గణతంత్ర భారతావని ఇప్పుడు చరిత్రాత్మక దశలో ప్రస్థానిస్తోంది. మరో మూడు రోజుల్లో గణతంత్ర దేశంగా భారత్ ఏడు దశాబ్దాల మైలురాయిని చేరుకోనుంది. ఈ సందర్భంగానే దేశవ్యాప్తంగా రాజ్యాంగ స్ఫూర్తి, నిబంధనలపై విస్తృత చర్చ జరుగుతుండటం విశేషం. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్)లను వ్యతిరేకిస్తూ దేశం నలుచెరగులా ఆందోళనలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ చట్టాలను నిరసిస్తూ రోడ్డెక్కుతున్న నిరసనకారులు పదేపదే రాజ్యాంగ ఆదర్శాలను ఉటంకిస్తుండటం గమనించాల్సిన విషయం. స్వాతంత్య్రానంతర భారతంలో రాజ్యాంగ సూత్రాలు, ఆదర్శాలు ఈ స్థాయిలో చర్చకు రావడం ఇదే తొలిసారి. రాజ్యాంగ సారమే కీలక ధాతువుగా దేశంలో ఏకంగా ఒక ప్రజా ఉద్యమమే రాజుకొంది. గడచిన రెండు నెలలుగా రాజ్యాంగ పీఠికను ఉటంకిస్తూ, అందులోని వివిధ నిబంధనలను ప్రస్తావిస్తూ నిరసనకారులు సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని ఉద్ధృతంగా సాగిస్తున్నారు. గతంలో రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వివిధ ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, విద్యా సంస్థలు ఎంతో కృషి చేశాయి. ఆ కృషివల్ల ప్రజాబాహుళ్యంలో ఎంతమేరకు అవగాహన పెరిగిందో చెప్పలేంగానీ- సీఏఏ వ్యతిరేక ఉద్యమాలు మాత్రం జనంలో కచ్చితంగా రాజ్యాంగపరమైన చైతన్యం తీసుకొచ్చాయి!
రాజ్యాంగం అస్త్రంగా
నిరసనకారులు పదేపదే రాజ్యాంగాన్ని ప్రస్తావించడంలోని ఆంతర్యమేమిటన్న ప్రశ్న సైతం ఈ సందర్భంలోనే తలెత్తుతోంది. చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని నిరసనల్లో పాల్గొంటే తమ వాదనకు మరింత బలం చేకూరుతుందన్న ఉద్దేశంతో వారు ఈ పని చేస్తున్నారా లేక దేశంలో విస్తరిస్తున్న మతపరమైన దుర్విచక్షణకు నిరసనగా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదిస్తున్న రాజ్యాంగ విలువల ఔన్నత్యాన్ని చాటిచెప్పాలన్నది వారి ఆలోచనా? సీఏఏని వ్యతిరేకిస్తున్నవారు జమా మసీదు మెట్ల పొడవునా స్వాతంత్య్ర సమర యోధుడైన చంద్రశేఖర్ ఆజాద్, అంబేడ్కర్ చిత్రాలను ఎందుకు ఏర్పాటు చేశారు? రాజ్యాంగ పీఠిక నకళ్లను ప్లకార్డులుగా ఎందుకు ప్రదర్శించారు? ఏదో నామమాత్రంగా రాజ్యాంగంపట్ల, అంబేడ్కర్‌పట్ల వీరంతా గౌరవ ప్రపత్తులు కనబరుస్తున్నారా అంటే చాలావరకు అది నిజం కాదనే చెప్పాలి. ఏదో ఒకట్రెండు ప్రదర్శనల్లో నిరసనకారులు ఈ పద్ధతిలో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండవచ్చు.
చాలావరకు పౌరసత్వ సవరణ చట్టాన్ని తూర్పారపడుతూ జరుగుతున్న నిరసన ప్రదర్శనలన్నీ దాదాపుగా రాజ్యాంగ విలువలను పరిరక్షించాలన్న మౌలిక నినాదం చుట్టూనే తిరుగుతున్నాయన్నది అంగీకరించక తప్పని వాస్తవం. జాతికి నడతను, నడవడిని నిర్దేశించిన రాజ్యాంగ విలువలు క్రమంగా గౌరవం కోల్పోతున్నాయన్నది అంగీకరించక తప్పని చేదు వాస్తవం. శాసనాలు, కార్యనిర్వాహక చర్యల రూపంలో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో సంవిధాన పత్రానికి సమున్నత గౌరవాన్ని, విలువను కల్పించే విధంగా అంతటా ప్రదర్శనలు చోటుచేసుకుంటుండటం ఆహ్వానించదగిన పరిణామం. గడచిన మూడున్నర దశాబ్దాల్లో ఎవరికీ సాధ్యంకాని స్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే- కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు పెల్లుబుకడం గమనార్హం. దేశ పాలనకు నైతిక, చట్టబద్ధ నడవడిని నిర్దేశిస్తున్న రాజ్యాంగ విలువల గొప్పతనాన్ని పునశ్చరణ చేసుకోవాల్సిన సందర్భమిది.
రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి