తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2019, 7:39 AM IST

ETV Bharat / bharat

రాజ్యాంగ స్ఫూర్తే చుక్కానిగా..

పౌరసత్వ (సవరణ) చట్టం ద్వారా పాక్‌, బంగ్లాదేశ్‌, అఫ్గాన్‌లనుంచి మతపర విచక్షణకు గురై వలస వచ్చినవారిలో ముస్లింలకు తప్ప తక్కిన వారికి పౌరసత్వం కల్పిస్తామనడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలతో పాటు పౌర, సామాజిక వర్గాలు భావిస్తున్నాయి. పదేళ్లకోమారు విధిగా చేపట్టే జనగణన, దాని వెన్నంటి జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) మార్పుచేర్పుల మహాయజ్ఞం వచ్చే ఏప్రిల్‌ నుంచి పట్టాలకు ఎక్కనుంది. జనాభా పట్టిక వెన్నంటే జాతీయ పౌర పట్టిక రూపకల్పనా సాగుతుందన్న అంచనాల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి

Constitutional rudder in india caa, nrc, npr
రాజ్యాంగ స్ఫూర్తే చుక్కానిగా..

వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టానికి చాపచుట్టేయాల్సిందేనంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ముమ్మరిస్తున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు పౌరసత్వ (సవరణ) బిల్లు రాజ్యసభామోదం పొంది చట్టరూపం దాల్చితే తమ గతేమిటన్న భయసందేహాలతో ఈశాన్య భారతం అట్టుడికింది. పదహారో లోక్‌సభ కాలగర్భంలో కలసిపోవడంతో బిల్లు మురిగిపోయిందని సంతసించే లోగానే అది కాస్తా పదిహేడో పార్లమెంటు ఉభయ సభల్లో భారీ మెజారిటీతో నెగ్గి చట్ట రూపం దాల్చేయడంతో- రాగల సంక్షోభాన్ని రెండు కోణాల్లో వీక్షిస్తూ అటు ఈశాన్యం, ఇటు తక్కిన దేశం తీవ్రాందోళన చెందుతున్నాయి. అక్రమ వలసదారుల ఏరివేత లక్ష్యంగా అసోమ్‌లో చేపట్టిన జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) కసరత్తు ఫలితాల్ని పౌరసత్వ (సవరణ) చట్టం కొరగాకుండా చేసి కొత్త వలసలకూ అది లాకులెత్తే ప్రమాదం ఉందని ఈశాన్యం భీతిల్లుతోంది. లోగడ కశ్మీర్‌ తరహాలో భూ క్రయ విక్రయాలు ‘భూమి పుత్రుల’ మధ్యే జరిగేలా అసోమ్‌ కొత్త చట్టాల్ని రూపొందిస్తుండటానికి కారణం అది.

పౌరసత్వ (సవరణ) చట్టం ద్వారా పాక్‌, బంగ్లాదేశ్‌, అఫ్గాన్‌లనుంచి మతపర విచక్షణకు గురై వలస వచ్చినవారిలో ముస్లిములకు తప్ప తక్కిన వారికి పౌరసత్వం కల్పిస్తామనడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి గండికొట్టే చర్యగా విపక్ష శిబిరంతోపాటు భిన్న పౌర, సామాజిక వర్గాలు భావిస్తున్నాయి. అసోమ్‌లో జరిగిన పౌర పట్టిక క్రతువును రద్దు చేసి దాన్ని జాతీయ స్థాయిలో అమలు చేస్తామనడంతో- పౌరసత్వ (సవరణ) చట్టంలోని విచక్షణాపూరిత ధోరణే అందులోనూ ప్రతిఫలించి, భారతీయులుగా తమ అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుందన్న భయాందోళనలు క్రమేణా విస్తరిస్తున్నాయి. పదేళ్లకోమారు విధిగా చేపట్టే జనగణన, దాని వెన్నంటి జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) మార్పుచేర్పుల మహాయజ్ఞం వచ్చే ఏప్రిల్‌ నుంచి పట్టాలకు ఎక్కనుంది. అందుకోసం కేంద్రమంత్రి వర్గం తాజాగా దాదాపు రూ.12,700కోట్లు కేటాయించింది. జనాభా పట్టికను వెన్నంటే జాతీయ పౌర పట్టిక రూపకల్పనా సాగుతుందన్న అంచనాల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తమవుతున్న జనాందోళనను ఉపశమింపజేసేందుకు కేంద్రం సత్వర చర్యలు తీసుకోవాలి!

ఆరు నిర్బంధ కేంద్రాలు !

