కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పౌరసత్వంపై వివాదం చెలరేగింది. రాహుల్ బ్రిటన్ పౌరుడిగా అక్కడ ఓ కంపెనీ రిజిస్ట్రేషన్ సమయంలో పేర్కొన్నారని అమేఠీ బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి ధ్రువ్‌లాల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనితో రాహుల్ నామపత్రాల పరిశీలనను ఏప్రిల్ 22కు వాయిదా వేశారు ఆ అధికారి.
"ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత పౌరులు కానివారు ఎన్నికల్లో పోటీ చేయటానికి లేదు. రాహుల్‌గాంధీ బ్రిటన్ పౌరసత్వాన్ని ఎలా పొందారు? తిరిగి భారత పౌరసత్వం ఎలా వచ్చింది? దీనిపై స్పష్టత లేనంత వరకు రాహుల్ నామినేషన్‌ను అంగీకరించకూడదని రిటర్నింగ్ అధికారిని కోరాం" అని అభ్యర్థి తరపు న్యాయవాది ప్రకాశ్ తెలిపారు.
బ్రిటన్ కంపెనీకి సంబంధించిన ఆస్తుల వివరాలు అఫిడవిట్లో సమర్పించలేదని ఆరోపించారు ప్రకాశ్.
విద్యార్హతలు కూడా....
నామపత్రాల్లో సమర్పించిన విద్యార్హతలు కూడా సరిగా లేవని న్యాయవాది అన్నారు. కాలేజీలో ఉన్నప్పుడు 'రౌల్ విన్సీ' అనే పేరు ఉపయోగించారని, రాహుల్‌గాంధీ పేరు మీద ఎలాంటి ధ్రువపత్రాలు లేవని తెలిపారు.
వెంటనే సమాధానం చెప్పాలి : భాజపా
రాహుల్‌గాంధీపై వచ్చిన అభ్యంతరాలు చాలా తీవ్రమైనవని, వీటికి రాహుల్ న్యాయవాది వద్ద సమాధానాలు లేకపోవటం ఆశ్చర్యానికి గురిచేసిందని భాజపా వ్యాఖ్యానించింది. ఈ వివాదంపై రాహుల్ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
రాహుల్ పౌరసత్వంపై మాట్లాడుతున్న భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ''మీరు పెట్టుబడులు పెట్టిన కంపెనీని 2004 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ కంపెనీ పేరు బ్యాకాప్స్ లిమిటెడ్. ఇది లండన్‌లో నమోదైంది. ఇందులో మీరు(రాహుల్‌గాంధీ) డైరెక్టర్‌గా పనిచేశారు. బ్రిటన్ ప్రభుత్వానికి మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ రూపంలో బ్యాకాప్స్ లిమిటెడ్ సమర్పించిన అధికారిక పత్రాలు, 21-08-2005తో ముగిసిన కాలానికి సమర్పించిన వార్షిక రిటర్నులను సమర్పించారు. 2005లో మీరు సమర్పించిన పత్రాలు... బ్రిటన్ పౌరులని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆ కాలంలో మీరు బ్రిటన్ పౌరుడయినట్లయితే భారత పౌరసత్వం కోల్పోయి ఉండేవారు.''
- జీవీఎల్ నరసింహారావు, భాజపా అధికార ప్రతినిధి.