వచ్చే ఏడాది బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. పార్టీ సన్నద్ధతపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. వర్చువల్గా జరిగే ఈ భేటీలో బంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి, బంగాల్ ఇన్ఛార్జ్ జితిన్ ప్రసాద, సీఎల్పీ నేత అబ్దుల్ మన్నన్ పాల్గొననున్నారు.
కాంగ్రెస్ వ్యూహమేంటి?
294 సభ్యుల బంగాల్ శాసనసభకు వచ్చే ఏడాది పోలింగ్ జరగనుంది. రాష్ట్రంపై భాజపా పట్టు పెరుగుతున్న తరుణంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం తృణమూల్ కాంగ్రెస్కు సవాలుగా మారింది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో రాణించేందుకు కాంగ్రెస్ ఎలాంటి చర్యలు చేపడుతుందనేది కీలకంగా మారింది.
2016 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి బరిలో దిగిన కాంగ్రెస్.. 44 స్థానాలు దక్కించుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఆ తర్వాత సగం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.