బిహార్లో జోరుగా ఎన్నికల ప్రచారాలు కొనసాగిస్తోంది భాజపా. రెండో రోజూ ఆ రాష్ట్రంలో పర్యటించారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ క్రమంలో కాంగ్రెస్- రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)లపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు సీపీఎం(ఎమ్ఎల్)తో కలిసి రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నాయని అన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే నక్సలిజం మళ్లీ పురుడు పోసుకుంటుందని విమర్శలు గుప్పించారు.
ఆ కూటమి నక్సలిజాన్ని ప్రేరేపిస్తోంది: సీఎం యోగి - బిహార్లో యోగి ఆదిత్యనాథ్ ప్రచారం
బిహార్లో జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. రెండో రోజు ర్యాలీలో భాగంగా జాముయి, భోజ్‌పుర్, పట్నా జిల్లాల్లో పర్యటించారు యోగి. ఈ సందర్భంగా మోదీ, షా ఆధ్వర్యంలోని భాజపా అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించిన ఆయన.. కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు కమ్యూనిస్టులతో కలిసి హింసను ప్రేరేపిస్తున్నాయని విమర్శించారు.
బుధవారం.. జాముయి, భోజ్‌పుర్, పట్నా జిల్లా ఎన్నికల ర్యాలీలో పాల్గొనారు యోగి. ప్రసంగంలో భాగంగా కేంద్రంలో భాజపా అభివృద్ధిని కొనియాడిన యూపీ సీఎం.. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై ప్రశంసలు కురిపించారు. కశ్మీర్లో ఆర్టికల్-370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, పౌర సవరణ చట్టం(సీఏఏ) వంటి చారిత్రక ఘట్టాలను అక్కడి ప్రజలకు నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రగతి పట్ల దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పట్నా సిట్టింగ్ ఎమ్మెల్యే జయవర్ధన్ యాదవ్ కోసం ప్రచారం చేసిన ఆయన.. పాలిగంజ్ వద్ద తన రెండో రోజు ర్యాలీని ముగించారు.
ఇదీ చదవండి:బిహార్లో యోగికి క్రేజ్- కీలక స్థానాల్లో ప్రచారం