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి తన వంతు తోడ్పాటునందించారు. కరోనా నియంత్రణ చర్యల కోసం ఎంపీ ల్యాడ్స్​ నిధుల నుంచి పీఎం కేర్స్​కు రూ.1 కోటి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సహాయ నిధికి రూ.50 లక్షలు, హైదరాబాద్​ కలెక్టర్​ నిధికి రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.

19:47 April 01

పీఎం కేర్స్​కు లోక్​సభ ఉద్యోగుల విరాళం

పీఎం కేర్స్​కు తమ వంతు సాయం అందించేందుకు లోక్​సభ సెక్రటేరియట్​ ఉద్యోగులు ముందుకొచ్చారు. మొత్తం 2,400 మంది కలిసి ఒకరోజు వేతనంగా రూ.45 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

19:41 April 01

దేశంలో కొత్తగా 376 కరోనా కేసులు..

భారత్​లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 376 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 1,637 కేసులు నమోదవగా.. 38 మంది మృతి చెందారు.

19:34 April 01

పీఎం కేర్స్​కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి​ విరాళం...

ప్రధాని మోదీ ప్రారంభించిన పీఎం కేర్స్​కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.ఏ బోబ్డే సహా మొత్తం 33 మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తలో రూ.50వేలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

19:24 April 01

భారత్​ నుంచి అమెరికాకు విమానాలు..

లాక్​డౌన్​ కారణంగా భారత్​లో చిక్కుకుపోయిన అమెరికావాసుల కోసం ప్రత్యేకంగా విమానాలు నడపనుంది అగ్రరాజ్యం.  ఏప్రిల్​ 4న ఈ అవకాశం కల్పించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. న్యూదిల్లీ నుంచి ఈ సదుపాయం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో.. అమెరికాకు చెందిన వారు అందుకు అనుగుణంగా స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించింది.

19:16 April 01

కరోనాకు ఎవరూ అతీతం కాదు!

కరోనా వైరస్‌కు యువకులు అతీతం కాదన్న ఐరాస హెచ్చరికలు నిజమవుతున్నాయి. పలు దేశాల్లో యువకులు మృతిచెందిన ఘటనలు నమోదవుతున్నాయి. తాజాగా బ్రిటన్‌లో 13 ఏళ్ల బాలుడిని కరోనా మహమ్మారి బలిగొంది. అతనికి గతంలో ఎటువంటి అనారోగ్యమూ లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం బెల్జియంలో 12 ఏళ్ల బాలిక మృత్యువాతపడింది. అంతకుముందు ఫ్రాన్స్‌లో 18 ఏళ్ల యువకుడు మృతిచెందాడు. ఈ పరిణామాలతో యువకులనూ ఈ మహమ్మారి ఆస్పత్రి పాల్జేస్తోందని నిరూపితమవుతోంది.

19:10 April 01

మహారాష్ట్రలో కరోనా కేసులు..

మహారాష్ట్రలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. సోమవారం రాత్రి నుంచి ఇప్పటివరకు దాదాపు 33 మందికి కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ఫలితంగా ఈ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 335కి చేరింది.

19:06 April 01

అజయ్​ దేవగణ్​ 51 లక్షల విరాళం...

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ నేపథ్యంలో సినీరంగ కార్మికులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చాడు బాలీవుడ్​ నటుడు అజయ్​ దేవగణ్​. తన వంతు సాయంగా 51 లక్షలు ఫైస్​(ఫెడరేషన్​ ఆఫ్​ వెస్ట్రన్​ ఇండియా సినీ ఎంప్లాయిస్​)కు అందజేశాడు. 

19:01 April 01

యూకేలో భారీగా మృతులు...

బ్రిటన్​లో తొలిసారి 500 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకరోజులో నమోదైన అత్యధిక మృతుల సంఖ్య ఇదే.

18:54 April 01

వలస కూలీల కోసం 21వేలకు పైగా శిబిరాలు..

దేశవ్యాప్తంగా 21,486 సహాయ శిబిరాల ద్వారా 6.75 లక్షల మంది వలస కూలీలకు వసతి కల్పిస్తున్నామని.. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్ వెల్లడించారు. అంతేకాకుండా 25 లక్షల మందికి ఆహారాన్ని అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. రైళ్లలో ఐసోలేషన్‌ పడకల కోసం 5 వేల రైల్వే కోచ్‌లను ఆధునీకరించామని ఆయన చెప్పారు. వీటిలో దాదాపు 3.2 లక్షల ఐసోలేషన్‌ పడకలు సిద్ధం చేస్తున్నట్లు అగర్వాల్​ తెలిపారు.

18:46 April 01

పద్మశ్రీ నిర్మల్​ సింగ్​కు కరోనా...

పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్​ సింగ్​కు కరోనా వైరస్​ సోకింది. 62 ఏళ్ల ఇతడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్​ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇతడు విదేశాల నుంచి ఇటీవలె వచ్చాడని తెలిపారు.

