తెలంగాణ

telangana

మహారాష్ట్రలో ఒక్కరోజే 81 కేసులు.. తమిళనాడులో 75

By

Published : Apr 2, 2020, 8:19 PM IST

Updated : Apr 2, 2020, 8:27 PM IST

కరోనా వైరస్ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా దిల్లీ నిజాముద్దీన్ ఘటన తరువాత ఈ మహమ్మారి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది.

corona death toll in India
భారత్​లో విజృంభిస్తున్న కరోనా

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్​ చాపకింద నీరుగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళల్లో విపరీతంగా ఈ అంటువ్యాధి ప్రబలుతోంది.

400 దాటిన కేసులు...

మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 416కి చేరుకుంది. తాజా కేసుల్లో ముంబయిలోనే 57 ఉన్నాయి.

ఇప్పటివరకు మహారాష్ట్రలో 19 మంది కరోనాతో మరణించగా, 42 మంది ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది.

కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్​.. రాష్ట్రంలోని 30 ప్రభుత్వ ఆసుపత్రులకు కొవిడ్​-19 ఆసుపత్రులుగా ప్రకటించింది. వీటిలో మొత్తం 2,305 పడకలు అందుబాటులో ఉంచినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

తమిళనాడులో 75..

దేశంలో మహారాష్ట్ర తర్వాత అంతగా కరోనా వ్యాపిస్తున్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. ఇవాళ అక్కడ కొత్తగా 75 మంది బాధితులు చేరారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 309కి చేరింది.

ఇవాళ నమోదైన 75 కరోనా కేసుల్లో 74 మంది.. ఇటీవల దిల్లీ నిజాముద్దీన్​లో జరిగి తబ్లీగీ ప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారేనని ఆరోగ్య కార్యదర్శి బీలా రాజేష్​ తెలిపారు.

దిల్లీ:

నిజాముద్దీన్ తబ్లీగీ తరువాత దేశరాజధాని దిల్లీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పటి వరకు 208 మంది కరోనా బారిన పడగా, వీరిలో 108 మంది మర్కజ్​కు వెళ్లినవారే. ఇక్కడ ఇద్దరు కరోనాతో మరణించగా... ఆరుగురు కోలుకున్నారు.

కేరళలో..

కేరళలో ఇవాళ తాజాగా 21 కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం యాక్టివ్ కేసులు 256కి చేరుకున్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కేరళలో ఇప్పటి వరకు కరోనాతో ఇద్దరు మృతి చెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు.

కర్ణాటక..

కర్ణాటకలో మొత్తం 124 మందికి కరోనా సోకగా... ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది కోలుకున్నారు.

జమ్ము కశ్మీర్​, లద్ధాఖ్​:

జమ్ముకశ్మీర్​లో కరోనా కేసుల సంఖ్య 70కి పెరగగా, ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఇద్దరు కోలుకున్నారు. లద్ధాఖ్​లో కొవిడ్​ కేసుల సంఖ్య 13కి చేరింది.

పంజాబ్​, హరియాణా, చండీగఢ్​

పంజాబ్​తో కరోనా కేసులు 46కి చేరుకున్నాయి. ఐదుగురు వైరస్​ కారణంగా మృతి చెందగా, ఒక్కరు కోలుకున్నారు. పంజాబ్​లో ఇవాళ పద్మ అవార్డు గ్రహీత ఒకరు మరణించారు. హరియాణాలో 29 మందికి కరోనా సోకగా, ఒకరు మృతి చెందారు. చండీగఢ్​లో 16 మందికి కరోనా సోకింది.

అరుణాచల్ ప్రదేశ్​..

అరుణాచల్​ప్రదేశ్​లో తొలి కరోనా కేసు నమోదైంది. ఇది కూడా జమాత్​కు హాజరైన వ్యక్తేనని అధికారులు తెలిపారు.

హిమాచల్​ ప్రదేశ్​లో మరో ముగ్గురికి కరోనా సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య ఆరుకు చేరింది.

పెరుగుతూనే ఉన్నాయ్​..!

రాజస్థాన్​లో 129 కేసులు, ఉత్తర్​ప్రదేశ్​ - 116, బిహార్​ -21, అసోం -16, ఒడిశా - 5, అండమాన్​ నికోబార్​లలో 10 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. గుజరాత్​లో 67 కేసులు నమోదుకాగా... ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. మధ్యప్రదేశ్​లో 100 మంది కరోనా సోకగా ఏడుగురు బలయ్యారు. బంగాల్​లో 37 మందికి కొవిడ్ 19 సోకగా ఏడుగురు మృత్యువాత పడ్డారు. పుదుచ్చేరిలో నలుగురికి కరోనా సోకగా ముగ్గురు నిజాముద్దీన్​ మర్కజ్​కు వెళ్లివచ్చిన వాళ్లేనని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:ప్రజల సహనానికి 'కరోనా హెల్ప్​లైన్​' పరీక్ష

Last Updated : Apr 2, 2020, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details