ఉత్తరప్రదేశ్‌లోని బదాయూకు చెందిన అవిభక్త కవలలను దిల్లీ ఎయిమ్స్ వైద్యులు.. క్లిష్టమైన శస్త్రచికిత్సతో వేరుచేయగలిగారు. తుంటి నుంచి శరీరం కింది భాగం వరకు కలిసిపోయి పుట్టిన ఆడబిడ్డలను విడదీయడానికి.. 24గంటల సమయం పట్టింది.
చాలా క్లిష్టంగా...
అవిభక్త కవలలకు పొత్తికడుపు, వెన్నెముక, పేగులు కలిసిపోయి ఉండేవి. వీటితో పాటు వారికి గుండె, ప్రధాన రక్త నాళాల్లో సమస్యలు ఉండేవి.
శుక్రవారం ఉందయం 8:30 గంటలకు మొదలైన శస్త్రచికిత్స.. శనివారం ఉదయం 9గంటల వరకు జరిగింది. సర్జన్లు, అనస్థటిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు సహా మొత్తం 64 మంది సభ్యుల బృందం ఈ సర్జరీలో పాల్గొంది.
"ఇద్దరు చిన్నారుల హృదయాల్లో రంధ్రాలు ఉన్నాయి. దీనితో సర్జరీ మరింత క్లిష్టంగా మారింది. వారికి మత్తుమందు ఇవ్వడం ఎంతో కీలకం. మత్తుమందు ఇచ్చినప్పుడు కూడా గుండె ఎంత వీలైతే.. అంత సాధారణంగా పనిచేయాలి. ఇదే అతిపెద్ద సవాలు."
-సీనియర్ వైద్యులు.
శస్త్రచికిత్సలో భాగంగా.. వెన్నెముకను విడదీశారు. వెన్నెముక, పురీషనాళం, తొడలోని రక్తనాళాలను పునర్మించారు వైద్యులు.
దేశం కరోనా సంక్షోభంలో ఉన్నప్పటికీ.. శస్త్రచికిత్స ఆవశ్యకతను గుర్తించిన ఎయిమ్స్ డైరక్టెర్ రణ్‌దీప్ గులేరియా.. వెంటనే ఆపరేషన్‌కు అంగీకరించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి చెందిన డా. మీను బాజ్‌పాయ్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స జరిగింది.