కరోనా మహమ్మారి దేశాన్ని కమ్మేస్తోంది. నానాటికీ మరింతగా కోరలు చాస్తోంది. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాలకంటే భారత్‌లోనే రోజువారీ వృద్ధిరేటు ఎక్కువగా ఉంది. గత వారం రోజుల్లో అమెరికాలో రోజుకు సగటున 1.8% మేర కేసులు వృద్ధి చెందగా, బ్రెజిల్‌లో 2.7%, రష్యాలో 1%, పెరూలో 1.2% మేర పెరిగాయి. భారత్‌లో మాత్రం గతవారం రోజుకు సగటున 3.5% మేర వృద్ధి నమోదైంది. ప్రస్తుతం దేశంలో ఒక్కో వ్యక్తి ద్వారా సగటున 1.14 మందికి వైరస్ సోకుతోంది. నాలుగు వారాల క్రితం ఇది 1.21గా ఉంటూ రెండువారాల క్రితం 1.12కి తగ్గి, మళ్లీ పెరిగింది.
మరోవైపు, దేశంలో గత 24 గంటల్లో 22,752 కొత్త కేసులొచ్చాయి. 16,883 మంది కోలుకున్నారు. 482 మంది మరణించారు. క్రియాశీల కేసులు 5,387 పెరిగాయి. మహారాష్ట్ర, తమిళనాడుల్లో కేసుల సంఖ్య కొంత తగ్గి, దిల్లీలో పెరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో గరిష్ఠ స్థాయిలో 1,332 కేసులొచ్చాయి. 24 గంటల్లో వెయ్యికి పైగా కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య 7కి చేరింది. రెండంకెల్లో మరణాలు సంభవించిన రాష్ట్రాల సంఖ్య 8కి పెరిగింది. కేరళలో ఎన్నడూ లేనంతగా 272 కేసులొచ్చాయి. రోజుకు 250 దాకా కేసులు నమోదయ్యే రాజస్థాన్‌లో ఒకేరోజు 716 వచ్చాయి. గుజరాత్‌లో మంత్రి ఒకరు కరోనా బారిన పడ్డారు.