తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కర్​నాటకం'లో కాంగ్రెస్​ ఆఖరి ప్రయత్నాలు - Congress

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్​ చివరి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసంతృప్తితో రాజీనామా చేసిన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గేను రంగంలోకి దింపింది.

'కర్​నాటకం'లో కాంగ్రెస్​ ఆఖరి ప్రయత్నాలు

By

Published : Jul 7, 2019, 12:43 PM IST

కన్నడనాట రాజకీయ సంక్షోభం నెలకొంది. కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామాతో కుమారస్వామి ప్రభుత్వం అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది. ఈ తరుణంలో అధికారం కాపాడుకునేందుకు చివరి ప్రయత్నాలు సాగిస్తోంది కాంగ్రెస్​. అసంతృప్త నేతలతో చర్చలు జరిపేందుకు సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గేను రంగంలోకి దింపింది.
మాజీ మంత్రి రామలింగారెడ్డి నేతృత్వంలోని 11 మంది కాంగ్రెస్​ శాసనసభ్యులతో సంప్రదింపులు జరపనున్నారు ఖర్గే.

మల్లికార్జున ఖర్గే

" కాంగ్రెస్​ - జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వం సజావుగా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. మా మధ్య విభేదాలు సృష్టించేందుకే కొందరు తప్పుడు సమాచారాన్ని పత్రికలకు అందిస్తున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి సమస్యలు ఏమిటో తెలుసుకుని వాటిని మేము పరిష్కరించగలమో లేదో చూస్తాం. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాను."
- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్​ నేత

సిద్ధరామయ్య స్పందన

"ఐదు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలతో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. పార్టీ సభ్యులు నాకు విధేయులుగా ఉంటారా? లేదా? అన్నది ప్రశ్న కాదు.. ప్రతి ఒక్కరూ పార్టీకి విధేయులై ఉంటారని ఆశిస్తున్నా" అని అన్నారు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.

కాంగ్రెస్​ భేటీ వాయిదా...

రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అత్యవసరంగా శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఈ ఉదయం 10గంటలకు భేటీ జరుగుతుందని ఎమ్మెల్యేలందరికీ సమాచారం అందించింది. అయితే... అనేక మంది హాజరుకాలేదు. ఫలితంగా సమావేశం వాయిదా పడింది.
అనేక మంది ఎమ్మెల్యేలు బెంగళూరులో లేకపోవడమే భేటీ వాయిదాకు కారణమని కాంగ్రెస్​ వర్గాలు తెలిపాయి.

కీలక నేతల భేటీ

జేడీఎస్​ అధినేత హెచ్​డీ దేవెగౌడతో భేటీ అయ్యారు కాంగ్రెస్​ నేత, మంత్రి డీకే శివకుమార్. భవిష్యత్​ కార్యాచరణపై చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details