ఆర్థిక మందగమనం, నిరుద్యోగం వంటి సమస్యలను ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది. పార్లమెంటు సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న వారికి మద్దతుగా నేడు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఉదయం 10:30 గంటలకు ఆ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టనున్నారు.
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగానికి ముందే కాంగ్రెస్ పార్లమెంటు ఆవరణలో నిరసన తెలపనుంది.
పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల పార్టీ బాధ్యులు, ఎంపీలతో ఫిబ్రవరి 4న కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ తీసుకువచ్చిన ఎన్పీఆర్ (జాతీయ జనాభా పట్టిక)పై పార్టీ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పాలని ఈ భేటీలో పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేయనున్నారు.
కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో సహా ఇతర రాష్ట్రాల్లోనూ సీఏఏ, ఎన్పీఆర్లపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వీటిని తమ రాష్ట్రాల్లో అమలు చేయనివ్వబోమని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి:వాళ్లు నాకు హామీ ఇచ్చారు: ఓం బిర్లా