భారత్లో కొవిడ్ కేసుల పెరుగుదల తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దేశంలోనే అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో... తాజాగా 9,895 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 298 మంది మహమ్మారికి బలైయ్యారు. ఫలితంగా మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 3,47,502కు ఎగబాకింది. ఇప్పటివరకు 12,854మంది మరణించారు. కాగా 1,94,253మంది డిశ్చార్జ్ అయ్యారు.
తమినాట విలవిల
తమిళనాట కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా 6,472 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 1,92,964 కు చేరింది. మహమ్మారి బారినపడి మరో 88 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 3,232కు పెరిగింది. కాగా ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,36,793 మందికి వైరస్ నయమైంది. మరో 52,939 మంది చికిత్స పొందుతున్నారు.
బెంగళూరు 2200పైగా..
కర్ణాటకలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజే 5,030 మందికి వైరస్ సోకింది. మరో 97 మంది మృతి చెందారు. కాగా కేవలం బెంగళూరులోనే 2,207 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 80,863కు చేరింది. మరణాల సంఖ్య 1,616కు పెరిగింది.
రికార్డు స్థాయిలో..
ఉత్తర్ప్రదేశ్లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 2,529 మందికి కరోనా పాజిటివ్ తేలింది. మరో 35 మంది చనిపోయారు. ఫలితంగా ఇప్పటివరకు 58,104 మంది వైరస్ బారిన పడగా... మరణాల సంఖ్య 1,298కు చేరుకుంది.