దాదాపు ఆరు అడుగుల పొడవుగల కొత్తిమీరను పండించి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన గోపాల్ ఉప్రేతీ.. ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ తన పేరును లిఖించాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చని నిరూపించాడు.
ఎలా సాధించాడు?
ఉత్తరాఖండ్ అల్మోడాలోని విల్లేఖ్ నివాసి గోపాల్ ఉప్రేతీ.. దిల్లీలో వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. లాక్డౌన్ కారణంగా స్వగ్రామానికి వెళ్లిపోయాడు. తన యాపిల్తోటలో ఖాళీ స్థలాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. కొత్తిమీర, వెల్లుల్లి, పాలకూర పంటలు వేశాడు.
సాధారణంగా కొత్తిమీర మొక్క ఒకటి, రెండు అడుగుల పొడవు ఉంటుంది. కానీ, ఉప్రేతీ వేసిన కొత్తిమీర పంట ఏకంగా ఆరు అడుగుల వరకు పెరిగింది. దీంతో ఈ అద్భుతాన్ని ప్రపంచానికి తెలిసేలా.. ప్రపంచ రికార్డులకు దరఖాస్తు చేద్దామని ఉప్రేతీ భార్య సలహా ఇచ్చింది. ఫలితంగా మే 7వ తేదీన లిమ్కా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, జూన్ 4వ తేదీన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును కైవసం చేసుకున్నాడు ఉప్రేతీ.
ఇదీ చదవండి:కాపురాలపై కరోనా దెబ్బ.. రెండేళ్ల వరకు పిల్లల్ని కనొద్దట!