18:38 April 01

మహారాష్ట్రలో మరో 22 కేసులు..

మహారాష్ట్రలో కొత్తగా 22 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఈ వైరస్​ బారిన పడిన వారి సంఖ్య మొత్తం 322కి చేరింది.

18:12 April 01

తమిళనాడులో...

తమిళనాడులో రికార్డ్​ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. నేడు ఒక్కరోజే 110 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 234కు చేరింది. 

18:05 April 01

పరీక్షలు లేకుండానే...

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో పలు పరీక్షలు ఇప్పటికే వాయిదాపడ్డాయి. అయితే 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న సీబీఎస్​ఈ విద్యార్థులను పరీక్షల్లేకుండానే పైతరగతులకు ప్రమోట్​ చేయాలని హెచ్​ఆర్​డీ మంత్రి తెలిపారు.

17:23 April 01

మర్కజ్​ దృశ్యాలు...

2020 మార్చి 26న దిల్లీ నిజాముద్దీన్​లోని మర్కజ్ భవనంలో జరిగిన మతప్రార్థనల​ వీడియోను పోలీసులు విడుదల చేశారు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లఘించి మతప్రార్థనలు నిర్వహించడం వల్ల దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

16:14 April 01

  • రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలతో కేబినెట్ కార్యదర్శి చర్చలు జరిపారు: కేంద్రం
  • కరోనా నివారణకు రాష్ట్రాలన్నీ బాగా సహకరిస్తున్నాయి: కేంద్రం
  • ఎవరూ భయాందోళన చెందవద్దు, పరిస్థితి అదుపులోనే ఉంది: కేంద్రం
  • ప్రభుత్వ సూచనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి: కేంద్రం
  • లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలి.. అప్పుడే కరోనాపై విజయం సాధ్యం: కేంద్రం
  • రైళ్లలో 3.2 లక్షల ఐసొలేషన్ పడకలు సిద్ధం చేస్తున్నాం: కేంద్రం
  • ఇప్పటివరకు 47 వేలమందికి వైద్యపరీక్షలు చేశాం: కేంద్రం హోంశాఖ
  • లాక్‌డౌన్ తర్వాత 6 లక్షలమంది వలసకూలీలకు వసతి కల్పించాం: హోంశాఖ
  • 25 లక్షల మందికి ఆహారం అందిస్తున్నాం: కేంద్ర హోంశాఖ

16:01 April 01

రాజస్థాన్​లో మరో 13 మంది...

రాజస్థాన్​ జైపుర్​లోని రామ్​గంజ్​ ప్రాంతంలో 13 మందికి కరోనా నిర్ధరణయింది. మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 106కు చేరింది.

15:52 April 01

మరో వ్యక్తి మృతి...

కరోనా వైరస్​ ధాటికి ఉత్తర్​ప్రదేశ్​లో ఈరోజు మరో వ్యక్తి మృతి చెందాడు.

15:26 April 01

కరోనా పంజా...

స్పెయిన్​, ఇరాన్​లో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. స్పెయిన్​లో గత 24 గంటల్లో 864 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 9 వేలు దాటింది.

ఇరాన్​లో ఇప్పటివరకు 3 వేల మందికిపైగా మృతి చెందారు. 

14:55 April 01

అన్ని రాష్ట్రాల సీఎంలతో...

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలపై చర్చించనున్నారు.

14:22 April 01

భారీ సాయం...

కరోనాపై యుద్ధానికి తమవంతు సాయాన్ని ప్రకటించాయి అజీం ప్రేమ్​జీ ఫౌండేషన్, విప్రో లిమిటెడ్​. రెండు సంస్థలు సంయుక్తంగా రూ.1125 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపాయి. 

13:01 April 01

ఒక్కసారే పెరిగిన కేసులు...

దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. గత 12 గంటల్లో 240 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1637కు చేరింది. ఇప్పటివరకు 38 మంది మృతి చెందారు.

12:54 April 01

ఐరోపాలో మరణమృదంగం...

ఐరోపాలో కరోనా వైరస్​ మరణమృదంగం కొనసాగుతోంది. మృతుల సంఖ్య 30 వేలను దాటేసింది.

12:46 April 01

సమీక్ష...

  • అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ సమీక్ష.
  • కరోనా ప్రభావంపై అధికారులతో సమీక్షించిన క్యాబినెట్ కార్యదర్శి
  • మర్కజ్‌ వ్యవహారం, వివిధ రాష్ట్రాల్లో ప్రభావంపై కూడా వివరాలు కోరినట్లు సమాచారం.
  • నిత్యావసరాల కొరత లేకుండా చూడాలని, వలస కూలీలకు ఏర్పాట్ల విషయంలో అలసత్వం ఉండకూడదని, లాక్‌డౌన్‌ సమర్ధంగా అమలు జరిగేలా చూడాలని ఆదేశించినట్లు సమాచారం.

