భారత్‌లో కరోనా మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 283 మంది కరోనా బారినపడ్డట్లు కేంద్రఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ వైరస్ సోకినవారిలో 39మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపింది. కరోనా కారణంగా ఇప్పటివరకూ నలుగురు చనిపోయారని ప్రకటించారు అధికారులు. 23 మంది పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, యూపీ, బంగాల్, కేరళ, పంజాబ్‌లో నేడు కొత్త కేసులు వెలుగుచూశాయి.
మహారాష్ట్రలో స్టేజ్ 3 దిశగా..
కరోనా కరోనా విజృంభణతో మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమవుతోంది. రాష్ట్రంలో శనివారం 11 కేసులు నమోదుకాగా... మొత్తం కేసుల సంఖ్య 63కు చేరింది. ముంబయిలో పది, పుణెలో ఒక కేసు నూతనంగా వెలుగుచూశాయి. తాజాగా నమోదైన కేసుల్లో ఎనిమిది మంది విదేశీ ప్రయాణం చేయగా.. మిగిలిన వారికి ఇతరుల నుంచి సోకిందని వైద్యులు ప్రకటించారు.
కేరళ, కర్ణాటకల్లో..
కేరళలో శనివారం 12 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 52కు చేరింది. కాసర్‌గఢ్‌లో నూతనంగా 8 కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కాసర్‌గఢ్ జిల్లా లాక్ డౌన్ ప్రకటించారు. కర్ణాటకలో మరో 3 కేసులు వెలుగుచూడగా మొత్తం కేసుల సంఖ్య 18 కి చేరింది. ఈ నేపథ్యంలో కేరళ-కర్ణాటక సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో..
గుజరాత్‌లో మరో 7 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 40కి చేరింది.బంగాల్‌లో ఇప్పటివరకు ముగ్గురికి కరోనా సోకింది. రాజస్థాన్‌లో ఇవాళ మరో 6 కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 23కు పెరిగింది. యూపీలోని నోయిడాలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. పంజాబ్‌లో.... ఇవాళ మరో మూడు కేసులు నమోదుకాగా మొత్తం కేసులసంఖ్య ఆరుకు చేరింది. లద్ధాఖ్‌లో మరో 3 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో లద్ధాఖ్ వ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 13కు చేరింది. తమిళనాడులో మరో ముగ్గురికి వైరస్ సోకగా.... మొత్తంగా ఆ రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 6 కు చేరింది.
బిహార్‌లో మార్చి 31వరకు బస్సులు బంద్
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా బిహార్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ నెల 31 వరకు రాష్ట్రంలో బస్సు సర్వీసులతో పాటు రెస్టారెంట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్‌ను కట్టడిచేసే చర్యల్లో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నట్టు తెలిపింది. బిహార్‌లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
పుదుచ్ఛేరిలో 144 సెక్షన్..
పుదుచ్ఛేరిలో 144 సెక్షన్ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పుదుచ్చేరి సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఈ నెల 31 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రజలు నిత్యావసర సరకులు కొనుక్కొనేందుకు ఉదయం 7 గంటల నుంచి 9గంటల వరకు సమయమిస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి 9గంటల మధ్య బయటకు వచ్చేందుకు అనుమతినిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:కరోనాపై ఐక్యంగా పోరాడదాం.. 'జనతా కర్ఫ్యూ'ను పాటిద్దాం