శబరిమల వివాదాన్ని ఎన్నికల వేళ కాంగ్రెస్ మరోమారు తెరపైకి తీసుకొచ్చింది. అయ్యప్ప పేరుతో భాజపా ఆడిన నాటకాన్ని ప్రజలు సహించబోరని హెచ్చరించారు కాంగ్రెస్ నాయకులు. శబరిమల భక్తులను ప్రధాని నరేంద్రమోదీ మోసం చేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే శబరిమల పట్ల ప్రధాని అత్యంత శ్రద్ధ చూపిస్తారని ఎద్దేవా చేశారు. ముమ్మారు తలాఖ్ మాదిరిగానే శబరిమల విషయంలోనూ ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు సాహసించడం లేదని ప్రశ్నించారు.
'శబరిమలపై ఆర్డినెన్సు ఎందుకు తీసుకురారు?'
శబరిమల వివాదంపై కాంగ్రెస్ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై ప్రశ్నల వర్షం కురిపించింది. పార్లమెంటులో శబరిమలపై ఒక్కమాట మాట్లాడని ప్రధాని... ఎన్నికలు వచ్చే సరికి ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆరోపించింది.
'అయ్యప్ప భక్తులను మోదీ మోసం చేశారు'
" శబరిమల విషయంపై ప్రధాని ఎందుకు నాటకాలాడుతున్నారు? పార్లమెంటులో జనవరి 4న ఇదే అంశాన్ని లేవనెత్తాను. భక్తుల నమ్మకాలను రక్షించేందుకు ప్రభుత్వం కలుగజేసుకోవాలని కోరాను. ప్రధాని గానీ, ఆయన మంత్రులు గానీ శబరిమల అంశంపై పార్లమెంటులో ఒక్క మాటైనా మాట్లాడారా? "
- కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి