అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు వారికి మేలు చేకూర్చేలా ఉందన్నారు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. పార్టీ జారీ చేసిన విప్ చెల్లుబాటు కాదని చెప్పి, ప్రజా తీర్పును ఉల్లంఘించి ద్రోహం చేసిన వారికి రక్షణ కల్పించేలా ఉందన్నారు. ఫిరాయింపు చట్టాన్ని ప్రశ్నార్థకంగా మార్చిన ఈ తీర్పు న్యాయవ్యవస్థ పనితీరు నిదర్శనంగా నిలుస్తోందన్నారాయన.
"విప్ చెల్లుబాటు కాదని సుప్రీం చెప్పింది. ప్రజలకు ద్రోహం చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించే... రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను ఈ తీర్పు ప్రశ్నార్థకంగా మార్చింది. స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్న ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించేలా ఈ తీర్పు ఉంది."
-రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్.
గతంలో ఉత్తరాఖండ్‌లో అధికారంలోకి వచ్చేందుకు భాజపా చేసిన చట్ట వ్యతిరేక ప్రయత్నాలను అడ్డుకుని.. 2016 మేలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు సుర్జేవాలా.
శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసిన 15 మంది కూటమి ఎమ్మెల్యేల వ్యాజ్యాలపై సుప్రీం బధవారం తీర్పు వెలువరించింది. రాజీనామాలు ఆమోదించాలన్న అభ్యర్థనపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోయినా.... బలపరీక్షకు ముందు రెబల్స్‌కు ఉపకరించేలా కీలక ఆదేశాలిచ్చింది.