పార్లమెంటు ఉభయ సభల్లో జరిగిన సుదీర్ఘ చర్చ సందర్భంగా- పౌరసత్వ (సవరణ) బిల్లు రాజ్యాంగ విరుద్ధమేమీ కాదన్న కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలకు, విపక్షాల అభ్యంతరాలకు లంగరందలేదు. ఈ రాజ్యాంగ మీమాంస సుప్రీంకోర్టు సముఖానికి చేరినా, తుది నిర్ణయం వెలువడేలోగా- ప్రజానీకంలో పెల్లుబుకుతున్న ఆందోళన సమసిపోయేలా లేదు. ఎన్‌డీఏ సర్కారు తొలిసారి అధికారం చేపట్టినప్పటినుంచి ఎన్నడూ దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీపై చర్చ జరపలేదని, అసోమ్‌లో కూడా ‘సుప్రీం’ ఉత్తర్వుల కారణంగానే దీన్ని అమలు చేయాల్సి వచ్చిందని మూన్నాళ్ల క్రితం ప్రధాని మోదీ బహిరంగ సభాముఖంగా ప్రకటించారు. అసత్యాలతో ప్రజలను రెచ్చగొట్టి విపక్షాలు విభజించి పాలించే రాజకీయం చేస్తున్నాయనీ విమర్శించారు.

వాస్తవానికి, పౌరసత్వ బిల్లుపై చర్చ సందర్భంగా దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీ రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్యసభాముఖంగా ప్రకటించారు. 2021నాటి జనగణనతోపాటే సాగే జాతీయ జనాభా పట్టిక కూర్పు తరవాత భారత పౌరుల జాతీయ పట్టిక రూపకల్పన సాగనుందని అధికార శ్రేణులు స్పష్టీకరించాయి. ముస్లిములెవరినీ నిర్బంధ కేంద్రాలకు పంపించలేదని, దేశంలో అలాంటి కేంద్రాలే లేవని ప్రధాని స్పష్టీకరించారు. నిజానికి అసోమ్‌లో అలాంటి నిర్బంధ కేంద్రాలు ఆరు ఉన్నాయని నిర్ధారిస్తున్నాయి వార్తా కథనాలు! అసోమ్‌లో తప్పులతడకగా జరిగిన ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ లక్షల కుటుంబాల అస్తిత్వ మూలాల్నే ప్రశ్నార్థకం చేసి పెను సామాజిక సంక్షోభం సృష్టించింది. ఆ సంకటాన్ని అధిగమించి- ఇస్లామిక్‌ దేశాల నుంచి వచ్చే అక్కడి మైనారిటీల పట్ల మానవీయ దృక్పథం చూపాలంటూ తెచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టం, మున్ముందు తప్పదంటున్న ఎన్‌ఆర్‌సీ కొత్త సంక్షోభానికి అంటుకట్టడం, కొండనాలుక్కి మందేస్తే... సామెతను స్ఫురణకు తెస్తోంది!

మతపరదుర్విచక్షణ కూడదు..

‘భాజపా అధికారంలోకి వస్తే ఇండియా మత రాజ్యంగా మారిపోతుందనడం సరికాదు... ఈ సువిశాల దేశాన్ని మెజారిటీ, మైనారిటీ లెక్కల ఆధారంగా పరిపాలించకూడదు’- కమలం పార్టీకి పురుడు పోసినవారిలో ప్రథములు, భారత రత్న వాజ్‌పేయీ వ్యాఖ్య అది. ఆ స్ఫూర్తే, భాజపాకు చుక్కాని కావాలి! రాజ్యాంగ నిర్ణయ సభ చిట్టచివరిగా ‘పీఠిక’ అంశాన్ని చర్చిస్తున్న సమయంలో ‘భారత ప్రజలమైన మేము’ (వియ్‌ ది పీపుల్‌ ఆఫ్‌ ఇండియా) అన్న పదాలకు ముందు ‘దేవుని పేరిట’ అన్న పదాలు చేర్చాలన్నదానిపై సుదీర్ఘ చర్చ జరిగి, అంతిమంగా ఓటింగులో ఆ ప్రతిపాదన వీగిపోయింది.

రాజ్యాంగ లౌకికవాద స్ఫూర్తి ఏ విధంగానూ చెదిరిపోరాదన్న నాటి దార్శనికుల మహాసంకల్పం జేగీయమానమై కొనసాగేలా పౌరసత్వ (సవరణ) చట్టంలో కొద్దిపాటి మార్పులకు సమకడితే వచ్చే నష్టం ఏముంది? పొరుగున ఇస్లామిక్‌ దేశాల్లో షియాలు, అహమ్మదీయులపై సాగుతున్న మతపరమైన అణచివేత, మియన్మార్‌నుంచి రోహింగ్యాల అమానుష గెంటివేత హృదయవిదారకంగా ఉన్నమాట నిజం. ఎవరిపట్లా మతపర దుర్విచక్షణ కూడదంటున్న రాజ్యాంగం మేరకు చేసిన చట్టం- ఈ తరహా మినహాయింపుల్ని సమర్థిస్తుందా అన్నది న్యాయపాలిక తేల్చాల్సిన అంశం! ఈ లోగా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకొనే వెసులుబాటును అందరికీ కల్పించడంలోనే మానవీయత ఉంది. అదే సమయంలో అసోమ్‌ ఎన్‌ఆర్‌సీ ఎంత‘లక్షణం’గా సాగిందో తెలిసినవారెవరైనా- ఆ తరహా సంక్షోభం దేశవ్యాప్తం కారాదని కోరుకోవడంలో తప్పేముంది? రాజకీయ పంతాలతో కాదు, రాజనీతిజ్ఞతతోనే ఈ వివాదానికి కేంద్ర సర్కారు తెరదించాలి!

ABOUT THE AUTHOR

...view details