కరోనా భయాలతో టెక్ దిగ్గజాలు మొదలుకొని చిన్న సంస్థల వరకు ఉద్యోగులకు సెలవులు ఇవ్వడమో.. లేదా ఇంటి నుంచే పనిచేసే 'వర్క్ ఫ్రం హోమ్' సౌలభ్యమో కల్పిస్తున్నాయి. అయితే ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తే ఉత్పాదకత తగ్గుతుందని సంస్థల్లో ఓ వైపు ఆందోళన కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా భయం నుంచి విముక్తి పొంది.. మరింత మెరుగైన పనితీరు కనబరిచే దిశగా నిర్ణయం తీసుకుంది ఓ అంకుర సంస్థ. తమ కార్యరంగాన్ని కాంక్రీట్ జంగల్ నుంచి వ్యవసాయ క్షేత్రానికి మార్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యోగులతో పని చేయిస్తోంది.
స్పామ్ ఈ-మెయిళ్లకు చెక్‌పెట్టి తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా గత నాలుగేళ్లుగా 'ఇన్‌స్టా క్లీన్' అనే అంకుర సంస్థ పనిచేస్తోంది. ఇన్‌స్టా క్లీన్ సీఈఓ అరవింద్ రాజ్ తమిళనాడు తెనీ జిల్లా హనుమంతపట్టి వాసి. అక్కడ వారి కుటుంబానికి ఓ కొబ్బరితోట ఉంది. కరోనా ముప్పు నేపథ్యంలో బెంగళూరులోని సంస్థ కార్యాలయాన్ని తన సొంతూరుకు మార్చారు అరవింద్.
"బెంగళూరుకు కరోనా భయం పట్టుకుంది. పలు సంస్థలు వర్క్ ఫ్రం హోం సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. నేనైతే పనిచేసుకునేందుకు వర్క్ ఫ్రం ఫాం విధానాన్ని అవలంబిస్తున్నాను. బెంగళూరులో పనివేళలు చాలా కచ్చితంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచెయ్యడం వల్ల ఉద్యోగులు వర్క్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు."
-అరవింద్ రాజ్, ఇన్‌స్టా క్లీన్ యాప్ సీఈఓ