12:40 April 01

తగ్గిన ఎల్​పీజీ సిలిండర్ ధర...

ఎల్​పీజీ సిలిండర్​ ధరలు తగ్గాయి. దిల్లీలో సిలిండర్​ ధర రూ.61.50 తగ్గి రూ.744గా ఉంది. ముంబయిలో రూ.62 తగ్గి రూ.714.50గా ఉంది.  

12:36 April 01

మధ్యప్రదేశ్​లో మరో 19...

మధ్యప్రదేశ్​ ఇండోర్​లో మరో 19 మందికి కరోనా నిర్ధరణయింది. వీటితో కలిపి ఇండోర్​లో కేసుల సంఖ్య 63కు చేరింది. మొత్తం 600 మందిని నిర్బంధంలో ఉంచారు.

12:33 April 01

భారీ ట్రాఫిక్​ జాం...

తమిళనాడు చెన్నైలోని పడి వంతెనపై భారీ ట్రాఫిక్​ జాం అయింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలీసులు చెక్​ పాయింట్​ పెట్టడం వల్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

11:55 April 01

మరో ఇద్దరు మృతి...

కరోనా ధాటికి బంగాల్​లో ఈ రోజు ఇద్దరు మృతి చెందారు. మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 

11:18 April 01

దేశంలో కరోనా వైరస్​కు మరో వ్యక్తి బలి

దేశంలో కరోనా ధాటికి మరో వ్యక్తి బలయ్యాడు. మధ్యప్రదేశ్​కు చెందిన ఓ 65 ఏళ్ల వృద్ధుడికి ఇటీవల కరోనా సోకగా నేడు మృతి చెందాడు. 

10:53 April 01

గుజరాత్​లో మరో 8...

గుజరాత్​లో మరో 8 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.

10:47 April 01

జోర్డాన్​లో చిక్కుకున్న మలయాళ సినీ బృందం

కేరళ సినీ పరిశ్రమకు చెందిన 58 మంది కళాకారులు షూటింగ్​ నిమిత్తం జోర్డాన్​కు వెళ్లి కరోనా లాక్​డౌన్​ వల్ల అక్కడే చిక్కుకుపోయారు. వీరిలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్​, డైరక్టర్​ బ్లెస్సీ ఉన్నట్లు కేరళ సినీ ఛాంబర్​ తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి, విదేశాంగ సహాయమంత్రి వీ.మురళీధరన్​ ఆఫీస్​కు వివరాలు వెల్లడించారు.

10:15 April 01

మరో వైద్యుడికి కరోనా

దిల్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది.

10:07 April 01

నిజాముద్దీన్​ వ్యవహారంపై కేంద్రం కీలక ఆదేశాలు

  • తబ్లీగీ జమాత్ కార్యక్రమాలలో హాజరయ్యేందుకు వచ్చిన విదేశీయులు అందరినీ సాధ్యమైనంత త్వరగా స్వస్థలాలకు పంపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నతాధికారులకు కేంద్రం ఆదేశాలు.
  • కరోనా ప్రభావం ఉన్న వారికి అవసరమైన చికిత్స అందించాలని, నిర్బంధ కేంద్రాలకు పంపాలని ఆదేశాలు.
  • కరోనా ప్రభావం లేని వారిని వెంటనే పంపే ఏర్పాటు చేయాలని సూచన. విమానాలు దొరికే పరిస్థితి లేని పక్షంలో నిర్బంధ కేంద్రాల్లో ఉంచాలని ఆదేశాలు.
  • వీరికి అయ్యే ఖర్చును వారిని తీసుకువచ్చిన సంస్థ ద్వారా చేయించాలని హొం శాఖ ఆదేశాలు.

09:56 April 01

అమెరికాలో మరింత తీవ్రం

అగ్రరాజ్యంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. వైరస్​ సోకి మరణించిన వారి సంఖ్య 4,076కు చేరినట్లు జాన్స్​ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయం వెల్లడించింది. గత శనివారం నాటికి అమెరికా కరోనా మరణాలు 2,010 కాగా... కొద్దిరోజుల్లోనే ఆ సంఖ్య రెట్టింపైందని తెలిపింది. 

09:23 April 01

మధ్యప్రదేశ్​లో మరో 20

మధ్యప్రదేశ్​లో మరో 20 మందికి  కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 86కు చేరింది.

08:39 April 01

కరోనా పంజా: మహారాష్ట్రలో మరో 18 కేసులు

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో మరో 18(ముంబయిలో 16, పుణెలో 2) మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 320కి చేరింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 12 మంది కరోనా కారణంగా మృతిచెందారు.

Last Updated : Apr 1, 2020, 11:34 PM IST

ABOUT THE AUTHOR

...view details