దేశంలో కొవిడ్-19 వ్యాప్తి.. 2009లో తలెత్తిన హెచ్1ఎన్1 వైరస్ తరహాలోనే ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. నాటి మహమ్మారిలానే ప్రస్తుత కరోనా వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా ఒకేలా ఉండకపోవచ్చని పేర్కొంది. అందువల్ల ప్రాంతాలవారీగా నియంత్రణ విధానాన్ని అనుసరించాలని తెలిపింది. వైరస్ విజృంభణ ఎక్కువగా ఉన్న హాట్ స్పాట్‌లలో కఠిన నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. కొవిడ్-19 నియంత్రణకు సంబంధించి శుక్రవారం విడుదల చేసిన సవరించిన మార్గదర్శకాల్లో ఈ మేరకు అభిప్రాయపడింది. దీని ప్రకారం..
* భారత్‌లో కంటెయిన్‌మెంట్ చర్యలు చేపట్టే సమయంలో విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 1.క్లస్టర్లు ఎన్ని ఉన్నాయి, వాటి పరిమాణం ఎంత? 2. భౌగోళిక నిర్బంధాన్ని ఎంత సమర్థంగా అమలు చేస్తున్నారు? 3. భారతీయుల్లో ఈ వైరస్ ఎలా వ్యాపిస్తోంది? అందుకు ఉష్ణోగ్రత, తేమ లాంటి వాతావరణ పరిస్థితులు ఎంత మేర దోహదపడుతున్నాయి? 4. క్రియాశీల కేసుల గుర్తింపు, పెద్ద సంఖ్యలో పరీక్షలు చేపట్టడం, అనుమానితులను తక్షణం గుర్తించి, ఏకాంతంలో ఉంచడం, వారితో సంబంధం ఉన్నవారిని నిర్బంధంలో పెట్టడం వంటి చర్యల్లో ప్రజారోగ్యశాఖ స్పందన ఎలా ఉందన్నది చూడాలి.
* 2009లో హెచ్1ఎన్1 ఫ్లూ మహమ్మారి పెద్దనగరాల్లో విస్తృతంగా పాకింది. జనాభా కదలికలు భారీగా ఉండే చోట ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జనసాంద్రత తక్కువగా ఉండే గ్రామాలు, చిన్న పట్టణాలు; రహదారి, రైలు, విమాన సౌకర్యాలు సరిగా లేని ప్రాంతాల్లో చాలా తక్కువ కేసులు కనిపించాయి. ప్రస్తుత కొవిడ్-19 వ్యాప్తి తీరు తెన్నులు కూడా ఇదే రీతిలో ఉన్నాయి. కొవిడ్-19 ఎక్కువ మందికి సోకి ఉండొచ్చు. కానీ దాని ప్రభావం దేశవ్యాప్తంగా ఒకేలా ఉండదు. అందువల్ల నియంత్రణ చర్యలు ప్రాంతానికో రకంగా చేపట్టాలి.