అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. సోమవారం భూమి పూజ నిర్వహించి తొలి విడత ఆలయ నిర్మాణ పనులను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఉన్న విగ్రహాలను తాత్కాలికంగా నిర్మించిన ఆలయానికి మార్చేందుకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు బిమ్లేంద్ర మిశ్రా, అనిల్ మిశ్రా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
రామ మందిరం పూర్తయ్యే వరకు విగ్రహాలను తాత్కాలిక నిర్మాణంలో ఉంచనున్నారు. అయోధ్యలో కరోనా విస్తరణను నియంత్రించడానికి ఆంక్షలు విధించినప్పటికీ ఆలయ పనులు ప్రారంభించడం గమనార్హం. వైరస్ వ్యాప్తి కారణంగానే అయోధ్యలోని పండితులను భూమి పూజకు ఆహ్వానించలేదని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మందిర నిర్మాణ స్థలాన్ని సందర్శించే అంశంపై సమాచారం లేదన్నారు.
"మార్చి 24 వరకు పరిస్థితులను సమీక్షిస్తాం. అనంతరం భవిష్యత్ ప్రణాళికపై నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి లక్ష్యం."