'మహా' పదవుల పంపకాలపై కాంగ్రెస్‌లో అసంతృప్తి! మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ వచ్చే వారం జరగనున్న నేపథ్యంలో పదవుల పంపకాలపై పార్టీల మధ్య అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమకు కేటాయించే శాఖలపై కాంగ్రెస్ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజలతో నేరుగా సంబంధాలు లేని శాఖలు ఇచ్చే అవకాశం ఉందని.. ఈ సమస్యపై కాంగ్రెస్ హైకమాండ్‌కు రాష్ట్ర నాయకులు తమ ఆందోళనలు వివరించినట్లు తెలిపాయి.
డిసెంబర్ 30 విస్తరణ!
అనూహ్య పరిణామాల మధ్య అధికారం చేపట్టిన కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన పార్టీలు.. కేబినెట్ విస్తరణపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈనెల 30న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరు మంత్రిత్వ శాఖలను ఒక్కోపార్టీకి రెండు చొప్పున కేటాయించారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. అందులో కాంగ్రెస్‌కు రెవెన్యూ, పీడబ్ల్యూడీ శాఖలు ఉన్నాయి.
ప్రస్తుతం కాంగ్రెస్‌కు మరో రెండు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. అందులో పశు సంవర్ధక, జౌళి శాఖలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ శాఖలపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో నేరుగా సంబంధాలు లేని వాటిని కేటాయించటం వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
" రానున్న మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్‌కు కేటాయించే శాఖలు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నవి కాదు. కాంగ్రెస్‌కు ఇచ్చిన పశుసంవర్ధక శాఖ, జౌళి శాఖలను వ్యవసాయ, పరిశ్రమల శాఖల్లో విలీనం చేయాలి. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవమైన డిసెంబర్ 28న ముంబయికి రానున్న పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ ఖర్గేతో ఈ విషయంపై చర్చిస్తాం. సరైన ఒప్పందం కుదరకపోతే మాహారాష్ట్రలో కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ.. వ్యవసాయం, సహకార శాఖ, పరిశ్రమలు, గృహ నిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖల కోసం చూస్తోంది. కనీసం అందులో రెండింటినైనా కేటాయించాలని కోరుకుంటోంది."
- కాంగ్రెస్ నేత.
హోంశాఖ, ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖల సహాయ మంత్రులను మూడు పార్టీలు సమానంగా పొందేందుకు సిద్ధంగా ఉండాలన్నారు కాంగ్రెస్ నేత. అలా జరిగినప్పుడే అధికార సమతుల్యత సాధించినట్లు అవుతుందని తెలిపారు.
ఇదీ చూడండి: రావత్ 'నాయకత్వ' వ్యాఖ్యలపై రాజకీయ దుమారం